KKR vs MI: బుమ్రా సూపర్ యార్కర్.. నరైన్ మైండ్‍బ్లాక్: వీడియో
KKR vs MI IPL 2024: ముంబై స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌కు కోల్‍కతా బ్యాటర్ సునీల్ నరైన్ స్టన్ అయ్యాడు. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతాను ముంబై మోస్తరు స్కోరుకే కట్టడి చేసింది.
KKR vs MI IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‍కు వర్షం ఆటంకం కలిగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేటి (మే 11) మ్యాచ్‍కు ఆరంభంలోనే వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో ఈ పోరు ఆలస్యంగా మొదలైంది. 16 ఓవర్ల ఆటగా ఈ మ్యాచ్‍ను అంపైర్లు కుదించారు. ఈ సీజన్‍లో దుమ్మురేపుతూ టేబుల్ టాపర్లుగా ఉన్న కోల్‍కతాను తొమ్మిదో ప్లేస్‍లో ఉన్న ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‍లో బౌలింగ్‍తో కట్టడి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‍కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ముంబై ముందు 158 పరుగుల మోస్తరు టార్గెట్ నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‍లో ముంబై స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఓ సూపర్ యార్కర్ వేశాడు.
బుమ్రా యార్కర్.. షాకైన నరైన్
ముంబై యార్కర్ కింగ్, పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా మరోసారి మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్‍లో రెండో ఓవర్ వేసిన బుమ్రా.. తన తొలి బంతికే సూపర్ యార్కర్‌తో కోల్‍కతా ఓపెనర్ సునీల్ నరైన్‍ను బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఈ బంతి వికెట్లకు దూరంగా వెళుతుందని భావించిన నరైన్.. షాట్ కొట్టేందుకు ప్రయత్నించలేదు. వదిలేద్దామని భావించాడు. అయితే, బుమ్రా వేసిన యార్కర్ నేరుగా వికెట్లను తాకింది. దీంతో ఆ బాల్ వికెట్లను ఎలా తాకిందని నరైన్ ఆశ్చర్యపోయాడు. మైండ్ బ్లాక్ అయినట్టు చూశాడు. దీంతో తొలి బంతికే ఔటై.. గోల్డెన్ డక్‍గా వెనుదిగిరాడు. ఈ సీజన్‍లో అద్భుతమైన ఫామ్‍లో ఉన్న నరైన్‍కు బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో షాక్ ఇచ్చాడు.
బుమ్రా యార్కర్‌కు నరైన్ స్టన్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుమ్రా మళ్లీ యార్కర్ మ్యాజిక్ చేశాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కేకేఆర్‌ను నిలువరించిన ముంబై
ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ముందుగా కోల్‍కతా నైట్‍రైడర్స్‌కు బ్యాటింగ్ ఇచ్చింది. అయితే, సూపర్ ఫామ్‍లో ఉన్న కోల్‍కతా ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (6), సునీల్ నరైన్ (0) ఈ మ్యాచ్‍లో విఫలమయ్యారు. తొలి ఓవర్లో ఫిల్‍ను ముంబై పేసర్ నువాన్ తుషారా ఔట్ చేస్తే.. తర్వాతి ఓవర్ తొలి బంతికే నరైన్‍ను బుమ్రా బౌల్డ్ చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7) కూడా విఫలమయ్యాడు. దీంతో 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కోల్‍కతా.
ఆ దశలో కోల్‍కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ అదరగొట్టాడు. 21 బంతులకే 42 పరుగులతో దూకుడుగా ఆడాడు. 6 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. నితీశ్ రాణా కూడా రాణించాడు. 23 బంతులకే 33 పరుగులతో మెప్పించాడు. వెంకటేశ్, రాణా నాలుగో వికెట్‍కు 37 పరుగులు జోడించారు. అయితే, వెంకటేశ్ అయ్యర్‌ను ముంబై స్పిన్నర్ చావ్లా 9వ ఓవర్లో ఔట్ చేశాడు. 12వ ఓవర్లో నితీశ్ రాణా రనౌట్ అయ్యాడు. చివర్లో ఆండ్రీ రసెల్ (14 బంతుల్లో 24 పరుగులు), రింకూ సింగ్ (12 బంతుల్లో 20 పరుగులు), రమణ్‍దీప్ సింగ్ (8 బంతుల్లో 17 పరుగులు; నాటౌట్) వేగంగా ఆడారు. దీంతో కోల్‍కతాకు 157 మోస్తరు స్కోరు దక్కింది.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్‍ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా తలా రెండు వికెట్లు తీశారు. నువాన్ తుషారా, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ముంబై ముందు 158 రన్స్ టార్గెట్ ఉంది. ఈ సీజన్‍లో పేలవ ఆటతో ఇప్పటి ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ముంబై ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందేమో చూడాలి.