Lok Sabha Elections 2024 : నేతల్లో టెన్షన్...! ఓరుగల్లు బీజేపీ టికెట్ ఎవరికో...?
Warangal BJP MP Ticket 2024 : తెలంగాణలో ఎంపీ స్థానాలకు పలువురి అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. అయితే ఇందులో కీలకమైన వరంగల్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచింది. దీంతో టికెట్ ఆశిస్తున్న పలువురి నేతల్లో టెన్షన్ మొదలైంది.
Warangal Lok Sabha Constituency: పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయించడంపై కసరత్తు చేస్తుండగా.. బీజేపీ ఒకడుగు ముందుకేసి శనివారం కొంతమంది అభ్యర్థులను ఖరారు చేస్తూ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన నేపథ్యంలో మిగతా స్థానాల ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా రాష్ట్రంలో కీలకంగా చెప్పుకునే వరంగల్ పార్లమెంట్ స్థానానికి టికెట్ ఆశిస్తున్న నేతలు గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో సొంత పార్టీకి చెందిన నేతలు కొందరు ఉండగా.. ఇతర పార్టీల్లో కొనసాగుతూనే బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు.

సొంత పార్టీ నేతల పోటాపోటీ
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో(Warangal Lok Sabha Seat) వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఒక్క స్టేషన్ ఘన్ పూర్ మినహా మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఇదిలాఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, రామ మందిర నిర్మాణం, ప్రధానిగా నరేంద్ర మోదీకి ఉన్న పేరు వల్ల బీజేపీ వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. దీంతోనే తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తో పాటు చింతా సాంబమూర్తి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాకుండా బీజేపీ వరంగల్ టికెట్ రేసులో మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ కూడా ఉన్నారు. దీంతో సొంత పార్టీలోని ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.
బీజేపీ టికెట్ పై ఆరూరి గురి?
బీఆర్ఎస్ పార్టీకి చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు చేతిలో ఘోర పరాభవం చవిచూసిన ఆయన .. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం లేకపోవడం, స్థానిక నేతల మీద వ్యతిరేకత అరూరి రమేశ్ కు నెగటివ్ గా మారే అవకాశం ఉండటంతో వరంగల్ లోకసభ టికెట్ తీసుకునేందుకు అరూరి రమేశ్ వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్న అరూరి రమేశ్.. బీజేపీ టికెట్ పై కన్నేసినట్టు తెలిసింది. ఓ వైపు బీఆర్ఎస్ నుంచి టికెట్ ప్రయత్నాలు చేస్తూనే బీజేపీ నేతల టచ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయంగా సమాచారం అందింది. బీఆర్ఎస్ లో కూడా ఆశావహులు ఎక్కువ కావడం, జూనియర్స్ నుంచి పోటీ పెరుగుతుండటం వల్లే అరూరి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కోసం ఎంతో కొంతైనా ఖర్చు పెట్టుకునేంత సత్తా ఉండటంతో పాటు లోకల్ గా బీజేపీకి ఉన్న పేరు కలిసి వస్తుందనే ఉద్దేశంతోనే అరూరి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు సొంత పార్టీ నేతల కంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుండటంతో టికెట్ అరూరి రమేశ్ కు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఎవరికి దక్కుతుందోననే టెన్షన్
ఇప్పటికే బీజేపీ ఎంపీ టికెట్ కు ఆశావహులు ఎక్కువ కావడం, పక్క పార్టీ నుంచి వచ్చి మరీ టికెట్ దక్కించుకునేందుకు పోటీ పెరుగుతుండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందోననే టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలతో పాటు బీఆర్ఎస్ నుంచి అరూరి రమేశ్ పేరు వినిపిస్తుండగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ దక్కని ఓ మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. మొన్నటివరకు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసిన ఆయన అక్కడ ఫుల్ కాంపిటీషన్ ఉండటంతో బీజేపీ తొవ్వ తొక్కుతున్నట్లు సమాచారం. కాగా దేశంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న బీజేపీ టికెట్ల కేటాయింపులో ఆచితూచీ అడుగులు వేస్తుండగా.. వరంగల్ టికెట్ ను ఎవరికి కేటాయిస్తుందో చూడాలి.
(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం