Khammam Priyanka Gandhi: ఖమ్మం లోక్‌సభ బరిలో ప్రియాంక గాంధీ .. అభ్యర్థిత్వం పరిశీలిస్తోన్న అధిష్టానం…
Khammam Priyanka Gandhi: ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారా..? అంటే ఆమె పోటీ చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్లే కనిపిస్తోంది.
రాష్ట్ర పార్టీ నేతలు సైతం ఆమెను ఆహ్వానించగా ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆమె అసలు పోటీకి మొగ్గు చూపకుండా రాజ్యసభను ఎంచుకున్నారు. కాగా ఆ తర్వాత రాహుల్ గాంధీ Rahul Gandhi, ప్రియాంక గాంధీ పేర్లు ఖమ్మం బరిలో వినిపించాయి.
అనంతరం వారి స్థానాలు ఖరారు కావడంతో ఖమ్మం టిక్కెట్ కోసం స్థానిక, స్థానికేతర నేతలు సైతం పోటాపోటీగా పెద్ద ఎత్తున పైరవీలు మొదలుపెట్టారు. మొత్తం ఒక డజను మంది నేతలు ఖమ్మం ఎంపీ సీటు కోసం కుస్తీలు పట్టారు.
ఇప్పుడు ఆ ఇద్దరితోనే చిక్కు..
గడిచిన నెల 15 రోజులుగా అనేక మంది నేతల పేర్లు ఖమ్మం స్థానంలో పోటీకి రోజుకొకటిగా వినిపించగా ఇప్పుడు వారి పేర్లన్నీ కనుమరుగయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క Bhatti vikramarka, పొంగులేటి Ponguleti శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరు మాత్రమే ఇప్పుడు ఎంపీ సీటును నిర్ణయించే క్రమంలో పోటాపోటీగా తలపడుతున్నారు.
భట్టి విక్రమార్క తొలుత తన సతీమణి కోసం ప్రయత్నం ప్రారంభించగా పొంగులేటి తన సోదరుడికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో కుస్తీ పట్టారు. అయితే గడిచిన నాలుగు రోజులుగా ఈ పోటా పోటీ వ్యవహారం రసకందాయంలో పడింది.
హైదరాబాదులో తేలని ఈ పంచాయతీ బెంగళూరు వరకూ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఈ ఇద్దరి నడుమ సయోధ్య కుదిరించే ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలో పొంగులేటి తన వియ్యంకుడు రఘురామ్ రెడ్డి పేరిట తన అనుచరులతో రెండు సెట్ల నామినేషన్లను సమర్పించడం తీవ్ర చర్చకు కారణమైంది.
ఏఐసీసీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భట్టి, పొంగులేటి నడుమ అభిప్రాయ భేదాలతో ఖమ్మం సీటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోగా కొత్త మలుపు తీసుకుంది.
మళ్లీ ప్రియాంక పేరు..
ఇద్దరు నేతల మధ్య పంచాయతీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను రక్తి కట్టిస్తోంది. నామినేషన్ దాఖలకు మరికొద్ది గంటలు మాత్రమే గడువు ఉండగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం ప్రియాంక గాంధీని ఖమ్మం బరిలో పోటీకి నిలపాలని పట్టు పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు ఆయన ఢిల్లీ సైతం వెళ్లారు.
ఇప్పటికే రాయబరేలి స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రియాంక ఖమ్మం నుంచి కూడా పోటీ చేస్తారన్న వాదనకు బలం చేకూరుతోంది. ఏఐసీసీ పెద్దలు సైతం ఈ కోణంలో పరిశీలన జరుపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు నేతల నడుమ నెలకొన్న తీవ్ర పోటీ చివరికి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకని ఖమ్మంలో నిలిపేందుకు ఊతం ఇచ్చేలా కనిపిస్తోంది.
ఏది ఏమైనా నామినేషన్ల గడువు మరి కొద్ది గంటల్లోనే ముగుస్తుండటంతో ఇక పంచాయతీని తేల్చాల్సిన సమయం కూడా ఆసన్నమైనట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరనేది ఈ రోజు తేల్చితే రేపు ఆఖరి రోజున నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం