CSK vs GT IPL 2024: దూబే, రచిన్ ధనాధన్.. సమిష్టిగా సత్తాచాటిన బౌలర్లు.. ధోనీ సూపర్ క్యాచ్: చెన్నై భారీ విజయం
CSK vs GT IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచేసింది చెన్నై సూపర్ కింగ్స్. అన్ని విభాగాల్లో సత్తాచాటి గుజరాత్‍పై అలవోకగా విజయం సాధించింది. సీఎస్‍కే ప్లేయర్లు శివం దూబే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్‍లో దుమ్మురేపారు.

CSK vs GT: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి దుమ్మురేపింది. ఈ సీజన్‍లో తన రెండో మ్యాచ్‍లోనూ విజయం సాధించింది. ఆల్‍రౌండ్ షోతో గుజరాత్‍ను చిత్తు చేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నేడు (మార్చి 26) జరిగిన మ్యాచ్‍లో సీఎస్‍కే 63 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఘనంగా గెలిచింది.
దంచికొట్టిన దూబే, రచిన్
ఈ మ్యాచ్‍లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‍కు దిగింది చెన్నై సూపర్ కింగ్స్. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (46), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (46) అదిరే ఆరంభం అందించారు. రచిన్ రవీంద్ర 20 బంతుల్లోనే 6 ఫోర్లు 4 సిక్సర్లతో 46 రన్స్ చేశాడు. ధనాధన్ ఆటతో దుమ్మురేపాడు. రుతురాజ్ గైక్వాడ్ అతడికి సహకరించాడు. రచిన్ ఔటయ్యాక.. అజింక్య రహానే (12) ఎక్కువసేపు నిలువలేదు. ఆ తర్వాత రుతురాజ్ కూడా కాసేపటికి వెనుదిరిగాడు.
అయితే, ఆ తర్వాత శివమ్ దూబే భారీ హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. తన మార్క్ దూకుడైన బ్యాటింగ్‍తో రెచ్చిపోయాడు. గుజరాత్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 23 బంతుల్లోనే 51 పరుగులతో అర్ధ శకతం చేశాడు దూబే. 2 ఫోర్లు కొట్టి.. ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు. మరో ఎండ్‍లో డారిల్ మిచెల్ (24 నాటౌట్) చివరి వరకు నిలిచాడు. యంగ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‍లోనే 6 బంతుల్లో 14 రన్స్ చేశాడు. మొత్తంగా 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 రన్స్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు, సాయి కిశోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలా ఒకటి వికెట్ తీసుకున్నారు.
బౌలర్లు సమిష్టిగా..
భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఏ దశలోనూ సత్తాచాటలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది. చెన్నై బౌలర్లు సమిష్టిగా రాణించి గుజరాత్‍ను కూల్చేశారు. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్ (37), వృద్ధిమాన్ సాహా (21), డేవిడ్ మిల్లర్ (21) పర్వాలేదనిపించగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రహమాన్, తుషార్ దేశ్‍పాండే చెరో రెండు వికెట్లు తీశారు. మతీష పతిరణ, డారిల్ మిచెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు. మొత్తంగా చెన్నై భారీ విజయం సాధించింది.
ధోనీ సూపర్ క్యాచ్
చెన్నై సీనియర్ స్టార్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‍లో ఓ సూపర్ క్యాచ్ పట్టాడు. గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్ ఇచ్చిన క్యాచ్‍ను కుడివైపునకు భారీ డైవ్ కొట్టి పట్టేశాడు 42 ఏళ్ల ధోనీ. సుమారు రెండున్నర మీటర్ల పాటు డైవ్ కొట్టి బంతిని అందుకున్నాడు. డారిల్ మిచెల్ బౌలింగ్‍లో విజయ్ విజయ్ బ్యాట్ ఎడ్జ్ తాకి బంతి రాగా.. మహీ ఫుల్ డైవ్ కొట్టి పట్టేశాడు. ధోనీ ఈ సూపర్ క్యాచ్ పట్టడంతో చెపాక్ స్టేడియంలో ప్రేక్షకులు హోరెత్తించారు.
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍ల్లో రెండూ గెలువడంతో పాయింట్ల పట్టికలో చెన్నై ప్రస్తుతం టాప్‍కు చేరుకుంది. ఈ సీజన్‍లో తొలి మ్యాచ్ గెలిచిన గుజరాత్‍కు రెండో పోరులో చెన్నై చేతిలో పరాజయం ఎదురైంది.
ఈ సీజన్‍లో వరుసగా ఏడో మ్యాచ్‍లోనూ హోం టీమ్ విజయం సాధించింది. గత ఆరు మ్యాచ్‍ల్లోనూ ఇలా జరగగా.. చెన్నై దీన్ని కొనసాగించింది.
ఐపీఎల్ 2024లో రేపు (మార్చి 27) ముంబై ఇండియన్స్ జట్టుతో సన్‍రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.