Shivam Dube: ప్రపంచకప్‍కు దూబే ఎంపిక కాకపోతే.. సీఎస్‍కేదే బాధ్యత: టీమిండియా మాజీ బ్యాటర్
IPL 2024 - Shivam Dube: టీ20 ప్రపంచకప్‍లో శివం దూబేకు చోటు దక్కుతుందా అనే విషయంపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు టీమిండియా మాజీ బ్యాటర్ మనోజ్ తివారీ. వరల్డ్ కప్‍కు దూబే ఎంపిక కాకపోతే సీఎస్‍కేదే బాధ్యత అని అన్నారు. ఎందుకో కూడా వివరించారు.
IPL 2024 - Shivam Dube: జూన్‍లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియాలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‍రౌండర్‌గా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలో ఎవరికి చోటు దక్కాలన్న విషయంపై చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధనాధన్ బ్యాటింగ్‍తో శివమ్ దూబే మెప్పిస్తున్నాడు. సీనియర్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంతగా ఫామ్‍లో లేడు. అయితే, హార్దిక్‍కు ఎక్కువ అనుభవం ఉంది. దీంతో టీ20 ప్రపంచకప్‍కు బీసీసీఐ ఆ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలన్న విషయంపై కొందరు మాజీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. భారత మాజీ బ్యాటర్ మనోజ్ తివారీ కూడా ఈ విషయంపై మాట్లాడాడు.
టీ20 ప్రపంచకప్‍లో టీమిండియాలో హార్దిక్ పాండ్యా బదులు శివమ్ దూబేనే తీసుకోవాలని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు దూబేకు బౌలింగ్ ఇవ్వడం లేదని, ఒకవేళ ప్రపంచకప్‍కు అతడు ఎంపిక కాకపోతే ఆ బాధ్యత సీఎస్‍కేదే అని తివారీ.. క్రిక్‍బజ్ కార్యక్రమంలో అన్నారు.
హార్దిక్ బౌలింగ్‍పై..
ఈ ఐపీఎల్ సీజన్‍లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా తొలి రెండు మ్యాచ్‍ల్లో ఏడు ఓవర్లు వేసినా.. ఆ తర్వాతి మూడు మ్యాచ్‍ల్లో ఒకే ఓవర్ వేశాడని మనోజ్ తివారీ గుర్తు చేశాడు. “ఒకవేళ అతడు (హార్దిక్) ఆల్ రౌండర్‌గా టీ20 ప్రపంచకప్ భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే బౌలింగ్ చేయాలి. అతడి ఎకానమీ రేట్ చూడండి 11 ఉంది. ఈ సీజన్‍లో అతడు సరిగా పర్ఫార్మ్ చేయడం లేదు” అని మనోజ్ తివారీ అన్నాడు.
బ్యాటింగ్ కోసం హార్దిక్‍ను తీసుకోవచ్చా అని రోహన్ గవాస్కర్ అడడగా.. లేదు అని మనోజ్ తివారీ చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్‍లో ఐదు మ్యాచ్‍ల్లో 160 స్ట్రైక్ రేట్‍తో 176 పరుగులు చేసిన శివమ్ దూబేకే తివారీ ఓటేశారు. భారత జట్టులో దూబేనే ఉండాలని అన్నాడు. ఒకవేళ ప్రపంచకప్‍కు దూబే ఎంపిక కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడిని ఆడిస్తున్న సీఎస్‍కేదే బాధ్యత అని తివారీ చెప్పాడు.
అగార్కర్ గట్టి నిర్ణయమే..
టీమిండియా చీఫ్ సెలెక్టర్ బోల్డ్ నిర్ణయం తీసుకుంటారని తనకు అనిపిస్తోందని మనోజ్ తివారీ చెప్పారు. దూబేనే ఎంపికవుతాడని అనుకుంటున్నట్టు చెప్పారు. “ఫామ్‍ను బట్టి చూస్తే హార్దిక్ పాండ్యాకు టీ20 ప్రపంచకప్ కోసం తీసుకోకూడదు. అగార్కర్ చాలా కఠినంగా ఉండే వ్యక్తి. అందుకే బోల్ట్ డెసిషన్స్ తీసుకోగలరు. ఒకవేళ టీ20 ప్రపంచకప్‍కు దూబే ఎంపిక కాకపోతే దానికి సీఎస్‍కేనే బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్లు అతడికి బౌలింగ్ ఇవ్వడం లేదు. నేను ఎప్పటి నుంచో చెబుతున్నా.. హార్దిక్ పాండ్యాకు రిప్లేస్‍మెంట్ కావాలంటే.. దూబే సిద్ధంగా ఉన్నాడని” అని మనోజ్ తివారీ చెప్పారు.
జూన్ 1 నుంచి జూన్ 29వ తేదీ వరకు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం ఏప్రిల్ నెలాఖరులో భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.