BRS Nalgonda Meeting: నేడు నల్గొండకు కేసీఆర్‌.. కెఆర్‌ఎంబికి ప్రాజెక్టుల అప్పగింతపై పోరుబాట…-kcr to nalgonda today fight over handover of projects to krmb ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Nalgonda Meeting: నేడు నల్గొండకు కేసీఆర్‌.. కెఆర్‌ఎంబికి ప్రాజెక్టుల అప్పగింతపై పోరుబాట…

BRS Nalgonda Meeting: నేడు నల్గొండకు కేసీఆర్‌.. కెఆర్‌ఎంబికి ప్రాజెక్టుల అప్పగింతపై పోరుబాట…

Sarath chandra.B HT Telugu
Feb 13, 2024 09:48 AM IST

BRS Nalgonda Meeting: కృష్ణా ప్రాజెక్టుల్ని రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగించడంపై తెలంగాణలో అగ్గి రాజుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నేడు చలో నల్గొండకు పిలుపు ఇచ్చింది.

నేడు నల్లగొండలో బిఆర్‌ఎస్‌ బహిరంగ సభ
నేడు నల్లగొండలో బిఆర్‌ఎస్‌ బహిరంగ సభ

BRS Nalgonda Meeting: సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో కృష్ణా నదీ జలాలు అగ్గి రాజేస్తున్నాయి. సాగు నీటి ప్రాజెక్టుల్ని కెఆర్‌ఎంబికి అప్పగించడాన్ని తప్పు పడుతూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోరుబాట పట్టారు.

కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని తప్పు పడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభలో కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి కేసీఆర్‌ బహిరంగ వేదిక మీదకు వస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న బహిరంగసభకు దాదాపు రెండు లక్షల మందితో నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో బీఆర్‌ఎస్‌ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులను భారీగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

300 మంది కూర్చునేలా వేదికను నిర్మించారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదికను సిద్ధంచేశారు. వేదికకు ఎదురుగా వీఐపీ, మీడియా గ్యాలరీలను నిర్మించారు. వాటి వెనుక ప్రజలు కూర్చునేలా ప్రత్యేకంగా పలు గ్యాలరీలను ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణం పక్కనే హెలిప్యాడ్‌ను సిద్ధ్దం చేశారు.

ఓటమి తర్వాత జనంలోకి…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తొలిసారి బహిరంగ సభలోకి అడుగుపెడుతున్నారు. నల్లగొండ జిల్లాలో బిఆర్‌ఎస్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతోపోగొట్టుకున్న చోట వెదుక్కునేందుకు సిద్ధం అయ్యారు.

కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బహిరంగ సభ ద్వారా ఎండగట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేది లేదని రాష్ట్ర ప్రభు త్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్‌ నల్లగొండ సభలో జరుగుతోంది.

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయింది. పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే కేసీఆర్‌ కాలికి తుంటి ఎముక శస్త్ర చికిత్స జరిగి విశ్రాంతి తీసుకున్నారు.

పార్టీ నేతలతో ఇంట్లో సమావేశాలు నిర్వహిస్తున్నా ఇప్పటివరకు బహిరంగంగా జనంలోకి రాలేదు. ఫిబ్రవరి 1న గజ్వేల్‌ ఎమ్మెల్యేగా స్పీకర్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ అదేరోజు తెలంగాణభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతోనూ భేటీ అయ్యారు.

శాసన సభా సమావేశాలకు మాత్రం హాజరు కావడం లేదు. నల్లగొండ సభలో కేసీఆర్‌ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని నల్లగొండ నుంచి ప్రారంభిస్తున్నట్లు బిఆర్ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులంతా నల్గొండ సభలో పాల్గొనేందుకు తరలి వెళుతున్నారు.

నల్లగొండతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలించేందుకు బిఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. నల్గొండ సభ ద్వారా పార్టీ క్యాడర్‌‌లో ఎన్నికల ఉత్సాహం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. నల్గొండ సభకు పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లను చేశారు. సభా ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కలిసి saపర్యవేక్షిస్తున్నారు.