Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా గూగుల్ డూడుల్ లోగో-lok sabha election 2024 google doodle celebrates indias polls ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా గూగుల్ డూడుల్ లోగో

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా గూగుల్ డూడుల్ లోగో

HT Telugu Desk HT Telugu
Apr 19, 2024 07:17 PM IST

2024 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం జరిగింది. తొలి దశలో దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇదే రోజు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా గూగుల్ డూడుల్ ను ప్రదర్శించింది.

గూగుల్ డూడుల్
గూగుల్ డూడుల్

భారతదేశంలో 2024 లోక్ సభ ఎన్నికల ప్రారంభాన్ని సూచిస్తూ గూగుల్ డూడుల్ ను ప్రదర్శించింది. ఓటు వేసినట్లు తెలిపేలా సిరాతో ఉన్న చూపుడు వేలిని ప్రదర్శించింది. సార్వత్రిక ఎన్నికల తొలి దశ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశంలో కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియను ఈ ప్రతీకాత్మక దృశ్యం సూచిస్తుంది.

ప్రాముఖ్యత కలిగిన అంశాలకే డూడుల్

ముఖ్యమైన తేదీలు, సమాజానికి గణనీయమైన కృషి చేసిన ప్రభావవంతమైన వ్యక్తుల జయంతి, లేదా వర్ధంతి, అనేక స్థానిక, ప్రపంచ థీమ్ లకు నివాళి అర్పించడానికి గూగుల్ లోగో లో స్వల్ప మార్పులు చేసి, ఆసక్తికరంగా డూడుల్ (Google Doodle) గా ప్రదర్శిస్తారు. ఈ డూడుల్స్ ను చిత్రాలు, యానిమేషన్లు, స్లైడ్ షోలు, వీడియోలు మరియు ఇంటరాక్టివ్ గేమ్ లతో సహా వివిధ ఫార్మాట్లలో ప్రదర్శిస్తారు.

తొలి దశలో 102 లోక్ సభ స్థానాల్లో

21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మణిపూర్, అస్సాం, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో శుక్రవారం తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ తొలి దశలోనే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి.

ఏప్రిల్ 26న రెండో దశ..

లోక్ సభ ఎన్నికల రెండో దశ ఏప్రిల్ 26, మూడో దశ మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో విడత ఎన్నికలు మే 20న, ఆరో విడత పోలింగ్ మే 25న, ఏడవ దశ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జూన్ 3వ తేదీన ఉంటుంది. పార్లమెంటులో 543 స్థానాలున్న లోక్ సభ ఎన్నికల కోసం భారతదేశంలోని 97 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లలో, 16.6 కోట్ల మంది తొలి దశలో ఓటు వేయనున్నారు.

WhatsApp channel