PM Modi warns Rahul Gandhi: ‘‘అమేథీ నుంచి వెళ్లగొట్టిన విధంగానే..’’ - రాహుల్ గాంధీపై మోదీ విమర్శలు
లోక్ సభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రాజకీయ పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా, మహారాష్ట్రలోని నాందేడ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై మరోసారి వ్యంగ్య వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని ఈ ఎన్నికల్లో తన పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్ నుంచి ప్రజలు తరిమికొడతారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు మరో సురక్షితమైన సీటును వెతకాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ () ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పాల్గొన్నారు.
అమేథీ నుంచి వెళ్లగొట్టిన విధంగానే..
ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోట వంటిది. కానీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. తాజాగా, ఆ విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. 2019 లో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ అమేథీ నుంచి పారిపోయేలా చేసిందని, ఇప్పుడు కేరళ లోని వాయినాడ్ నియోజకవర్గం నుంచి కూడా పారిపోయే పరిస్థితి ఏర్పడిందని ప్రధాని మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘తమ యువరాజు కోసం కాంగ్రెస్ నేతలు మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి ఉంది’’ అన్నారు.
ఇండియా కూటమిపై విసుర్లు
విపక్ష కూటమి ఇండియాలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు ఈ లోక్ సభ ఎన్నికల్లో దాదాపు 25% సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. ఆ కూటమిలో ఒకరైన కేరళ సీఎం పినరయి విజయన్ కాంగ్రెస్ నేతలను తాను కూడా ఉపయోగించని భాషలో దూషించారని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల తొలి దశలో దేశ ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఓటేశారని ప్రధాని మోదీ అన్నారు.
ఇతర పార్టీల కార్యకర్తలకు వినతి
ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా విపక్ష పార్టీల కోసం ఎందుకు పని చేస్తున్నారని, మీరంతా ప్రజాస్వామ్యం కోసం కష్టపడాలని విపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలకు ప్రధాని మోదీ సూచించారు. ఈ రోజు కాకపోతే, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు, మీకు అవకాశం వస్తుందని వారికి హామీ ఇచ్చారు. అమేథీ, రాయబరేలీ లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడాన్ని మోదీ (Narendra Modi) గుర్తు చేశారు. తమకు ఓటు హక్కు ఉణ్న నియోజకవర్గంలో వారి పార్టీకి అభ్యర్థి లేనందున తొలిసారిగా ఆ కుటుంబం కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయలేదని గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు
ప్రధాని మోదీ దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. దేశంలో నరేంద్ర మోదీ అవినీతి పాఠశాల నడుపుతున్నారన్నారు. 'కరప్షన్ సైన్స్' అనే సబ్జెక్టు కింద ఆయనే స్వయంగా 'డొనేషన్ బిజినెస్'తో సహా ప్రతి అధ్యాయాన్ని వివరంగా బోధిస్తున్నారు' అని సోషల్ ప్లాట్ ఫామ్ ఎక్స్ లో రాహుల్ గాంధీ ఒక పోస్ట్ చేశారు. సోదాలు చేసి, బెదిరింపులకు పాల్పడి, విరాళాలు ఎలా సేకరిస్తారు? విరాళాలు తీసుకున్న తర్వాత కాంట్రాక్టులు ఎలా పంపిణీ చేస్తారు? అవినీతిపరులను నీతిమంతులుగా చేసే బీజేపీ వాషింగ్ మెషీన్ ఎలా పనిచేస్తుంది? ఏజెన్సీలను రికవరీ ఏజెంట్లుగా చేయడం ద్వారా 'బెయిల్ అండ్ జైల్' ఆట ఎలా సాగుతుంది?.. ఇవన్నీ మోదీ (PM Modi) తన అవినీతి పాఠశాలలో నేర్పిస్తున్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు.