CM Revanth Reddy : కేసీఆర్.... నేను జానారెడ్డిలా కాదు, రేవంత్‌రెడ్డిని - చర్లపల్లి జైలుకు పంపిస్తా!
CM Revanth Reddy On KCR : కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన జన జాతర సభలో మాట్లాడిన ఆయన… ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదే లేదన్నారు. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తాను అంటూ హెచ్చరించారు.
CM Revanth Reddy On KCR: కేసీఆర్ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). శనివారం తుక్కుగూడలో నిర్వహించిన జన జాతర సభలో మాట్లాడిన ఆయన… గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా దోచుకోని.. వంద సంవత్సరాల విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి కేసీఆర్(KCR)… తమ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ… వెంట్రుక కూడా పీకలేవని అంటావా..? ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోవటానికి తాను జానారెడ్డిని కాదని, రేవంత్ రెడ్డి అని చెప్పుకొచ్చారు.
“కాళ్లు విరిగిందని, కట్టె పట్టుకుంటున్నారని, మరోవైపు బిడ్డ జైలులో ఉందని సంమయనం పాటిస్తున్నాం. కష్టకాలంలో మర్యాదపూర్వకంగా వ్యవహరించాం. కానీ తాము సైలెంట్ గా ఉన్నామని ఏది పడితే అది మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. నేను పెద్దలు జానారెడ్డిలా కాదు, రేవంత్ రెడ్డిని. చర్లపల్లి జైలుకు పంపించి చిప్పకూడు తినిపిస్తా. మీరు పేదలకు ఎలాగో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించలేదు. కానీ నేను గతంలో చెప్పినట్లు మీ కుటుంబం అంతా ఉండేటట్టు చర్లపల్లి జైలులోనే డబుల్ బెడ్ ఇళ్లు కట్టిస్తాను” అంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తెలంగాణలో తాము ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). రాష్ట్ర ఆర్థికపరిస్థితిని గాడిలో పెట్టామన్నారు. తెలంగాణలో జెండా ఎగరవేశామని... జూన్ 9వ తేదీన ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు తెలంగాణ ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఇదే ప్రాంగణం నుంచి ఆ రోజు శంఖావం మోగించి బీఆర్ఎస్ ఓడించామని... ఇక బీజేపీని ఓడిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 14 సీట్లకుపైగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.
బీజేపీపై(BJP) విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. మోదీ (Modi)ఇస్తామన్నా ఉద్యోగాలను ఇచ్చారా అని ప్రశ్నించారు. చట్టంలో ఉన్న విభజన హామీలను అమలు చేశారా అని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, ఐటీఐఆర్ కారిడార్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలోనూ మోసం చేశారని దుయ్యబట్టారు. బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలన్నారు.
మేనిఫెస్టో విడుదల….
హైదరాబాద్ తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభలో 5 గ్యారంటీలతో మేనిఫెస్టోను(Nyay Patra) విడుదల చేశారు. ఈ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahu Gandhi) మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అంటే తప్పనిసరిగా అమలవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో మేనిఫెస్టో విడుదల చేసి...అమలుచేస్తున్నామన్నారు. ఇప్పుడూ జాతీయ స్థాయిలో 5 గ్యారంటీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించామన్నారు.
- యువ న్యాయం- భారతదేశంలో నిరుద్యోగులకు రూ. లక్ష శిక్షణ భృతి, ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏడాది పాటు అప్రెంటిస్ షిప్, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువత కోసం రూ.5 వేల కోట్ల కొత్త స్టార్టప్ ఫండ్
- నారీ న్యాయం(Naari Nyay) -మహిళలు అటు ఆఫీసుల్లో, ఇటు ఇంట్లో రెండు చోట్లా ఉద్యోగాలు చేస్తున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. మోదీ సర్కారు వచ్చాక చాలా మంది నిరుపేదలుగా మారారని ఆరోపించారు. అందుకే నారీ న్యాయ్ పథకాన్ని తీసుకువస్తున్నామన్నారు. నారీ న్యాయ్ కింద ప్రతీ కుటుంబంలో ఒక మహిళకు రూ.లక్ష ఆర్థిక సాయం(One Lakh for Woman) చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా దేశ ముఖ చిత్రం మారబోతుందన్నారు. నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష జమ చేస్తామని ప్రకటించారు. దేశంలో పేదరికాన్ని తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు.
- రైతు న్యాయం(Kisan Nyay)- దేశంలో ప్రతి రోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని సంపన్నులకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ(Loan Waiver) చేసిందని ఆరోపించారు. కానీ రైతులు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. అందుకే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్ట బద్దత కల్పిస్తుందన్నారు. దేశంలోని ప్రతీ రైతు పండించే పంటకు MSP ప్రకటిస్తామన్నారు. స్వామి నాథన్ కమిటీ సిపార్సుల ప్రకారం ఎమ్ఎస్పీ ధరలు నిర్ణయిస్తామన్నారు.
- శ్రామిక న్యాయం- కార్మికులకు, కూలీలకు కనీస వేతనాలు తీసుకువస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. MGNREGA కింద రోజుకు రూ.400 ఇస్తామన్నారు.
- సామాజిక న్యాయం- దేశంలో 50 శాతం జనాభా వెనుకబడిన తరగతులు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనర్టీలు, 5 శాతం జనరల్ కేటగిరీ ప్రజలు ఉన్నారని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. మొత్తం 90 శాతం జనాభాలో పెద్ద కంపెనీల్లో వీళ్లు కనిపించడంలేదన్నారు. దేశంలోని పెద్ద కంపెనీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓనర్లు లేరన్నారు. బడ్జెట్ లోని 100 రూపాయల్లో కేవలం 6 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఖర్చు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాగానే దేశాన్ని ఎక్స్ రే తీస్తుందన్నారు. తెలంగాణలో మాదిరిగా దేశం మొత్తం కుల గణన(Caste Census) అమలుచేస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆర్థికపర సర్వే చేస్తామన్నారు. దేశ సంపద ఎవరి దగ్గర ఉందో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ చారిత్రక అడుగుతో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామన్నారు. దేశంలోని అన్ని రంగాల్లో వెనుకబడిన తరగతులకు వారి హక్కులు కల్పిస్తామన్నారు