Khammam Congress Ticket : ఆయన లోకల్.. మరొకరు నాన్ లోకల్..! ఖమ్మం టికెట్ రేసులో ఆ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ..!-the main contest is now between the two leaders for the khammam congress mp ticket 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Congress Ticket : ఆయన లోకల్.. మరొకరు నాన్ లోకల్..! ఖమ్మం టికెట్ రేసులో ఆ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ..!

Khammam Congress Ticket : ఆయన లోకల్.. మరొకరు నాన్ లోకల్..! ఖమ్మం టికెట్ రేసులో ఆ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ..!

HT Telugu Desk HT Telugu
Apr 12, 2024 05:37 PM IST

Khammam Congress MP Ticket 2024: ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది. ఓవైపు జిల్లాకు చెందిన మంత్రులు గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా… మరోవైపు సీన్ లోకి కొత్తగా ఇద్దరు నేతలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో టికెట్ ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్

Khammam Congress MP Ticket 2024: డజను మంది పోటీ పడిన ఖమ్మం పార్లమెంటు(Khammam MP Ticket) నియోజకవర్గానికి ఎట్టకేలకు అభ్యర్థిని ఖరారు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఒక లోకల్ నేత, మరొక నాన్ లోకల్ నాయకుడి నడుమే ఇప్పుడు ప్రధాన పోటీ కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎవరనేది నేటి వరకూ తేలని విషయం తెలిసిందే. ఈ టిక్కెట్ ను తొలి నుంచీ స్థానికంగా ఉన్న ముగ్గురు రాష్ట్ర మంత్రులు తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునే ప్రయత్నం చేయగా స్థానికేతర నేతలు కూడా పోటీ పడ్డారు. దీంతో రాష్ట్రంలో విపరీతమైన పోటీ నెలకొన్న స్థానాల్లో ఖమ్మం కూడా ప్రముఖంగా మారింది. ఫలితంగా అందరి కళ్ళు ఖమ్మం టిక్కెట్ పై పడ్డాయి.

"కమ్మ" వారికే…..

కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ టిక్కెట్ ను(Khammam Lok Sabha constituency) మొదట్నుంచీ "కమ్మ" సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయిస్తూ వస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన రేణుకా చౌదరి ఖమ్మం స్థానం నుంచే పోటీ చేసి అనేకసార్లు గెలుపొందారు. ఆమె స్థానికేతరురాలైనప్పటికీ సుదీర్ఘ కాలం ఖమ్మం నుంచి రాజకీయాలు నెరిపారు. అయితే ఖమ్మం స్థానాన్ని డజను మంది ఆశించినప్పటికీ చివరికి "కమ్మ" సామాజిక వర్గ నేతకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల ప్రయత్నాలకు అధిష్టానం చెక్ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఖమ్మం టిక్కెట్ రేసులో పోటీ ఇప్పుడు పరిమితంగానే కనిపిస్తోంది.

ఒకరు లోకల్.. మరొకరు నాన్ లోకల్..?

ఖమ్మం ఎంపీ టిక్కెట్(Khammam Lok Sabha constituency) రేసులో ఇప్పుడు ప్రధానంగా ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు కాగా మరొకరు నాన్ లోకల్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు ఎంపీ టిక్కెట్ ఆశిస్తూ తన పేరును పరిశీలించాలని అధిష్టానానికి అభ్యర్ధన చేశారు. ఈయన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు. కాగా మండవ వెంకటేశ్వరరావు స్థానికుడు కానప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరి వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. ఎక్కువ మంది పోటీ పడుతూ సంక్లిష్టంగా మారిన ఖమ్మం స్థానంలో మండవను పోటీకి దించాలని సీఎం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను రంగంలోకి దించడంతో ఈ స్థానంలో నెలకొన్న పోటీకి చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి నడుమే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికత తెరపైకి వచ్చి జిల్లా నేతలు బలమైన వాదన వినిపిస్తే రాయల నాగేశ్వరరావు పంట పండే అవకాశం ఉంది. లేనిపక్షంలో స్థానికేతరుడైనా ఎవరూ నోరు మెదపని పక్షంలో మండవ వెంకటేశ్వరరావు పేరును అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఏదిఏమైనా ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ఇవాళ, రేపట్లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు అధిష్టానం కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు స్పష్టం అవుతోంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రతినిధి.

Whats_app_banner