Neet | నీట్‌పై విపక్షాల ఆందోళన.. టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్ వాకౌట్
న్యూఢిల్లీ: తమిళనాడులో నీట్ మినహాయింపు బిల్లును గవర్నర్ తిప్పి పంపడంపై నిరసనగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో శుక్రవారం డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు వాకౌట్ చేశాయి.
నీట్ మినహాయింపు బిల్లును తిప్పి పంపుతూ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె), తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు శుక్రవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఆయన పార్టీ సభ్యులు రాజ్యసభలో వెల్‌లోకి దూసుకొచ్చారు. నీట్ మినహాయింపు బిల్లును తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని, గవర్నర్ చర్య రాష్ట్ర ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఉందని డీఎంకే సభ్యులు అన్నారు. సభ జీరో అవర్‌లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.
డీఎంకే సభ్యులు ఈ అంశంపై పట్టుబడుతుండగా రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు వారిని మాట్లాడేందుకు అనుమతించలేదు. తమ స్థానాలకు వెళ్లాలని, జీరో అవర్‌లో ఇతరులను మాట్లాడనివ్వాలని ఛైర్మన్ కోరారు. కాగా గవర్నర్ ఆర్.ఎన్.రవిని రీకాల్ చేయాలని డీఎంకే సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే లేచి సదరు సభ్యులు తమ సమస్యను చెప్పడానికి అనుమతించాలని ఛైర్మన్‌ను అభ్యర్థించారు.
సభ్యుల వాకౌట్
ఈ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించకుండా జీరో అవర్‌ను కొనసాగించడంతో ఖర్గే వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సభ్యులతోపాటు విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ అంశంపై గురువారం కూడా లోక్‌సభలో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన విపక్ష సభ్యులు గవర్నర్ ఆర్.ఎన్.రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.