KCR Joins Twitter : ఎక్స్ లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్, కాంగ్రెస్ కరెంట్ విచిత్రాలంటూ పోస్ట్
KCR Joins Twitter : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్(ట్విట్టర్)లో ఖాతా తెరిచారు. ఎంట్రీతోనే కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
KCR Joins Twitter : తెలంగాణ ఆవిర్భావం నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్(BRS).. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ త్వరలో మళ్లీ అధికారంలో వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR)...అధికార కాంగ్రెస్ ఇరుకున పెట్టేందుకు వరుసగా పర్యటనలు, సభలు నిర్వహిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్...తాజాగా సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో ఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లు సోషల్ మీడియా(Social Media)కు దూరంగా ఉన్న ఆయన...ప్రతిపక్షంలో తన పాత్ర పోషించేందుకు రెడీ అయ్యారు.
ఎక్స్ లో కేసీర్ ఎంట్రీ
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్(KCR Joins Twitter)... KCRBRSPresident పేరుతో ఖాతా తెరిచారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో అధికారిక ట్విటర్(KCR Twitter) ఖాతా ఉంది. ఇందులోనే కేసీఆర్ కు సంబంధించిన అన్ని ట్విట్లు వచ్చేవి. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కేసీఆర్ ‘ఎక్స్’ ఖాతా ప్రారంభించారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన నేత అందుబాటులోకి రావడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ సీఎం కేసీఆర్ తొలి పోస్టు పెట్టారు. బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు అంటూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ కరెంట్ చిత్రవిచిత్రాలంటూ ట్వీట్
తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్(KCR)ఎక్స్ లో పోస్టు చేశారు. తాను మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందన్నారు. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు(Current Cuts) పోవడం లేదని ఊదరగొడుతున్నారని, అదంతా అవాస్తవం అన్నారు. తనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతుందని తనతో చెప్పారన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్(Congress Ruling) పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ఎక్స్ వేదికగా కేసీఆర్ ఎద్దేవా చేశారు.
సంబంధిత కథనం