Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమాప్తం; 60% పోలింగ్ నమోదు; మణిపూర్, బెంగాల్ ల్లో హింస
Lok Sabha Elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 7 గంటల వరకు 102 లోక్ సభ స్థానాల్లో సుమారు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. తొలి దశ పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్, మణిపూర్ లలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం ముగిసింది. పశ్చిమ బెంగాల్, మణిపూర్ లలోని కొన్ని ప్రాంతాల్లో హింస, కాల్పులు జరిగాయని, 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ చాలావరకు ప్రశాంతంగా జరిగిందని భారత ఎన్నికల సంఘం (ECI) తెలిపింది. 102 లోక్ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి పోలింగ్ బూత్ ల లోపల ఉన్నవారికి కూడా ఓటేసే అవకాశం కల్పించారు.
అసెంబ్లీ ఎన్నికలు కూడా..
లోక్ సభ ఎన్నికల మొదటి దశతో పాటు శుక్రవారం సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, సిక్కిం, నాగాలాండ్, మిజోరం, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, పుదుచ్చేరి, మేఘాలయ, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులు తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శుక్రవారం ఓటింగ్ జరిగింది.
1. ఏ రాష్ట్రంలో ఎంత పోలింగ్?
మొత్తం 102 లోక్ సభ స్థానాల్లో సాయంత్రం 7 గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదైంది. 2024 సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ లో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ అధిక పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. త్రిపురలో అత్యధికంగా 80 శాతం, పశ్చిమ బెంగాల్ లో 77 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులోని అన్ని లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. తమిళనాడులో సాయంత్రం 7 గంటల వరకు 72 శాతం పోలింగ్ నమోదైంది.
S no. | State | Voter turnout till 7 pm (in %) |
1 | Andaman and Nicobar (1 seat) | 56.87 |
2 | Arunachal Pradesh (2 seats) | 65.46 |
3 | Assam (5 seats) | 71.38 |
4 | Bihar (4 seats) | 47.49 |
5 | Chhattisgarh (1 seat, Bastar) | 63.41 |
6 | Jammu and Kashmir (1 seat, Udhampur) | 65.08 |
7 | Lakshadweep (1 seat) | 59.02 |
0.8 | Madhya Pradesh (6 seats) | 63.33 |
Maharashtra (5 seats) | 55.29 | |
10 | Manipur (2 seats) | 68.62 |
11 | Meghalaya (2 seats) | 70.26 |
12 | Mizoram (1 seat) | 54.18 |
13 | Nagaland (1 seat) | 56.77 |
14 | Puducherry (1 seat) | 73.25 |
15 | Rajasthan (12 seats) | 50.95 |
16 | Sikkim (1 seat) | 68.06 |
17 | Tamil Nadu (All 39 seats) | 62.19 |
18 | Tripura (1 seat) | 79.9 |
19 | Uttar Pradesh (8 seats) | 57.61 |
20 | Uttarakhand (5 seats) | 53.64 |
21 | West Bengal (3 seats) | 77.57 |
(డేటా సోర్స్: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా)
2. మణిపూర్ లో హింస
మణిపూర్ (Manipur)లోని ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ లోక్ సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. గత ఏడాది మే నెల నుంచి హింసతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రంలో శుక్రవారం పోలింగ్ జరుగుతుండగా ఇంఫాల్ తూర్పు ప్రాంతంలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇన్నర్ మణిపూర్ లోక్ సభ స్థానం పరిధిలోని తొంగ్జు అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికులకు, గుర్తుతెలియని దుండగులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంఫాల్ లోని మొయిరంగ్ కాంపు సజేబ్ అవంగ్ లీకైలోని పోలింగ్ బూత్ వద్ద కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. పోలింగ్ బూత్ ల్లో హింసాత్మక ఘటనల వల్ల ఈవీఎంలకు కొంత నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఆయా బూత్ ల్లో మళ్లీ పోలింగ్ జరపాలని కోరుతున్నట్లు చెప్పారు.
3. పశ్చిమబెంగాల్ లో హింస
పశ్చిమ బెంగాల్ లోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తొలి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ లోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. హింస ఎక్కువగా జరిగే కూచ్ బెహర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. సీతాల్ కుచిలో పోలింగ్ ఏజెంట్లపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని, కూచ్ బెహార్లోని కొన్ని బూత్లలోకి ఓటర్లను వెళ్లకుండా అడ్డుకున్నారని టీఎంసీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన బీజేపీ టీఎంసీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిందని ప్రత్యారోపణలు చేసింది. మాతభంగ ప్రాంతంలో కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
4. ఛత్తీస్ గఢ్ లో సీఆర్పీఎఫ్ జవాను మృతి
చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల్గామ్ గ్రామంలో అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (UBGL) షెల్ ప్రమాదవశాత్తు పేలడంతో భద్రతా విధుల్లో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాను మృతి చెందాడు. ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన సీఆర్పీఎఫ్ 196వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ దేవేంద్ర కుమార్ ను జగదల్ పూర్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఘటనలో బీజాపూర్ జిల్లా భైరాంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సలైట్లు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (IED) పేలడంతో సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గాయపడ్డారు.
5. బంగ్లాదేశ్ సరిహద్దు దాటిన ఓటర్లు
2,500 మంది ఓటర్లు ఏప్రిల్ 19న త్రిపురలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని ఫెన్సింగ్ దాటారు. చారిత్రక కారణాల వల్ల త్రిపురలో గణనీయమైన సంఖ్యలో ఓటర్లు ముళ్ల కంచెకు అవతల, బంగ్లాదేశ్ లో ఉండాల్సి వచ్చింది. వారు ఓటు వేయడానికి వీలుగా ఉదయం నుంచే సరిహద్దు గేట్లను తెరిచారు.