GWMC Employees: మున్సిపల్ కార్మికులకు గుడ్ న్యూస్.. గ్రేటర్ వరంగల్‌లొ ఒక్కపూట విధులు…
GWMC Employees: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే బల్దియా కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న శానిటేషన్ కార్మికులందరూ కేవలం ఒక్కపూట మాత్రమే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
GWMC Employees: వేసవి ఉష్ణోగ్రతలు మండిపోతున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ కమిషనర్ Municipal Commissioner కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కమిషనర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. గురువారం నుంచే Sanitation Workers ఒక్కపూట విధులను అమలు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య health సంరక్షణ దృష్ట్యా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పని చేయాలని సూచించారు. దీంతో మున్సిపల్ కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
వడదెబ్బ తాకకుండా చర్యలు
గ్రేటర్ వరంగల్ పరిధిలో పబ్లిక్ హెల్త్, అర్బన్ మలేరియా విభాగాల్లో దాదాపు 2 వేల మందికిపైగా శానిటేషన్ సిబ్బంది పని చేస్తున్నారు. వాళ్లంతా ప్రతిరోజు రోడ్లు శుభ్రం చేయడం నుంచి డ్రైనేజీలు క్లీన్ చేయడం, చెత్త ఎత్తడం, దూరంగా తరలించడం, చెట్ల కొమ్మలు కొట్టడం, గడ్డి తొలగించడం, దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టడం లాంటి పనులు చేస్తున్నారు.
తెల్లవారుజాము నాలుగున్నర, ఐదు గంటల నుంచి సాయంత్రం వరకు విధుల్లోనే ఉంటూ శ్రమిస్తున్నారు. కాగా ఇటీవల వేసవి నేపథ్యంలో ఎండలు మండుతుండగా.. పొద్దటి నుంచి సాయంత్రం వరకు ఎండలో పని చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే సిబ్బందికి ఒక్క పూట మాత్రమే విధులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అంతేగాకుండా మధ్యాహ్నం వరకు పని చేసే సిబ్బంది ఎండ దెబ్బకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత డిపార్ట్మెంట్ హెడ్ లకు సూచించారు. ఓరల్ రీ హైడ్రైషన్ సాల్ట్(ఓఆర్ఎస్) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, సిబ్బందికి సరిపడా అందజేయాలని ఇప్పటికే మున్సిపల్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్ కు సూచించారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది వడదెబ్బకు గురి కాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి వాతావరణం వేడెక్కిపోతోంది. ఇక మధ్యాహ్నం వరకు సూర్యుడు నడినెత్తిన తాండవం చేస్తుండటంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొంతమంది ఇళ్ల నుంచి బయటకు రావాలనే జంకుతున్నారు.
కాగా కొద్దిరోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. నాలుగైదు రోజుల కిందట ఖిలా వరంగల్ మండలంలో 43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక బుధవారం కూడా వరంగల్ నగరంలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. కనిష్ట టెంపరేచర్ 37 డిగ్రీలుగా రికార్డ్ అయ్యింది.
మరో వైపు హనుమకొండ, కాజీపేటతో పాటు గీసుగొండ, నల్లబెల్లి, పర్వతగిరి, హసన్ పర్తి, రాయపర్తి తదితర మండలాల్లో కూడా 35 నుంచి 37 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది. ఇప్పటికే ఎండలు మండిపోతుండగా.. కొన్నిచోట్ల జనాలు ఎండ దెబ్బకు విలవిలలాడుతున్నారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే ఒక్క పూట విధులు కేటాయించడంతో శానిటేషన్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పూత మాత్రమే విధులు కేటాయించి, కార్మికుల సంక్షేమం పై దృష్టి పెట్టడంతో కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే కు ధన్యవాదాలు తెలిపారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం