Rajaiah Re Entry: రాజయ్య కు బీఆర్ఎస్ గేట్లు క్లోజ్ అయినట్టేనా..? పార్టీ మారినోళ్లను మళ్లీ చేర్చుకోమంటున్న KTR, హరీష్-are brs gates closed for rajaiah ktr harish who wants to rejoin the party marinos ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Are Brs Gates Closed For Rajaiah? Ktr, Harish Who Wants To Rejoin The Party Marinos

Rajaiah Re Entry: రాజయ్య కు బీఆర్ఎస్ గేట్లు క్లోజ్ అయినట్టేనా..? పార్టీ మారినోళ్లను మళ్లీ చేర్చుకోమంటున్న KTR, హరీష్

HT Telugu Desk HT Telugu
Apr 04, 2024 09:52 AM IST

Rajaiah Re Entry: అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసిన స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది!

దిక్కుతోచని స్థితిలో మాజీ మంత్రి రాజయ్య
దిక్కుతోచని స్థితిలో మాజీ మంత్రి రాజయ్య

Rajaiah Re Entry: కడియం శ్రీహరి తనకు టికెట్ దక్కకుండా చేశాడనే ఆక్రోశం, సొంత పార్టీ ఆదరిస్తుందన్న ధీమాతో రెండు నెలల కిందట ఆయన BRS బీఆర్ఎస్‌కు రాజీనామా చేయగా.. కాంగ్రెస్ Congress పార్టీ తాజాగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం కావ్యకే టికెట్ కేటాయించింది.

ట్రెండింగ్ వార్తలు

దీంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిన Ex minister తాటికొండ రాజయ్య మళ్లీ ఓ నేత సాయంతో బీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నా... పార్టీ పెద్దల నుంచి మాత్రం వ్యతిరేక సంకేతాలే అందుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నేతలను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని పార్టీ పెద్దలు చెబుతుండటంతో రాజయ్యకు గులాబీ గేట్లు క్లోజ్ అయినట్టేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్ఎస్ పార్టీని వీడి రెండు నెలలు

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 2009 నుంచి 2018 వరకు బై ఎలక్షన్స్ కలుపుకొని, మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు డాక్టర్ తాటికొండ రాజయ్య. మొన్న 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి టికెట్ ఆశించారు.

అప్పటికే కడియం శ్రీహరి పార్టీ పెద్దల సపోర్ట్ తో టికెట్ పై కర్చీఫ్ వేయడం, ఆ తరువాత జానకీ పురం సర్పంచ్ నవ్య వ్యవహారంతో చతికిలపడిన రాజయ్యకు గులాబీ పార్టీ టికెట్ నిరాకరించింది. ఆ తరువాత స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ ను కడియం శ్రీహరికి కట్టబెట్టగా.. రాజయ్య తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీంతో గులాబీ అధిష్ఠానం ఆయనకు రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్ గా అవకాశం కల్పించింది.

ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రాజయ్య కొంత మౌనం పాటించారు. ఇదిలాఉంటే అంతకుముందు నుంచే కడియం, తాటికొండ రాజయ్య మధ్య వైరం ఉండటం, అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి విజయం సాధించడంతో తట్టుకోలేకపోయిన రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడేందుకే సిద్ధపడ్డారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలోకి ప్రయత్నాలు చేస్తూనే ఫిబ్రవరి 3వ తేదీన రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

కనికరించని కాంగ్రెస్ పార్టీ

తాటికొండ రాజయ్య రాజకీయ ప్రస్థానం 1997లో కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమైంది. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్ , ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీలో చేరాడు.

ఆ తరువాత 2012 లోనే జరిగిన బై ఎలక్షన్స్ తోపాటు 2014, 2018 జనరల్ ఎలక్షన్స్ లో విజయం సాధించాడు. ఇదిలాఉంటే బీఆర్ఎస్ కు ఫిబ్రవరి 3న రాజీనామా చేసి రాజయ్య.. తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో పార్టీ పెద్దలతో పాటు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలను కూడా కలిశారు.

స్టేషన్ ఘన్ పూర్ లో ఉన్న కాంగ్రెస్ నేత, మొన్నటి ఎలక్షన్స్ లో ఓటమి చవి చూసిన సింగపురం ఇందిరా అడ్డంకులు సృష్టించారు. రాజయ్యను పార్టీలో చేర్చుకోవద్దంటూ గాంధీ భవన్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో పాటు జానకీపురం సర్పంచ్ నవ్య విషయంలో కొంత నెగటివిటీ ఉండటం, పలుమార్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేర్చుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

రెండు నెలలపాటు రాజయ్య హస్తం నేతల చుట్టూ తిరుగుతూనే వచ్చారు. కానీ తాజాగా కడియం శ్రీహరి, ఆయన కూతురు డాక్టర్ కడియం కావ్య ఇద్దరూ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. warangal Mp టికెట్ వారికి కట్టబెట్టడంతో రాజయ్య తన ప్రయత్నాలు కూడా విరమించుకున్నారు. కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ Congress లోకి జంప్ అవడంతో బీఆర్ఎస్ ప్లేస్ ఖాళీ కాగా.. రాజయ్య మళ్లీ గులాబీ కండువా కప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కేసీఆర్ కాళ్లు మొక్కినా పార్టీలో చేర్చుకోమన్న కేటీఆర్

మళ్లీ బీఆర్ఎస్ లోకి ప్రయత్నాలు చేస్తున్న రాజయ్య.. తనకు సన్నిహితుడిగా పేరున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ద్వారా గులాబీ కండువా కప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పల్లా కూడా సుముఖత వ్యక్తం చేసి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

పార్టీ పెద్దలైన కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ చేసిన వ్యాఖ్యలు రాజయ్యను కలవరానికి గురి చేస్తున్నాయి. ఐదు రోజుల కిందట తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ వదిలి వెళ్లిన నేతల విషయంలో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నిన్న, మొన్నటివరకు తాము అధికారంలో ఉన్నప్పుడు తమతో ఉన్న కొంతమంది నేతలు, నేడు అధికారం పోగానే వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. పార్టీని వదిలి వెళ్లిన నేతలెవరైనా మళ్లీ వస్తామని కేసీఆర్ కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలో రానివ్వబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.

రెండు రోజుల కిందట వరంగల్ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన హరీశ్ రావు కూడా అదే విధంగా స్పందించారు. పార్టీ విడిచి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోబోమని, ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న నేతలు కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీలో కీలకమైన ఇద్దరు వ్యక్తులూ పార్టీ నిర్ణయాన్ని చెప్పడంతో రాజయ్య గందరగోళంలో పడ్డారు.

ఓ వైపు జనగామ ఎమ్మెల్యేతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన కొందరు కార్పొరేటర్లు, కింది స్థాయి నేతలు కూడా రాజయ్య వైపు మొగ్గు చూపుతుండగా.. కేటీఆర్, హరీశ్ రావు పార్టీ నిర్ణయంగా చెప్పిన మాటలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పటికే వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం వెతుకుతున్న కేటీఆర్, హరీశ్ రావు.. రాజయ్య విషయంలో అంతే ఖరాఖండీగా ఉంటారా.. లేదా స్థానిక నేతల ఒత్తిళ్ల మేరకు నిర్ణయం మార్చుకుని రాజయ్యను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కేటాయిస్తారా చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం