KCR Bus Yatra : మోదీ బడే భాయ్, రేవంత్ చోటే భాయ్ - ఎవరికి ఓటేసినా వారు ఒక్కటే - కేసీఆర్
KCR Bus Yatra in Mahabubnagar: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర మహబూబ్ నగర్ లో కొనసాగుతోంది. నగరంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన ఆయన… బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
KCR Bus Yatra in Mahabubnagar : పదేళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందనేది ప్రజలంతా ఆలోచించాలని కోరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR). ఈ పదేళ్లలో మోదీ(Modi) కనీసం 100 నినాదాలు ఇచ్చారని… కానీ ఒక్క నినాదం కూడా నెరవేరలేదని విమర్శించారు. వాటితో ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తలపెట్టిన బస్సుయాత్ర… మహబూబ్ నగర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్…. “తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర వాళ్లు ఇక్కడ నుండి కాలువ పెట్టి మన నీళ్లు తీసుకుపోతుంటే.. రఘువీరా రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ వస్తే ఇదే డీకే అరుణ నీళ్లు తీసుకుపొండి అని మంగళ హారతులు పట్టింది. ఈమెకు మనం ఓటు వేయాలా” అని ప్రశ్నించారు.
వారిలో ఎవరికి ఓటు వేసినా ఒక్కటే - కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినా.. కాంగ్రెస్‌కు ఓటు వేసినా బావుల వద్ద మోటార్లకు కరెంటు మీటర్లు పెడతారని చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రుణమాఫీ చేస్తామని అన్నారని.. ఇప్పటికీ రైతుబంధు కూడా రాలేదని దుయ్యబట్టారు. తులం బంగారం ఇస్తా అన్నారు.. వచ్చాయా? నిలదీశారు. ప్రస్తుతం ఉన్న సీఎం ఛోటే భాయ్.. నరేంద్ర మోదీ బడే భాయ్. ఛోటే బాయ్‌కి ఓటు వేసినా.. బడే భాయ్ కి ఓటు వేసిన ఒక్కటే అవుతుందన్నారు.
“ముస్లిం సోదరులారా తెలంగాణలో ఇప్పటి వరకు మేము సెక్యులర్ ప్రభుత్వం నడిపించాం.. ఇప్పటి వరకు సెక్యులర్‌గా ఉన్నాం, ప్రాణం పోయిన సెక్యులర్‌గానే ఉంటాం. పవిత్ర రంజాన్ మాసంలో మేము ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ఇచ్చే వాళ్లం.. ఈసారి ఈ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇచ్చిందా మీకు? దేశంలో ఎక్కడా లేని విధంగా నమాజ్ చదివే ఇమామ్ లకు జీతాలు ఇచ్చాం. ఈ బడే భాయ్, చోటే భాయ్ ఒక్కటే. ఆలోచించి ఓటు వేయండి ముస్లిం సోదరులారా”అని కేసీఆర్(KCR) కోరారు.
బీజేపీ అక్కరాని సుట్టమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీార్. మొక్కినా వరమియ్యని వేల్పు అని చెప్పుకొచ్చారు. ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి ? అని ప్రశ్నించారు. వారికి ఓటేసి మన కన్ను మనమే పొడుసుకుందామా? మనకు విషం ఇస్తే మనమే తాగుదామా? దయచేసి ఆలోచన చేయాలి’ అంటూ ప్రజలను కోరారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకోని జాతీయ హోదా కోసం 100 ఉత్తరాలు రాశామని… కానీ కేంద్రంలోని బీజేపీ మాత్రం హోదా ఇవ్వలేదని ఆరోపించారు. మోదీ పాలనలో రూపాయి విలువ పడిపోయిందన్నారు. దేశంలో మోదీ 157 మెడికల్ కాలేజీలు పెడితే… తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. చట్టం ప్రకారం రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒక్కో నవోదయ పాఠశాల ఇవ్వాలి… కానీ తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల అయినా ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనేది ప్రజలంతా ఆలోచించాలని కోరారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు కేసీఆర్. తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని… ఎంపీలను గెలిపిస్తే పార్లమెంట్ లో రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతారని చెప్పారు.