Bhuvanagiri Groups: భువనగిరి బీజేపీలో గుంపుల గొడవ? ఎంపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ వైఖరిపై సీనియర్ల అలక-clash of groups in bhuvanagiri bjp mp candidate bura narsaiya gouds attitude of seniors ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bhuvanagiri Groups: భువనగిరి బీజేపీలో గుంపుల గొడవ? ఎంపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ వైఖరిపై సీనియర్ల అలక

Bhuvanagiri Groups: భువనగిరి బీజేపీలో గుంపుల గొడవ? ఎంపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ వైఖరిపై సీనియర్ల అలక

HT Telugu Desk HT Telugu
Apr 25, 2024 01:30 PM IST

Bhuvanagiri Groups: తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోక్ సభా నియోజకవర్గాలను గెలుచుకుంటామన్న ధీమాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి ధీమాకు గండికొట్టేలా ఉంది.

బూర నర్సయ్య గౌడ్
బూర నర్సయ్య గౌడ్

Bhuvanagiri Groups: రాష్ట్రంలోని 17 లోక్ సభా నియోజకవర్గాలో పోటీలో ఉన్న ఆ పార్టీ , తమ అభ్యర్థులు కచ్చితంగా గెలుస్తారన్నఅంచనాలో ఉన్న స్థానాలను ఏ కేటగిరీగా, కష్టపడితే గెలుస్తామన్న ధీమా ఉన్న స్థానాలను బి కేటగిరీగా, గట్టిపోటీ ఇచ్చి గౌరవ ప్రదమైన స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు చేస్తామన్న నియోజక వర్గాలను సి కేటగిరీగా విభజించుకుని ఆ మేర వ్యూహాలు రచించుకుందని చెబుతున్నారు.

అలాంటి వాటిలో బి కేటగిరిలో అంటే, కొద్దిగా కష్టపడితే గెలిచే అవకాశం ఉన్న సీట్లలో భువనగిరి ఒకటి. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇపుడు అభ్యర్థికి, స్థానిక నేతల మధ్య పొసగకపోవడం సమస్యగా మారింది.

సీనియర్ల మధ్య.. గ్రూప్ వార్

భువనగిరి బీజేపీలో సీనియర్ నాయకుల మధ్య గ్రూప్ గొడవలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ Bura Narsiah Goud సీనియర్లను పక్కన పెట్టి, కేవలం తన సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇస్తూ.. కుల రాజకీయాలు చేస్తున్నారన్నది పార్టీ నాయలకు ఆరోపణ.

జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రావు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గూడూరు నారాయణరెడ్డి వంటి సీనియర్ నేతలతో ఎంపీ అభ్యర్థి బూరకు పొసగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మరో ఇరవై రోజుల్లోపే పోలింగ్ జరగనున్న తరుణంలో పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న గ్రూప్ వార్ తో పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ప్రచారంలో తమను పట్టించుకోక పోవడం, తమను పక్కన పెట్టి, ఏక పక్షంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు పార్టీ నాయకుల నుంచి వస్తున్నాయి.

బీఆర్ఎస్ కోవర్ట్ గా బీజేపీ అభ్యర్ధి..?

పార్టీ నాయకులు కొందరు మరో అడుగు ముందుకేసి పార్టీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ BRSకు కోవర్ట్ గా పనిచేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. వాస్తవానికి డాక్టర్ బూర 2014 లో బీఆర్ఎస్ నుంచి ఇదే నియోజకవర్గంలో ఎంపీగా విజయం సాధించారు.

అదే బీఆర్ఎస్ నుంచి 2019 లో 5వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి 2021 లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీ BJPకండువా కప్పుకున్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ టికెట్ తెచ్చుకుని పోటీలో ఉన్నారు.

రాజకీయ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ ను వీడిన బూర నర్సయ్య గౌడ్ ఎందుకు తన ఓటమిని తానే చేజేతులా కొనితెచ్చుకుని వద్దనుకుని వదిలేసి వచ్చిన పార్టీకి కోవర్ట్ గా పనిచేస్తారని బూర వర్గం ప్రశ్నిస్తోంది. ఈ ఆరోపణలు చేస్తున్న గూడూరు నారాయణ రెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వారు. గూడూరు నారాయణ రెడ్డి టీపీసీసీకి రాష్ట్ర కోశాధికారి పదివిలో కూడా కొనసాగారు.

కాంగ్రెస్ తో తనకున్న పరిచయాలు, సంబంధాలతో తమ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం లోపాయికారిగా పనిచేస్తున్నారని , అందుకే బీజేపీ శ్రేణుల్లో అభద్రతను, అయోమయాన్ని కలిగించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ వర్గం ప్రతి విమర్శలు చేస్తోంది. మొత్తంగా భువనగిరి నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్ నాయకుల మధ్య జరుగుతున్న ఈ దాగుడుమూతలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం పార్టీలోని తటస్థ వర్గం నుంచి వ్యక్తమవుతోంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

Whats_app_banner

సంబంధిత కథనం