Lok Sabha elections : తమిళనాడులో ‘మోదీ మేనియా’ ఈసారైనా కనిపిస్తుందా? లేక ఇండియా కుటమిదే విజయమా?
Lok Sabha elections 2024 : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ తమిళనాడుపై పడింది. డీఎంకే, అన్నాడీఎంకేలు కూడా కసరత్తులు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల ప్రత్యేక కథనం మీకోసం..
Lok Sabha elections Tamil Nadu : తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ హోరాహోరీనే! తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు రసవత్తరమే! తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ప్రాంతీయవాదమే! ప్రాంతీయ పార్టీలే ఇక్కడ అనాదిగా రాజకీయాలను శాసిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ.. కేంద్రంలో భారీ మెజారిటీతో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినప్పటికీ.. ఇక్కడ 'మోదీ మేనియా' మాత్రం దాదాపు శూన్యం! వీటన్నింటి మధ్య.. తన సత్తాని చూపించేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయం పార్టీ. మరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎవరిది పై చేయి?
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదీ పరిస్థితి..
లోక్‌సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. వీటిల్లో 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక తమిళనాడులో మొత్తం 39 సీట్లు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో సుమారు 1.51 మిలియన్ మంది ఓటర్లు ఉంటారు. ఈ దక్షిణాది రాష్ట్రాంలో ప్రధాన పోటీ ఎప్పుడూ.. డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే ఉంటూ వచ్చింది! తమిళనాట.. జాతీయ స్థాయి పార్టీల ప్రదర్శన అంతంత మాత్రమే. ఇక.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. డీఎంకేతో పటిష్ఠంగా ఉన్న ఎస్పీఏ, అన్నాడీఎంకేతో కూడిన ఎన్డీఏ కూటములు పోటీపడ్డాయి.
నాటి ఎన్నికల్లో ఎస్పీఏ కూటమిలో డీఎంకే, కాంగ్రెస్, సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, విధుథలై చిరుథైగళ్ కచి, సీపీఐఎంలు ఉన్నాయి. ఇక ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే, బీజేపీ, తమిళ్ మానిల కాంగ్రెస్, దేసీయ ముర్పొక్కు డ్రవిడ కళగం, పట్టాలి మక్కల్ కచి పార్టీలు ఉండేవి.
Tamil Nadu elections : మొత్తం 39 సీట్లలకు ఎన్నికలు జరగ్గా.. డీఎంకే నేతృత్వంలోని కూటమి 38 చోట్ల గెలిచి సంచలనం సృష్టించింది. డీఎంకే 24 చోట్ల, కాంగ్రెస్ 8 చోట్ల గెలిచాయి. ఇక రాష్ట్రంలోని మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకేకు తీవ్ర భంగపాటు ఎదురైంది. ఆ పార్టీ కేవలం ఒక్కటే సీటులో గెలిచింది. ఎన్డీఏ మొత్తానికే ఒక్క సీటు దక్కింది. కేంద్రంలో చక్రం తిప్పు, 303 సీట్లతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి.. తమిళనాడులో మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు!
తమిళనాడులో తాజా రాజకీయాలు..
2019 ఎన్నికల తర్వాత తమిళనాడులో రాజకీయ పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. నాటి ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే బలహీనపడిందని వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ప్రదర్శన చెసింది. మొత్తం 234 సీట్లున్న అసెంబ్లీలో 75 నియోజకవర్గాల్లోనే గెలిచింది. అదే సమయంలో.. 159 సీట్లతో డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అప్పటి నుంచి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బలపడుతూ వచ్చింది. అన్నాడీఎంకే మాత్రం.. అంతర్గత విభేదాలతో వార్తలకెక్కింది.
DMK Congress : ఇక రాష్ట్రాల్లో కనిపించిన ప్రధాన మార్పు.. ఎన్డీఏ, బీజేపీ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై చెప్పడం! రాష్ట్రంపై పట్టు సాధించేందుకు కమలదళం విపరీతంగా కృషిచేస్తుండటం, తమిళనాడును కేంద్రంలో చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపణలు.. వంటివి కొన్ని కారణాలు. కొన్ని సందర్భాల్లో.. బీజేపీ, అన్నాడీఎంకేల నేతల మధ్య బహిరంగంగానే గొడవలు జరిగాయి! ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, తన దూకుడుతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న అన్నమలైకి అన్నాడీఎంకేకి మధ్య విభేదాలు ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
లోక్‌సభ ఎన్నికలు అన్నాడీఎంకేకు చాలా కీలకం! జయలలిత లేని లోటును తీర్చి, పునర్వైభవాన్ని తీసుకురావాలని భావిస్తున్న పార్టీ నేతలు.. తమ శక్తికి మంచి కృషి చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు తాము బీజేపీతో కలవమని అన్నాడీఎంకే తేల్చిచెబుతోంది. ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని, కొత్త కూటమిని తీసుకొస్తామని అంటోంది. ఇందుకోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు వివరించింది. మరి ఇది ఆ పార్టీకి ఎంత మేర సాయం చేస్తుందో చూడాలి.
డీఎంకే- కాంగ్రెస్ కూటమి ఈసారి కూడా..!
