AP TS Nominations : ఏపీ తెలంగాణలో ఎన్నికల సమరం... తొలిరోజే నామినేషన్లు వేసిన పలువురు నేతలు
Nominations in Telugu States: ఏపీ తెలంగాణలో ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.
Nominations in Telugu States: ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో జరగనున్న ఎంపీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని 25 లోక్‌సభ నియోజక వర్గాలతో పాటు, 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా…. తొలిరోజు(ఏప్రిల్ 18) పలువురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.
ఖమ్మంలో నామినేషన్…
పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజున ఖమ్మం ఎంపీ స్థానానికి తొలి నామినేషన్ దాఖలయింది. ఆధార్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కుక్కల నాగయ్య గురువారం ఒక సెట్ నామినేషన్ ను ఖమ్మం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ కు అందజేశారు.
వరంగల్ లో ఇలా…
మొదటి రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియకు దూరం ఉండగా.. కొందరు అభ్యర్థులు మాత్రమే ముందుకొచ్చి నామినేషన్లు వేశారు. కాగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంచి రోజులు, శకునాలు చూసుకుని నామపత్రాలు దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కొంతమంది ముహూర్తాలు ఖరారు చేసుకోగా.. ఆయా తేదీల్లో వారివారి పార్టీల పెద్దల సమక్షంలో నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అందులో మహబూబాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత పోటీ చేస్తున్నారు. కాగా మొదటి రోజు నామినేషన్ వేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ ముందుకు రాలేదు. ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రం నామినేషన్ దాఖలు చేశారు. మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామ శివారు గుర్రపు తండాకు చెందిన బానోత్ లింగ్యా నాయక్ నామినేషన్ దాఖలు చేయగా.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ అద్వైత్ కుమార్ సింగ్ కు ఒక సెట్ నామపత్రాలు అందజేశారు. దీంతో మొదటిరోజైన గురువారం ఒకే ఒక నామినేషనల్ దాఖలైనట్లయ్యింది.
వరంగల్ పార్లమెంటు పరిధిలో మొదటి రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ప్రధాన పార్టీల్లో బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్, బీజేపీ నుంచి అరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బరిలో నిలిచారు. కాగా మొదటి రోజు నామినేషన్ వేసేందుకు వారెవరూ ముందుకు రాలేదు. కాగా అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి అంబోజు బుద్ధయ్య, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తౌటపెల్లి నర్మద, ఇండిపెండెంట్ గా బరిగెల శివ నామినేషన్ వేశారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రావీణ్యకు నామపత్రాలను అందజేశారు.
కరీంనగర్ లో నామినేషన్లు…
తొలి రోజు కరీంనగర్ లో రెండు నామినేషన్ లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా కోట శ్యామ్ కుమార్, పొత్తూరి రాజేందర్ నామినేషన్ లు దాఖలు చేశారు. మరో ఇద్దరు నామినేషన్ పత్రాలు లేక వెనుతిరిగారు. పెద్దపల్లిలో నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా దూరం మహిపాల్, నూకల నవీన్, డి.రాజ్ కుమార్, అక్కపాక తిరుపతి నామినేషన్ ధాఖలు చేశారు. తొలి రోజు ప్రధాన పార్టీల నుంచి ఎవ్వరు నామినేషన్ దాఖలు చేయలేదు. 19న కరీంనగర్ లో బిజేపి అభ్యర్థి బండి సంజయ్ తరపున వారి కుటుంబ సభ్యులు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే విధంగా పెద్దపల్లిలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, బిఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, బిజేపి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 20న కరీంనగర్ లో బిఆర్ఎస్ అభ్యర్థిగా బోయినిపల్లి వినోద్ కుమార్ నామినేషన్ దాఖలు చేస్తారు.
ఇక మల్కాజ్ గిరి నుంచి బీజేపీ తరుపున ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా… ఆయన ఇవాళే నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ స్థానం నుంచి రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ తరపున డీకే అరుణ కూడా ఇవాళే నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రేపు కిషన్ రెడ్డితో పాటు ఖమ్మం అభ్యర్థి కూడా బీజేపీ తరపున నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఇవాళే బీఫారమ్ లు అందాయి. వారి కూడా ముహుర్తం చేసుకొని నామినేషన్లు సమర్పించనున్నారు.
ఏపీలో నామినేషన్లు…
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ తొలిరోజు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు తొలిరోజే నామినేషన్లను సమర్పించారు. అన్నిచోట్ల కూడా ఉదయం 11 గంటలకే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.ఒంగోలు తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ వేశారు.
టాపిక్