T Congress Rajya Sabha Candidates : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్
Rajya Sabha Elections 2024 Updates: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. ఇందులో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ఉన్నాయి.
Rajya Sabha Elections 2024 Updates: తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి, హైదరాబాద్ కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది ఆ పార్టీ హైకమాండ్. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లు ఖరారయ్యాయి. రేపటితో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వీరంతా రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
రేణుకా ప్రస్థానం….
Renuka Chowdhury: ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి… తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బంజారాహిల్స్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచింది. ఈమె 1986 నుంచి 1998 వరకు రెండు సార్లు రాజ్య సభ సభ్యురాలుగా పని చేశారు. ఇక ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ, ఆ తరువాత కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా మరోసారి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే రాజ్యసభకు ఆమె పేరు ఖరారు కావటంతో…. లోక్ సభ బరిలో రేణుకా ఉండే అవకాశం దాదాపు లేదు.
యూత్ కాంగ్రెస్ నేతగా అనిల్ కుమార్ యాదవ్…
అనిల్ కుమార్ యాదవ్… యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఇయన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీసీ సామాజికవర్గానికి చెందటంతో పాటు యువనేతగా ఉండటం కూడా అనిల్ కుమార్ యాదవ్ కు కలిసివచ్చింది. యువతకు పెద్దల సభలో అవకాశం ఇస్తే పార్టీకి కూడా కలిసివచ్చే అవకాశం ఉంటుందని భావించిన కాంగ్రెస్ పార్టీ… అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్ …. 2004, 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక్లలో ముషీరాబాద్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఎమ్మెల్యేల సంఖ్యా బలం రీత్యా అధికార కాంగ్రెస్ పార్టీకి(Telangana Congress) రెండు స్థానాలను కైవసం చేసుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే కనీసం 39 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఓటేయాల్సి ఉంది. పోటీకి దించాలంటే కనీసం పది మంది ఎమ్మెల్యేలు ఆయన్ను ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల ప్రకారం చూస్తే…. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే నామినేషన్లు వేసే అవకాశం ఉంది. మూడు స్థానాలు ఖాళీగా ఉండగా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్, సీపీఐ కలిపి 65 మంది సభ్యులు… ఇద్దరు అభ్యర్థులకు కేటాయిస్తే ఒకరికి 33, రెండో అభ్యర్థికి 32 ఓట్లు వస్తాయి. ఇక బీఆర్ఎస్ తరపున ఉన్న 39 మంది ఓటేస్తే వారికి ఒక సీటు ఖరారు అవుతుంది. ఈ లెక్కన వరుసగా అత్యధిక ఓట్లు దక్కించుకున్న అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటిస్తారు.
ఇటీవలే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పార్టీల బలబలాలు మారిపోయాయి. 119 స్థానాలకు ఎన్నికలకు జరగగా కాంగ్రెస్ పార్టీ 64 సీట్లను గెలుచుకొని అధికారారాన్ని సొంతం చేసుకుంది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక వారి మిత్రపక్షంగా ఉన్న సీపీఐ 1 సీటు గెలవటంతో వారి బలం 65కు చేరింది. భారత రాష్ట్ర సమితి 39 స్థానాలకు గెలుచుకొని రెండో స్థానంలో ఉంది. బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాల్లో పాగా వేసింది.
సంబంధిత కథనం