KCR : రైతుల చెప్పుతో కొడితే మూడు పండ్లు ఊడిపోతాయ్- కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్-nalgonda news in telugu brs meeting kcr says final fight of krishna river water shares ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr : రైతుల చెప్పుతో కొడితే మూడు పండ్లు ఊడిపోతాయ్- కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

KCR : రైతుల చెప్పుతో కొడితే మూడు పండ్లు ఊడిపోతాయ్- కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

Bandaru Satyaprasad HT Telugu
Feb 13, 2024 05:49 PM IST

KCR : నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకులేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. చలో నల్గొండ సభలో పాల్గొన్న ఆయన..కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. రైతు బంధు అడిగినందుకు చెప్పుతో కొట్టమని అంటవా? అని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.

కేసీఆర్
కేసీఆర్

KCR : కృష్ణా జలాలు(Krishna Waters) తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అన్నారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకులేదన్నారు. కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. నల్గొండ(Nalgonda) జిల్లా మర్రిగూడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ...ఇది రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ, పోరాట సభ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశామన్నారు. గతంలో ఫ్లోరైడ్‌(Floride)తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయన్నారు. బీఆర్‌ఎస్‌ వచ్చాక ఫ్లోరైడ్‌ సమస్యను దూరం చేశామన్నారు. భగీరథ(Mission Bhagiratha) నీళ్లతో ఫ్లోరైడ్‌ బాధలు పోయాయన్నారు.

కాంగ్రెస్ పై ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి రైతు బంధు ఇవ్వడం చేతకావడంలేదన్నారు. రైతు బంధు అడిగినందుకు రైతులను చెప్పుతో కొట్టమని ఓ మంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని గుండెల్రా మీరు? కండ కావరమా? కళ్లు నెత్తికెక్కినయా? అని మండిపడ్డారు. చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాని, అవి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయన్నారు. రైతుల చెప్పుతో కొడితే మూడు పండ్లు ఊడిపడతాయ్ అన్నారు.

చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా

ఒక్క పిలుపుతో అన్నాచెల్లెల్లు, అక్కాత‌మ్ముళ్ల పులుల్లా సభకు కదిలి వచ్చాయని కేసీఆర్ అన్నారు. నాకు కాలు విరిగిపోయినా కుంటి న‌డ‌క‌తోనే, క‌ట్టె ప‌ట్టుకోని ఇంత ఆయాసంతో ఎందుకు వచ్చానో అంద‌రూ ఆలోచించాలన్నారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదన్నారు. 24 ఏళ్లుగా పక్షిలాగా రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్‌ సమస్య పోయిందన్నారు. పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకుని పదేళ్లు పాలించామన్నారు. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారని, కానీ నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంది కాబట్టే ఇప్పుడే వచ్చానన్నారు. బీఆర్ఎస్ పాలనలో బస్వాపూర్‌ ప్రాజెక్టు పూర్తయ్యింది, దిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయన్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగామన్నారు. కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రైబ్యునల్‌ ముందు పోరాడాలన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతానని కేసీఆర్‌ అన్నారు.

చేతగాని వాళ్ల రాజ్యం ఇలానే

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన పూర్తి వాటా వచ్చేదాకా కొట్లాడతామని కేసీఆర్ అన్నారు. తాను సభ పెడతానని పిలుపిస్తేనే భయపడి అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. అది సరిపోదని, అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి తీసుకుపోవాలన్నారు. కావాలంటే ఐదేళ్లు అధికారంలో ఉండాలని, మాకేం ఇబ్బంది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటైనా మంచి పని చేస్తుందా? అని మండిపడ్డారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, వాటాలు శాశ్వతం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోగానే స్వీచ్ ఆఫ్ చేసినట్లు కరెంటు పోయిందన్నారు. అసెంబ్లీలో కూడా జనరేటర్లు తెచ్చి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఏప్రిల్, మే నెలల్లో 24 గంటల కరెంటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లు పాలనలో 24 గంటల కరెంటు ఇచ్చామన్నారు. చేతగాని వాళ్ల రాజ్యం ఇలాగే ఉంటుందని కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం