RR vs MI: రెచ్చిపోయిన రాజస్థాన్ రాయల్స్.. యశస్వి సెంచరీ గర్జన.. చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్
Rajasthan Royals vs Mumbai Indians: రాజస్థాన్ రాయల్స్ (RR) మరోసారి గర్జించింది. ముంబై ఇండియన్స్(MI)పై అలవోకగా గెలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది ఆర్ఆర్. యశస్వి జైస్వాల్ అద్భుత శకతంతో అదరగొట్టాడు.
RR vs MI: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో అదరగొడుతున్న ఆ జట్టు మరో అలవోక విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్‌తో నేడు (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్‍లో సత్తాచాటిన సంజూ శాంసన్ సారథ్యంలోని ఆర్ఆర్ గ్రాండ్‍గా గెలిచింది. హోం గ్రౌండ్ జైపూర్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ముంబైపై విక్టరీ కొట్టింది. దీంతో ఈ సీజన్‍లో ఏడో విజయాన్ని నమోదు చేసుకొని ప్లేఆఫ్స్ అర్హతకు చాలా దగ్గరైంది రాయల్స్.
సందీప్ పాంచ్ పటాకా, యశస్వి శతకం
బౌలింగ్‍లో రాజస్థాన్ పేసర్ సందీప్ శర్మ ఐదు వికెట్లతో సత్తాచాటగా.. బ్యాటింగ్‍లో యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో కదంతొక్కాడు. గాయం నుంచి కోలుకొని వచ్చిన సందీప్ శర్మ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ముంబై బ్యాటింగ్ లైనప్‍ను కూల్చాడు. లక్ష్యఛేదనలో యశస్వి జైస్వాల్ అజేయ సెంచరీ చేసి అదరగొట్టాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 104 పరుగులు చేసి సత్తాచాటాడు యశస్వి. చివరి వరకు నిలిచి రాజస్థాన్‍ను గెలిపించాడు. తన కెరీర్లో రెండో ఐపీఎల్ శతకం చేశాడు జైస్వాల్. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయిన జైస్వాల్.. ఈ సెంచరీతో ఫామ్‍లోకి వచ్చేశాడు. అన్ని విభాగాల్లో నిరాశపరిచిన ముంబై ఈ మ్యాచ్‍లో చిత్తుగా ఓడింది.
ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ (45 బంతుల్లో 65 పరుగులు) అద్భుత అర్ధ శతక ఇన్నింగ్స్‌తో మెరిపించాడు. నేహాల్ వధేరా (24 బంతుల్లో 49 పరుగులు) అదరగొట్టాడు. దీంతో ముంబైకు ఆస్కోరు దక్కింది. ఇషాన్ కిషన్ (0), రోహిత్ శర్మ (6), సూర్యకుమార్ యాదవ్ (10), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) సహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇషాన్, సూర్య, తిలక్, టిమ్ డేవిడ్ (3), గెరాల్డ్ కొయిట్జీ (0)ని ఔట్ చేసి ముంబైను సందీప్ దెబ్బకొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ రెండు, ఆవేశ్ ఖాన్, యజువేంద్ర చాహల్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
జైస్వాల్ దంచుడు.. అలవోకగా ఛేదన
లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ అలవోకగా ఛేదించింది. మధ్యలో వర్షం కాసేపు అంతరాయం కలిగించినా.. మళ్లీ ఆట మొదలైంది. పూర్తిగా ముంబైపై రాజస్థాన్ ఆధిపత్యం ప్రదర్శించింది. 18.4 ఓవర్లలోనే ఒక వికెట్‍కు 183 పరుగులు చేసి రాజస్థాన్ సునాయాస విజయం సాధించింది. ఈ సీజన్‍లో రెండోసారి కూడా ముంబైపై గెలిచి సత్తాచాటింది. యశస్వి జైస్వాల్ సెంచరీతో మెరిపించగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (28 బంతుల్లో 38 పరుగులు నాటౌట్) చివరి వరకు జైస్వాల్‍కు సహకరించాడు. జాస్ బట్లర్ (35) కూడా రాణించాడు. యశస్వి జైస్వాల్ వీరబాదుడుతో లక్ష్యం త్వరగా కరిగిపోయింది. ముంబై బౌలర్లను యశస్వి ఆటాడుకున్నాడు. ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా ఒక్కడే ఓ వికెట్ తీయగలిగాడు. ఫీల్డింగ్‍లోనూ తీవ్రంగా తడబడిన ముంబై కొన్ని క్యాచ్‍లను నేలపాలు చేసింది.
చాహల్ అరుదైన రికార్డ్
ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‍లో నబీని ఔట్ చేసిన చాహల్.. ఐపీఎల్‍లో 200 వికెట్ల మార్కుకు చేరాడు. ఐపీఎల్ ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‍లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న చాహల్ తర్వాత డ్వైన్ బ్రావో (183 రిటైర్డ్), పియూష్ చావ్లా (182) ఉన్నారు.
ప్లేఆఫ్స్‌కు మరింత దగ్గరగా..
ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో 8 మ్యాచ్‍ల్లో 7 గెలిచిన రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లను దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు ఓ గెలుపు దూరంలో ఉంది. ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్‍ల్లో 5 ఓడింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది.