Shivam Dube: ప్రపంచకప్‍కు ఎంపికయ్యాక ఫామ్ కోల్పోయిన శివమ్ దూబే: వరుసగా రెండో గోల్డెన్ డక్-sivam dube registered consecutive golden ducks after selection for t20 world cup indian squad pbks vs csk ipl 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shivam Dube: ప్రపంచకప్‍కు ఎంపికయ్యాక ఫామ్ కోల్పోయిన శివమ్ దూబే: వరుసగా రెండో గోల్డెన్ డక్

Shivam Dube: ప్రపంచకప్‍కు ఎంపికయ్యాక ఫామ్ కోల్పోయిన శివమ్ దూబే: వరుసగా రెండో గోల్డెన్ డక్

Chatakonda Krishna Prakash HT Telugu
May 05, 2024 05:48 PM IST

PBKS vs CSK - Shivam Dube: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివమ్ దూబే వరుసగా రెండోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో నేటి మ్యాచ్‍లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై మోస్తరు స్కోరు చేసింది.

Shivam Dube: ప్రపంచకప్‍కు ఎంపికయ్యాక ఫామ్ కోల్పోయిన శివమ్ దూబే: వరుసగా రెండో గోల్డెన్ డక్
Shivam Dube: ప్రపంచకప్‍కు ఎంపికయ్యాక ఫామ్ కోల్పోయిన శివమ్ దూబే: వరుసగా రెండో గోల్డెన్ డక్ (PTI)

PBKS vs CSK IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్, భారత యంగ్ స్టార్ శివమ్ దూబే కాస్త ఫామ్ కోల్పోయాడు. ఐపీఎల్ 2024 సీజన్‍లో వరుసగా రెండోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో హిట్టింగ్‍తో ఆకట్టుకున్నాడు దూబే. 9 మ్యాచ్‍ల్లోనే సుమారు 170 స్ట్రైక్ రేట్‍తో 350 రన్స్ చేసి అదరగొట్టాడు. దీంతో ఫుల్ ఫామ్‍లో ఉన్న శివం దూబేను టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో సెలెక్టర్లు ఇటీవలే ఎంపిక చేశారు. అయితే, ఐపీఎల్‍లో రెండు మ్యాచ్‍లుగా దూబే నిరాశపరిచాడు. పంజాబ్ కింగ్స్ (PBKS)తో నేటి (మే 5) మ్యాచ్‍లో శివమ్ దూబే గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

వరుసగా రెండో గోల్డెన్ డక్

శివమ్ దూబేకు ఇది వరుసగా రెండో గోల్డెన్ డక్‍గా ఉంది. చెన్నై వేదికగా జరిగిన గత మ్యాచ్‍లో పంజాబ్‍పై సీఎస్‍కే బ్యాటర్ శివమ్ దూబే తొలి బంతికే డకౌట్ అయ్యాడు. పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్‍లో ఎల్బీడబ్ల్యూ అయి గోల్డెన్ డక్‍గా పెవిలియన్ చేరాడు. కాగా, ధర్మశాల వేదికగా పంజాబ్‍తోనే నేటి (మే 5) మ్యాచ్‍లోనూ దూబే తీవ్రంగా నిరాశపరిచాడు. స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‍లో తన తొలి బంతికే కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో వరుసగా రెండోసారి గోల్డెన్ డక్‍గా వెనుదిరిగాడు.

జూన్‍‍లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టులోకి ఎంపికయ్యాక దూబే ఇలా ఫామ్ కోల్పోవడం అభిమానులను కాస్త టెన్షన్ పెడుతోంది. అయితే, మళ్లీ ఐపీఎల్‍లోనే అతడు ఫామ్‍లోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2024 లీగ్ దశలో చెన్నై ఇంకా మూడు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ చేరితే అక్కడా ఆడొచ్చు. దూబే మళ్లీ ఐపీఎల్‍లోనే ఫామ్ అందుకొని ప్రపంచకప్‍కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

చెన్నైను నిలువరించిన పంజాబ్

పంజాబ్‍తో మ్యాచ్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది చెన్నై సూపర్ కింగ్స్. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు సమిష్టిగా రాణించి చెన్నైను అడ్డుకున్నారు. చెన్నై సీనియర్ ఓపెనర్ అజింక్య రహానే (9) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (32) కాసేపు రాణించాడు. డారిల్ మిచెల్ (30) పర్వాలేదనిపించాడు. దూబే, మొయిన్ అలీ (17) విఫలమయ్యారు.

జడేజా మెరుపులు.. ధోనీ డకౌట్

మిగిలిన బ్యాటర్లు విఫలమైనా చెన్నై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దుమ్మురేపాడు. అతడు దూకుడుగా ఆడటంతో చెన్నైకు ఆ మాత్రం స్కోరు దక్కింది. 26 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు జడేజా. 3 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టాడు. చివరి ఓవర్లో ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ (17) విలువైన పరుగులు చేశాడు. శార్దూల్ ఔయ్యాక 19వ ఓవర్లో బ్యాటింగ్‍కు దిగిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. తన తొలి బంతికే హర్షల్ పటేల్ బౌలింగ్‍లో బౌల్డ్ అయ్యాడు. గోల్డెన్ డక్‍గా వెనుదిరిగాడు.

చాహర్, హర్షల్ అదుర్స్

పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. 4 ఓవర్లలో చాహర్ కేవలం 23 పరుగులే ఇస్తే.. హర్షల్ 24 రన్స్ ఇచ్చాడు. చెన్నై బ్యాటర్లు ఇద్దరూ కట్టడి చేశారు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ సామ్ కరన్‍కు ఓ వికెట్ దక్కింది. చెన్నై ముందు 168 పరుగుల లక్ష్యం ఉంది.

Whats_app_banner