Tamil Nadu BJP : ప్రధాని మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష ఇండియా కూటమికి.. తమిళనాడు అత్యంత కీలకంగా మారనుంది! డీఎంకే ఈసారి కూడా బలమైన ప్రదర్శన చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కూటమిలో సీట్ల సద్దుబాటు చర్చలు జోరుగా సాగుతున్నాయి. సీపీఐ, సీపీఎంలకు తలో రెండు సీట్లు ఫిక్స్ అయ్యాయి.
కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. సీట్ల సద్దుబాటు విషయంలో కాంగ్రెస్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 39 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 7 సీట్లు ఇవ్వాలని డీఎంకే ప్రతిపాదించిందని సమాచారం. అది కాంగ్రెస్‌కు నచ్చలేదట! ఫలితంగా.. సీట్ షేరింగ్ చర్చలు నత్తనడకన సాగుతున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కానీ.. ఇతర రాష్ట్రాల్లో సీట్ల సద్దుబాటు వ్యవహారాన్ని కాంగ్రెస్ వేగంగా పరిష్కరిస్తోంది. రానున్న రోజుల్లో తమిళనాడుపైనా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
బీజేపీ ఈసారైనా..!
Tamil Nadu Lok sabha elections : 2024 లోక్‌సభ ఎన్నికల్లో.. తమిళనాడులో బీజేపీ ఏ మాత్రం ప్రభావితం చేయగలదనేది ఇక్కడ ఉత్కంఠగా, ఆసక్తిగా మారింది! ఎంత మంది నేతలు ప్రయత్నించినా, ఎన్ని విధాలుగా కృషిచేసినా, స్వయంగా ప్రధాని మోదీయే వచ్చి వరుసగా సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించినా.. కమలదళానికి తమిళనాడులో ఎన్నో ఏళ్లుగా నిరాశ తప్పడం లేదు. కానీ లోక్‌సభలో 370 సీట్లల్లో గెలవాలని బీజేపీ పెట్టుకున్న టార్గెట్ గెలవాలంటే.. తమిళనాడులో మంచి ప్రదర్శన చేయడం అత్యావశ్యకం.
వాస్తవానికి బీజేపీ కూడా అందుకు తగ్గట్టుగానే సిద్ధమైనట్టు కనిపిస్తోంది. గత నెలలో జరిగిన ఓ సర్వేలో.. డీఎంకే- కాంగ్రెస్ తర్వాత మంచి ఓటు షేర దక్కించుకునే పార్టీగా బీజేపీ ఎదుగుతుందని తేలింది. బీజేపీ ఓటు షేరు.. అన్నాడీఎంకే కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని సర్వే పేర్కొంది. కానీ సీట్ల విషయానికొచ్చేసరికి, కమలదళం ఈసారి ఖాతా తెరిచి, ఒక సీటు గెలుస్తుందని సర్వే అభిప్రాయపడింది. మరో సర్వే మాత్రం.. 39 సీట్లల్లో బీజేపీ 4 నుంచి 6 సీట్లు దక్కించుకుంటుందని పేర్కొంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రదర్శన చేస్తే.. అందుకు ఉన్న ముఖ్య, ఏకైక కారణం.. అన్నమలై అనే చెప్పుకోవాలి! అసలు ప్రభావం చూపించలేని పార్టీని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు అన్నమలై. అధికార పార్టీతో పాటు అన్నాడీఎంకేకు కూడాగట్టి సవాళ్లు విసురుతున్నారు. తక్కువ సమయంలో తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. ఆయన పోరాటాన్ని చూసిన తర్వాతే.. తమిళనాడు బీజేపీ కేడర్‌కు కాస్త ఆశలు పుట్టుకొచ్చాయట!
అదే సమయంలో.. పొత్తులపైనా బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అన్నాడీఎంకే వదిలేసి వెళ్లిపోయినా.. ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని ప్లాన్ చేస్తోంది.
కమల్ హాసన్ పరిస్థితేంటి..?
అన్నాడీఎంకే, బీజేపీతో పాటు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కళ్ నీది మయం పార్టీకి కూడా ఈ 2024 లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. 2018లో పార్టీని ప్రారంభించగా.. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ కాస్త కూడా ప్రభావం చూపించలేకపోయింది.
Loksabha elections 2024 : ఆ తర్వాత.. కమల్ హాసన్ వైఖరిలో కూడా మార్పులు కనిపించాయి! తొలుత.. ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్న ఆయన.. ఆ తర్వాత తన స్టాండ్‌ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. 2023లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన కాంగ్రెస్ జోడో యాత్రలో పాల్గొన్నారు కమల్ హాసన్. ఈ వ్యవహారంపై తెగ చర్చలు జరిగాయి. ఆ తర్వాత.. డీఎంకే- కాంగ్రెస్ కూటమిలో ఆయన కూడా చేరుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని ఆయన ఇప్పటికీ కొట్టిపారేయలేదు!
మరి రానున్న ఎన్నికల్లో తమిళనాట రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి? డీఎంకే కూటమికి ఈసారి కూడా విజయం పక్కానా? బీజేపీ, కమల్ హాసన్ ప్రభావం ఎంత? అన్నాడీఎంకే పుంజుకుంటుందా? ఓటరు చూపు ఎవరివైపు ఉంది? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఎన్నికల ఫలితాల వరకు ఎదురుచూడాల్సిందే!
సంబంధిత కథనం