MP Vijayasai Reddy :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న వైసీపీ ఎంపీ, కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు-hyderabad news in telugu congress leader complaint to police on mp vijayasai reddy comments on ts govt ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mp Vijayasai Reddy :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న వైసీపీ ఎంపీ, కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

MP Vijayasai Reddy :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న వైసీపీ ఎంపీ, కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

Bandaru Satyaprasad HT Telugu
Feb 06, 2024 03:07 PM IST

Complaint On Ysrcp MP Vijayasai Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్, వైసీపీ కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

ఎంపీ విజయసాయి రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
ఎంపీ విజయసాయి రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

Complaint On Ysrcp MP Vijayasai Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని రాజ్యసభలో ఆన్ రికార్డ్ లో విజయ సాయిరెడ్డి మాట్లాడిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్, వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఏపీలో జరిగే ఎన్నికలకు వైసీపీకి బీఆర్ఎస్ ఫండింగ్ చేస్తుందన్నారని ఆరోపించారు. వైసీపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సుస్థిర పాలన అందిస్తుందన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయ సాయి రెడ్డి లాంటి నాయకుల వాఖ్యలు చెల్లుబాటు కావన్నారు. విజయసాయి రెడ్డి వాఖ్యల వెనుక కుట్ర కోణాన్ని సీబీఐతో విచారణ చేయాలని కాల్వ సుజాత డిమాండ్ చేశారు. రాజ్యసభ ఛైర్మన్ విజయ సాయి రెడ్డి వాఖ్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లలో విజయసాయి రెడ్డిపై విజయా రెడ్డి, కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు.

ఎంపీ విజయసాయి రెడ్డి ఏమన్నారంటే?

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో విరుచుకుపడ్డారు. నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ...కాంగ్రెస్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ విలన్‌గా మారిందన్నారు. రాష్ట్రాన్ని విభజించి ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగు అవుతుందన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ కూడా ఉండరంటూ సెటైర్లు వేశారు. 2029 ఎన్నికల తర్వాత కూడా తాను ఎంపీగానే ఉంటానన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ ఓడిపోతారని జోస్యం చెప్పారు. 2029 నాటికి దేశం కాంగ్రెస్ ముక్త భారత్ గా మారుతుందన్నారు. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. మరో 3 నెలల్లోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ కు అలవాటే

ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించడంపై వైసీపీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తుంది. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ పార్టీకి కొత్తమీ కాదన్నారు. రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం చేసిందని మండిపడ్డారు. ప్రత్యేకహోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని ఎంపీ విజయసాయి రెడ్డి నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదన్నారు.

ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, వైసీపీ కుట్ర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

Whats_app_banner