PBKS vs CSK: జడేజా ఆల్‍రౌండ్ షో.. పంజాబ్‍పై ప్రతీకారం తీర్చుకున్న చెన్నై.. సునాయాసంగా గ్రాండ్ విక్టరీ-ipl 2024 pbks vs csk result ravindra jadeja shines chennai super kings beat punjab kings ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pbks Vs Csk: జడేజా ఆల్‍రౌండ్ షో.. పంజాబ్‍పై ప్రతీకారం తీర్చుకున్న చెన్నై.. సునాయాసంగా గ్రాండ్ విక్టరీ

PBKS vs CSK: జడేజా ఆల్‍రౌండ్ షో.. పంజాబ్‍పై ప్రతీకారం తీర్చుకున్న చెన్నై.. సునాయాసంగా గ్రాండ్ విక్టరీ

Chatakonda Krishna Prakash HT Telugu
May 05, 2024 07:25 PM IST

PBKS vs CSK IPL 2024: పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్‍తో పాటు బౌలింగ్‍లోనూ చెన్నై స్టార్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. మోస్తరు స్కోరే చేసినా బౌలింగ్‍లో దుమ్మురేపి పంజాబ్‍ను చిత్తుచేసింది సీఎస్‍కే.

PBKS vs CSK: జడేజా ఆల్‍రౌండ్ షో.. పంజాబ్‍పై ప్రతీకారం తీర్చుకున్న చెన్నై.. సునాయాసంగా గ్రాండ్ విక్టరీ
PBKS vs CSK: జడేజా ఆల్‍రౌండ్ షో.. పంజాబ్‍పై ప్రతీకారం తీర్చుకున్న చెన్నై.. సునాయాసంగా గ్రాండ్ విక్టరీ (AP)

PBKS vs CSK IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో పంజాబ్ కింగ్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ ప్రతీకారం తీర్చుకుంది. గత మ్యాచ్‍లో తనను ఓడించిన పంజాబ్‍ను చిత్తుచేసి సీఎస్‍కే సత్తాచాటింది. ధర్మశాల వేదికగా నేడు (మే 5) జరిగిన ఐపీఎల్ మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్‍పై సూపర్ విక్టరీ సాధించింది.

జడేజా ఆల్‍రౌండ్ మెరుపులు

ఈ మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ రవీంద్ర జడేజా ఆల్‍రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‍లో 26 బంతుల్లోనే 43 పరుగులతో జడేజా మెరిపించాడు. 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. 75 పరుగులకే చెన్నై 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‍కు వచ్చిన జడేజా అదరగొట్టాడు. చివరి ఓవర్లో ఔటయ్యాడు. జడేజా దూకుడుగా ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేయగలిగింది. బౌలింగ్‍లోనూ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. 3 ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రభ్‍సిమ్రన్ సింగ్ (30), సామ్ కరన్ (7), అషుతోష్ శర్మ(3)ను ఔట్ చేసి పంజాబ్‍ను దెబ్బకొట్టాడు జడేజా. ఈ మ్యాచ్‍లో ఆల్ రౌండ్‍ షోతో దుమ్మురేపాడు జడ్డూ.

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. జడేజా దుమ్మురేపగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (32), డారిల్ మిచెల్ (30) పర్వాలేదనిపించారు. అయితే, శివమ్ దూబే (0), ఎస్ఎస్ ధోనీ (0), అజింక్య రహానే (9) సహా మిలిగిన బ్యాటర్లు నిరాశపరిచారు. అయితే, చివర్లో జడేజా దూకుడుగా ఆడటంతో చెన్నైకు మంచి స్కోరు వచ్చింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు దక్కించుకోగా.. అర్షదీప్ సింగ్ రెండు, సామ్ కరన్ ఓ వికెట్ తీసుకున్నారు.

పంజాబ్‍ను కూల్చేసిన చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు సమిష్టిగా విజృంభించారు. దీంతో లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ విలవిల్లాడింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 139 పరుగులే చేయగలిగింది. పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో (7)ను, రాలీ రుసో (0)ను రెండో ఓవర్లోనే చెన్నై పేసర్ తుషార్ దేశ్‍పాండే ఔట్ చేశాడు. ఆ తర్వాత ప్రభ్‍సిమ్రన్ సింగ్ (30), శశాంక్ సింగ్ (27) కాసేపు దూకుడుగా ఆడారు. 53 పరుగుల భాగస్వామ్యం చేశారు. అయితే, వారిద్దరూ వెనువెంటే ఔటయ్యారు. కెప్టెన్ సామ్ కరన్ (7) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. జితేశ్ శర్మ (0)ను సిమ్రన్‍జీస్ సింగ్ గోల్డెన్ డక్ చేశాడు. అషుతోశ్ శర్మ త్వరగానే ఔటయ్యాడు. చివర్లో హర్ప్రీత్ బ్రార్ (17 నాటౌట్), హర్షల్ పటేల్ (12), రాహుల్ చాహర్ (16), కగిసో రబాడ (11 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేసినా సరిపోలేదు. బ్రార్ చివరి వరకు నిలిచి పంజాబ్ ఆలౌట్ కాకుండా కాపాడాడు.

మొత్తంగా 28 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. సీఎస్‍కే బౌలర్లలో జడేజా మూడు, తుషార్ దేశ్‍పాండే, సిమ్రన్‍జీత్ తలా రెండు వికెట్లు తీశారు. మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

గత మ్యాచ్‍లో హోం గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో పంజాబ్‍పై చెన్నై ఓటమి పాలైంది. అయితే, ఇప్పుడు చెన్నై ప్రతీకారం తీర్చుకుంది. ధర్మశాల వేదికగా పంజాబ్‍ను చిత్తుచిత్తు చేసింది.

మూడో ప్లేస్‍కు చెన్నై

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‍ల్లో 6 గెలిచి ఐదు 5 ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో 12 పాయింట్లను దక్కించుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది సీఎస్కే. పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‍ల్లో ఏడు ఓడి, నాలుగు గెలిచింది. ఎనిమిదో స్థానంలో ఉంది. లీగ్ దశలో మిగిలిన మూడు మ్యాచ్‍ల్లో గెలిచినా పంజాబ్‍కు ప్లేఆఫ్స్ అవకాశాలు అంతంత మాత్రమే ఉంటాయి.

Whats_app_banner