K Annamalai: ఎన్డీఏ నుంచి అన్నా డీఎంకే వైదొలగడానికి ఆయనేనా కారణం? అసలేం జరిగింది..?-k annamalai police officer turned politician blamed for aiadmks exit from nda ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  K Annamalai: ఎన్డీఏ నుంచి అన్నా డీఎంకే వైదొలగడానికి ఆయనేనా కారణం? అసలేం జరిగింది..?

K Annamalai: ఎన్డీఏ నుంచి అన్నా డీఎంకే వైదొలగడానికి ఆయనేనా కారణం? అసలేం జరిగింది..?

HT Telugu Desk HT Telugu
Sep 26, 2023 06:59 PM IST

K Annamalai: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి నుంచి తమిళనాడులోని ప్రధాన పార్టీ అన్నాడీఎంకే అకస్మాత్తుగా వైదొలగడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు కారణాలపై విశ్లేషణ ప్రారంభమైంది.

తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై
తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై

K Annamalai: ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలగడానికి ప్రధాన కారణం తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై అని తమిళనాడు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అన్నాడీఎంకేపై, జయలలితపై, అన్నాదురై పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపాయి.

yearly horoscope entry point

ఐపీఎస్ నుంచి రాజకీయాల్లో..

రాజకీయాల్లో తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై చాలా చిన్నవాడు. 2019లో ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పటివరకు ఐపీఎస్ అధికారిగా సేవలు అందించాడు. బీజేపీలో చేరిన అనతి కాలంలోనే అధిష్టానం దృష్టిలో పడ్డాడు. వారి ఆశీస్సులతో రాష్ట్ర పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. నాటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రతీ రోజు క్రియాశీలకంగా ఉంటున్నారు. ప్రతీ అంశంపై స్పందిస్తూ, దాదాపు ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడుతూ, వార్తల్లో ఉంటున్నాడు. తమిళనాడులో బీజేపీ ప్రధాన రాజకీయ పక్షంగా మార్చడం తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1967 నుంచి కూడా తమిళనాడులో డీఎంకే, లేదా అన్నాడీఎంకే అధికారంలో ఉంటూ వస్తున్నాయి. మరో రాజకీయ పక్షానికి అవి అవకాశం ఇవ్వలేదు.

రజనీకాంత్ ద్వారా..

నిజానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ ద్వారా తమిళ రాజకీయాల్లో పట్టు సాధించాలని బీజేపీ భావించింది. రాష్ట్ర రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం సృష్టిస్తాడని భావించాయి. కానీ రజనీకాంత్ ప్రారంభించిన ‘‘రజని మక్కల్ మండ్రమ్’’ పార్టీ మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. దాంతో, వేరే వారిపై ఆధారపడడం కాకుండా, నేరుగానే రంగంలోకి దిగాలన్న ఆలోచనలోకి బీజేపీ వచ్చింది. అదే సమయంలో, 2019 లో ఐపీఎస్ కు రాజీనామా చేసి, కే అన్నామలై బీజేపీలో చేరాడు. 2021లో రాష్ట్రంలో పార్టీ చీఫ్ పదవిని చేపట్టాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 4 స్థానాలు మాత్రమే సాధించింది.

దుందుడుకు రాజకీయాలు..

తొలినుంచి అన్నామలై దుందుడుకు రాజకీయాలనే కొనసాగించాడు. ఆ క్రమంలో మిత్ర పక్షం అన్నాడీఎంకే ను కూడా పలుమార్లు ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా తమిళ నేతలు దేవుడిలా భావించే అన్నాదురైపై, మాజీ సీఎం జయలలితపై అన్నామలై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందూత్వను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు అన్నాదురై అప్పటి ఫార్వర్డ్ బ్లాక్ నేత ముత్తురామలింగ తేవర్ కు క్షమాపణలు చెప్పాడని అన్నామలై వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను అన్నాడీఎంకే తీవ్రంగా ఖండించింది. అవన్నీ అబద్ధాలని తేల్చి చెప్పింది. అప్పటి నుంచి రెండు మిత్ర పక్షాల మధ్య విబేధాలు మరింత తీవ్రమయ్యాయి.

అధిష్టానం పట్టించుకోలేదు..

ఈ ఘర్షణ బీజేపీ అధిష్టానం వద్దకు చేరింది. అన్నాడీఎంకే ఎంపీలు హోం మంత్రి అమిత్ షా ను కూడా కలిసి అన్నామలైపై ఫిర్యాదు చేశారు. కానీ, బీజేపీ పెద్దలు వారి ఫిర్యాదులను పట్టించుకోలేదు. తమ నేత అన్నామలైకే సపోర్ట్ చేశారు. ఒక సందర్భంలో, అన్నామలై ని ఉద్దేశించి అమిత్ షా తన తమ్ముడంటూ సంబోధించారు. ఈ నేపథ్యంలో, తప్పనిసరై, ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలగింది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.