BJP 1st list for Lok Sabha: బీజేపీ తొలి జాబితా వెల్లడి; వారణాసి నుంచి మోదీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా..
BJP 1st list for Lok Sabha: 024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ శనివారం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు పోటీ చేయనున్న స్థానాలను బీజేపీ ఈ తొలి జాబితాలో ప్రకటించింది.
2024 లోక్ సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ప్రకటించారు. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి పోటీ చేస్తున్నారని వెల్లడించారు. మొదటి జాబితాలో 34 మంది కేంద్ర, సహాయ మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు ఉన్నాయని తావ్డే తెలిపారు.
తెలంగాణ నుంచి
తెలంగాణ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్న పలువురు అభ్యర్థుల పేర్లను బీజేపీ తొలి జాబితాలోనే ప్రకటించింది. తొలి జాబితాలో 9 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఆ వివరాలు..
కరీంనగర్ - బండి సంజయ్ కుమార్
నిజామాబాద్ - అరవింద్ ధర్మపురి
జహీరాబాద్ - బీబీ పాటిల్
సికింద్రాబాద్ - జి. కిషన్ రెడ్డి
చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ - శ్రీమతి డా. మాధవీలత
భువనగిరి - బూర నర్సయ్య గౌడ్
మల్కాజిగిరి - ఈటల రాజేందర్
నాగర్ కర్నూల్ - పి. భరత్
బీజేపీ ఫస్ట్ లిస్ట్ లోని ప్రముఖులు..
అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు, దిబ్రూగఢ్ నుంచి సర్బానంద సోనోవాల్, ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్, గాంధీనగర్ నుంచి అమిత్ షా, పోర్ బందర్ నుంచి మన్సుఖ్ మాండవీయ, నవ్సారి నుంచి సీఆర్ పాటిల్, గొడ్డా నుంచి నిషికాంత్ దూబే ఉన్నారు. త్రిస్సూర్ నుంచి సురేష్ గోపి, పతనంతిట్ట నుంచి అనిల్ ఆంటోనీ, తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్, గుణ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, బికనీర్ నుంచి అర్జున్ మేఘ్వాల్, అల్వార్ నుంచి భూపేంద్ర యాదవ్, జోధ్ పూర్ నుంచి గజేంద్రసింగ్ షెకావత్, కోటా నుంచి ఓం బిర్లా తదితర బీజేపీ సీనియర్లు పోటీలో నిలుస్తున్నారు.
పనితీరుపైననే..
కీలకమైన 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అభ్యర్థులను ప్రకటించడానికి ముందు పార్టీ అభ్యర్థుల వడపోతపై భారీ కసరత్తును నిర్వహించింది. సిట్టింగ్ ఎంపిల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. చివరగా పార్టీ సీఈసీ సమావేశంలో తుది జాబితాపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 స్థానాలు, ఎన్డీఏ 400 స్థానాలు గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.