Karimnagar Congress MP Candidate : పార్లమెంట్ ఎన్నికల వేళ కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై గందరగోళం నెలకొంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల(Lok Sabha Nominations) ప్రక్రియ ప్రారంభం అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు అభ్యర్థి ఎంపిక కాలేదు. అభ్యర్థిత్వంపై అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసహనంతో పాటు అయోమయం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొనడం.. పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. అభ్యర్థి ఎంపికపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ రాజేందర్ రావు అనుచరులు టికెట్ ఖరారు అయిందని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు మాత్రం నేడో రేపో.. ఏ క్షణానైనా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం కీలకం కానుంది. అయితే నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ మొదట్లో ప్రవీణ్ రెడ్డి వైపు మొగ్గు చూపగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజేందర్ రావుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పార్టీ పెద్దలు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పార్టీ పెద్దలు అభ్యర్థి ఎంపికపై జాప్యం చేస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కరీంనగర్ కు చెందిన పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాకుండా హుస్నాబాద్ (Hasnabad)నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యారు. హుస్నాబాద్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి (Algireddy Praveen Reddy)స్థానాన్ని పొన్నం తీసుకోవడంతో ఆ సమయంలో ప్రవీణ్ రెడ్డికి భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పొన్నంకు సహకరించి గెలుపునకు కృషి చేశారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో పొన్నం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటు రాజేందర్ రావుకు సహకరిస్తూ రాజకీయ డ్రామాకు తెరలేపారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి (Karimnagar Congress MP Candidate)ఎవరు అనేది ఇంకా అధిష్టానం స్పష్టం చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం కలకలం సృష్టిస్తుంది. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వెలిచాల జగపతిరావు తనయుడు రాజేందర్ రావుకు(Velichala Rajender Rao) టికెట్ ఖరారు అయిందని సోషల్ మీడియాలో ఆయన అనుచరులు ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు మాత్రం ఇంకా టికెట్ ఎవరికీ ఖరారు కాలేదని అధిష్టానం నిర్ణయం ఫైనల్ అంటున్నారు. రాజేందర్ రావు అనుచరుల ప్రచారం పట్ల ప్రవీణ్ రెడ్డి వర్గీయులతో పాటు పార్టీ శ్రేణులు కొంత అసహనంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి (Karimnagar Congress Candidate)ఎంపిక ఆలస్యం కావడంతో అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి పునరావృతం అవుతుందనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గా పురమల్ల శ్రీనివాస్ పేరు ఖరారు చేసింది. అప్పటికే బీఆర్ఎస్(BRS) బీజేపీ(BJP) అభ్యర్థులు ప్రచారం చేసి ప్రజలతో మమేకమయ్యారు. తీరా పోలింగ్ నాటికి కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో అభ్యర్థి ప్రజల్లోకి వెళ్లలేక మూడో స్థానానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో సైతం అదే పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. నాయకుల మధ్య సమన్వయం లోపం... ఆధిపత్య పోరుతో అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్కంఠకు తెర దించేలా అధిష్టానం వెంటనే అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
HT Correspondent K.V.REDDY, Karimnagar
సంబంధిత కథనం