CSK vs RR: చెపాక్‍లో చెన్నై తఢాకా.. రాజస్థాన్‍పై సునాయాస గెలుపు.. ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగు
CSK vs RR IPL 2024: రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అలవోకగా గెలిచింది. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
CSK vs RR: ఐపీఎల్ 2024 సీజన్‍లో కీలక మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ విజృభించింది. రాజస్థాన్ రాయల్స్‌పై నేడు (మే 12) అలవోక విజయం సాధించి చెన్నై తఢాకా చూపింది. హోం గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో జరిగిన పోరులో సీఎస్‍కే ఐదు వికెట్ల తేడాతో రాజస్థాన్‍పై అలవోకగా గెలిచింది. 10 బంతులను మిగిల్చి మరీ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ సీజన్‍లో ఏడో గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకుంది సీఎస్కే. మ్యాచ్ ఎలా సాగిందంటే..
కట్టడి చేసిన చెన్నై..పరాగ్ ఒక్కడే..
టాస్ గెలిచి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. ఆర్ఆర్ బ్యాటర్లను నిలువరించారు. 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది రాజస్థాన్. నెమ్మదిగా ఆరంభించిన ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24), జాస్ బట్లర్ (21)ను చెన్నై పేసర్ సిమర్జీత్ సింగ్ ఔట్ చేశాడు. ఏడో ఓవర్లో జైస్వాల్‍ను, తొమ్మిదో ఓవర్లో బట్లర్‌ను పెవిలియన్ పంపాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) కూడా వేగంగా ఆడలేకపోయాడు. మరోవైపు రియాన్ పరాగ్ (35 బంతుల్లో 47 పరుగులు నాటౌట్; 1 ఫోర్లు, 3 సిక్స్‌లు) దీటుగా ఆడాడు. అయితే, 15వ ఓవర్లో సంజూ శాంసన్‍ను సిమర్జీత్ ఔట్ చేశాడు. ధృవ్ జురెల్ (18 బంతుల్లో 28 పరుగులు) కాసేపు దూకుడుగా ఆడి చివరి ఓవర్లో ఔటయ్యాడు. పరాగ్ చివరి వరకు నిలిచాడు.
చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ పేసర్ సమర్జీత్ సింగ్ 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో దుమ్మురేపాడు. తుషార్ దేశ్‍పాండే రెడు వికెట్లు తీసుకున్నాడు. రవీంద్ర జడేజ (0/24), మతీష పతిరణ (0/28) పొదుపుగా బౌలింగ్ చేశారు.
చెన్నై అలవోకగానే..
మోస్తరు లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అలవోకగానే ఛేదించేసింది. 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. సీఎస్‍కే ఓపెనర్ రచిన్ రవీంద్ర (18 బంతుల్లో 27 పరుగులు) ఆరంభంలో దూకుడుగా ఆడాడు. అయితే, నాలుగో ఓవర్లో రాజస్థాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. రచిన్‍ను ఔట్ చేశాడు. మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (41 బంతుల్లో 45 పరుగులు నాటౌట్; 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలకడగా ఆడాడు. క్రమంగా పరుగులు రాబట్టాడు. చివరి వరకు నిలిచాడు. డారిల్ మిచెల్ (13 బంతుల్లో 22 పరుగులు) కాసేపు దూకుడు చూపాడు. ఎనిమిదో ఓవర్లో చాహల్ అతడిని ఎల్బీడబ్ల్యూ చేశాడు. మోయిన్ అలీ (10) విఫలం కాగా.. శివం దూబే (18) కాసేపు నిలిచాడు.
జడేజా అరుదైన ఔట్
ఈ మ్యాచ్‍లో చెన్నై బ్యాటర్ రవీంద్ర జడేజా (5) అరుదైన ఔట్ అయ్యాడు. 16వ ఓవర్ ఐదో బంతికి నాన్ స్ట్రయికర్ ఎండ్‍లో రెండో రన్ కోసం ముందుకు వచ్చాడు జడేజా. రాజస్థాన్ కీపర్ సంజూ శాంసన్ వికెట్లకు త్రో వేయగా.. వెనక్కి పరుగెత్తిన జడేజాకు తాకింది. అయితే, వికెట్లకు కావాలనే జడేజా అడ్డువచ్చాడని నిర్ధారించిన థర్డ్ అంపైర్ ‘అబ్‍స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ కింద ఔట్ ఇచ్చాడు. దీంతో నిరాశగా పెవిలియన్‍కు వెళ్లాడు జడేజా.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. చివర్లో సమీర్ రిజ్వి (11) అతడికి సహకరించాడు. మొత్తంగా చెన్నై అలవోకగా గెలిచింది. హోం గ్రౌండ్ చెపాక్‍లో చెన్నైకు ఇది 50వ గెలుపుగా ఉంది.
రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు, నాండ్రే బర్గర్ ఓ వికెట్ తీశారు.
మూడో ప్లేస్‍కు చెన్నై
ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో ఏడు గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. 14 పాయింట్లను సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగా.. అది గెలిస్తే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ఓడినా పట్టికలో రెండో ప్లేస్‍లోనే కొనసాగింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో ఎనిమిది గెలిచి, నాలుగు ఓడింది. పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‍లోనే కొనసాగింది ఆర్ఆర్.