Narendra Modi: జమ్ముకశ్మీర్ పై ప్రధాని మోదీ కీలక ప్రకటన-narendra modi in udhampur j k assembly polls soon statehood to be restored ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Narendra Modi: జమ్ముకశ్మీర్ పై ప్రధాని మోదీ కీలక ప్రకటన

Narendra Modi: జమ్ముకశ్మీర్ పై ప్రధాని మోదీ కీలక ప్రకటన

HT Telugu Desk HT Telugu
Apr 12, 2024 01:35 PM IST

Narendra Modi: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్ లో పర్యటించారు. ఉధంపూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జితేంద్ర సింగ్ తరఫున ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు.

ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (ANI file)

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్ స్థానం నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున స్టార్ క్యాంపెయినర్ గా ప్రధాని మోదీ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఉధంపూర్ లో భారీ బందోబస్తు నడుమ ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఉధంపూర్ లోక్ సభ స్థానానికి తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ సీటు నుంచి జితేంద్ర సింగ్ మూడోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

త్వరలోనే మళ్లీ రాష్ట్ర హోదా

జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. త్వరలోనే జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయన్నారు. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాలుగేళ్ల తర్వాత ఈ లోక్ సభ ఎన్నికలకు జరుగుతున్నాయి.

ఉధంపూర్ లో మోడీ భారీ ర్యాలీ కీలక అంశాలు

  • ఉధంపూర్ లోని బటాల్ బల్లియాన్ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
  • జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర హోదాను పునరుద్ధరించే సమయం ఎంతో దూరంలో లేదని ఉధంపూర్ ర్యాలీలో మోదీ అన్నారు.
  • ‘‘దయచేసి నన్ను నమ్మండి, గత 60 ఏళ్లుగా జమ్ముకశ్మీర్ ను పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరిస్తాను’’ అని మోదీ అన్నారు.
  • ‘‘ఆర్టికల్ 370ని మళ్లీ తిరిగి తీసుకురాగలరా? ఏ రాజకీయ పార్టీకైనా, ముఖ్యంగా కాంగ్రెస్ కు సవాల్ విసురుతున్నాను. వారు అలా చేయలేరు’’ అని ప్రధాని అన్నారు.
  • దశాబ్దాల తర్వాత ఉగ్రవాదం, సీమాంతర కాల్పుల బెడద లేకుండా జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయని మోదీ అన్నారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

  • ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా డ్రోన్లను ఎగురవేయడంపై నిషేధం సహా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అధికారులు చేశారు.
  • హైవేపై ప్రధాన ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
  • నెలన్నర కాలంలో మోదీ జమ్మూకశ్మీర్ లో పర్యటించడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 20, మార్చి 7 తేదీల్లో జమ్మూ, శ్రీనగర్ నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు.