CM Revanth Reddy :బీఆర్ఎస్,బీజేపీ ఒకటై కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు,ఎవరు అడ్డొచ్చినా పండబెట్టి తొక్కుతాం-రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : బీఆర్ఎస్, బీజేపీ ఒకటై లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు పన్నుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఈ పన్నాగాలు పన్నుతున్నారన్నారు.
CM Revanth Reddy : 60 ఏళ్ల నాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది ఖమ్మం జిల్లానేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గుర్తు చేశారు. ఇవాళ తాను సీఎం హోదాలో ఇక్కడ మాట్లాడుతున్నానంటే అది ఈ జిల్లా ప్రజలు పెట్టిన భిక్షేనని అభివర్ణించారు. భద్రాచలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం(Indiramma Housing Scheme) ప్రారంభించిన అనంతరం పినపాక నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన "ప్రజా దీవెన" భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఉద్వేగంగా ప్రసంగించారు. 60 సంవత్సరాల ఆకాంక్షకు, వందలాది మంది బలిదానానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షకు ఖమ్మం(Khammam) జిల్లానే ఊపిరిపోసిందని కొనియాడారు. నాడు ఉద్యోగం కోసం కడుపు రగిలిన ఒక నాయకుడు నిర్మించిన ఉద్యమం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేలా చేసిందని గుర్తు చేశారు. 18 సంవత్సరాల కిందట ఖమ్మం జిల్లాకు వచ్చిన తనను ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని తెలిపారు. రక్త సంబంధం లేకపోయినా రక్తాన్ని చెమటగా మార్చి మొన్నటి ఎన్నికల్లో పది స్థానాలకు తొమ్మిదింటిని గెలిపించారని పేర్కొన్నారు. అందుకే ఈ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ శ్రీరామచంద్రుని సాక్షిగా ఇందిరమ్మ పథకాన్ని ఇక్కడ ప్రారంభించినట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లాకే ఆ ఘనత
బీఆర్ఎస్, బీజేపీలకు(BRS BJP) ఖబర్దార్ చెబుతూ వేలాది మంది ప్రజలు సభకు తరలిరావడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్రమ కేసులతో నాయకులు జైళ్లలో మగ్గుతున్నప్పుడు కార్యకర్తలు జెండా మోసి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని తెలిపారు. 2023 సెప్టెంబర్ 17న తుక్కుగూడలో సోనియా గాంధీ 6 గ్యారంటీల హామీని ప్రకటించారని, దేశంలో మడమతిప్పని నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే ఆమె సోనియా అని కొనియాడారు. కేసీఆర్(KCR) పదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టి దళితులకు మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్, ఇంటికో ఉద్యోగం వంటి అమలు కాని హామీలిచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేశారని దుయ్యబట్టారు. అలాంటి కేసీఆర్ ను 100 మీటర్ల గోతిలో పాతిపెట్టిన ఘనత ఖమ్మం జిల్లాకే దక్కుతుందన్నారు. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన 9 మంది శాసనసభ్యుల్లో ఒకరు డిప్యూటీ సీఎం, మరొకరు రెవెన్యూ మంత్రి, మరొకరు వ్యవసాయ శాఖ మంత్రిగా కొలువయ్యారని తెలిపారు. అలాగే రేణుకా చౌదరికి రాజ్యసభ స్థానం ఇచ్చి గౌరవించామన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం ఎంపీ రేణుకా చౌదరి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ లను కేంద్ర మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. ఇది ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత అని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నాలుగు స్థానాలను ప్రకటిస్తే మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి బలరాం నాయక్ పేరు ఖరారు కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. బలరామ్ ను లక్షా 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలని సూచించారు.
పిల్లి శాపనార్ధాలు పెడితే ఉట్టి తెగి పడదు
రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేస్తుంటే తండ్రి, కొడుకులు.. బిడ్డ అల్లుళ్ళు శాపనార్ధాలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉట్టి మీద సట్టికి పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపడదని పోలిక చెప్పారు. "పదేళ్లుగా మీరు ఏం చేశారు.. 500 కే సిలిండర్ ఇస్తున్నాం.. ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టాం.. ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్నాం.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పట్టాలెక్కించాం.. నీకు సిగ్గు లేదా కేటీఆర్(KTR)..? ఈ విషయాన్ని మీ నాన్నకు ఎందుకు చెప్పవు..? మీ హయాంలో ఉద్యోగాలు రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమై తెలంగాణ బిడ్డలు చనిపోతుంటే ఎప్పుడైనా వారి ఇళ్లకు వెళ్లి పలకరించారా?" అంటూ రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే బిర్లా రంగ సమితి అని సీఎం అభివర్ణించారు. "ఖమ్మం జిల్లాలో ఒంటి కన్ను శివరాజు ఆ రోజుల్లో నీలిగేవాడు.. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటై కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు పన్నుతున్నాయి." అని రేవంత్ విమర్శించారు.
ఎవరు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కుతాం
కాంగ్రెస్ అభ్యర్థులను(Congress Candidates) ప్రకటించిన చోట ఆ పార్టీలు ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. "నిజామాబాద్ లో ఈసారి మీ బిడ్డకు టికెట్ ఇవ్వవా.. పోటీ చేస్తే జనం బండకేసి కొడతారని అనుమానం వచ్చిందా?" అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ, కేడీ కలిసి కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నారని, 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వారికి తెలిసే ఈ పన్నాగాలు పన్నుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని డాక్టర్ లక్ష్మణ్ జోష్యం చెప్పారని, ఎనిమిది స్థానాల్లో గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తుందని రేవంత్ ప్రశ్నించారు. అంటే బీఆర్ఎస్ తో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కూలగొడతారా? అన్నారు. మేము గేట్లు తెరిస్తే కేటీఆర్, హరీష్ రావు మినహా అందరూ కాంగ్రెస్ లో చేరిపోతారని చెప్పారు. నీతిగా రాజకీయాలు చేస్తున్నామని ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. "నల్లమల అడవుల నుంచి ప్రగతి భవన్ దాకా తొక్కుకుంటూ, బద్దలు కొట్టుకుంటూ వచ్చినం.. కార్యకర్తలే నాకు వెయ్యి ఏనుగుల బలం.. ఎవరు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కుతాం" అంటూ రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం
సంబంధిత కథనం