SRH vs CSK Live: ఉప్పల్లో మరో గెలుపు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్-ipl 2024 srh vs csk live sunrisers hyderabad beat chennai super kings travis head aiden markram abhishek sharma ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Csk Live: ఉప్పల్లో మరో గెలుపు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్

SRH vs CSK Live: ఉప్పల్లో మరో గెలుపు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్

Hari Prasad S HT Telugu
Apr 05, 2024 10:53 PM IST

SRH vs CSK Live: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తమ సొంత మైదానంలో ఉప్పల్లో మరో గెలుపు సొంతం చేసుకుంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుగా ఓడించింది.

ఉప్పల్లో మరో గెలుపు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్
ఉప్పల్లో మరో గెలుపు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్ (PTI)

SRH vs CSK Live: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో ఆడిన రెండో మ్యాచ్ లోనూ గెలిచింది. మొదట ముంబై ఇండియన్స్.. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లాంటి స్ట్రాంగ్ జట్లను చిత్తుగా ఓడించడం విశేషం. 166 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ టీమ్ 4 వికెట్లు కోల్పోయి సులువుగా చేజ్ చేసింది. మరో 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లతో గెలిచింది. క్లాసెన్ 10, నితీష్ రెడ్డి 14 పరుగులతో అజేయంగా నిలిచారు.

మెరుపు వేగంతో చేజింగ్

సన్ రైజర్స్ హైదరాబాద్ చేజింగ్ మెరుపు వేగంతో మొదలైంది. ముంబై ఇండియన్స్ పై చెలరేగిన జోడీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ.. ఈ మ్యాచ్ లోనూ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆ మ్యాచ్ ఫామ్ ను ఇక్కడా కొనసాగించాడు. అతడు ముఖేష్ చౌదరి వేసిన రెండో ఓవర్లో ఏకంగా 27 రన్స్ బాదడం విశేషం.

ధాటిగా ఆడటానికి ప్రయత్నించి చివరికి 12 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఒక్క సింగిల్ తప్ప మిగతా పరుగులన్నీ బౌండరీల రూపంలోనే చేశాడు. ఇక హెడ్ కూడా మాంచి ఊపు మీద కనిపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగిన అతడు.. 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 31 రన్స్ చేసి ఔటయ్యాడు.

ఈ ఇద్దరూ పెవిలియన్ చేరినా.. ఏడెన్ మార్‌క్రమ్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. అతడు 36 బంతుల్లో సరిగ్గా హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. మార్‌క్రమ్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చివర్లో మార్‌క్రమ్ తోపాటు షాబాజ్ (18) వికెట్లు వెంటవెంటనే పడినా.. క్లాసెన్, నితీష్ రెడ్డి మరో వికెట్ పడకుండా జట్టుకు విజయం సాధించి పెట్టారు.

స్లో పిచ్‌పై సీఎస్కే తడబాటు

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ స్లో పిచ్ పై తడబడింది. మొదట్లో శివమ్ దూబె, చివర్లో జడేజా తప్ప మిగిలిన బ్యాటర్లు రన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారు.

ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 277 రన్స్ చేసింది. అదే ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆ పిచ్ తో పోలిస్తే ఇప్పటి పిచ్ పూర్తి నెమ్మదిగా ఉండటంతో సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 రన్స్ చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున శివమ్ దూబె, అజింక్య రహానే రాణించడంతో ఆ టీమ్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. దూబె 24 బంతుల్లోనే 45 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు తడబడిన అదే పిచ్ పై అతడు మాత్రం 4 సిక్స్ లు, 2 ఫోర్లతో చెలరేగడం విశేషం. మరోవైపు వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే 30 బంతుల్లో 35 రన్స్ చేశాడు. అతడు 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

పిచ్ నెమ్మదిగా ఉండటంతో పరుగులు అంత సులువుగా రాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అనుకున్న స్పీడులో ఇన్నింగ్స్ ప్రారంభించలేదు. 25 రన్స్ దగ్గర రవీంద్ర (12) ఔటయ్యాడు. తర్వాత కెప్టెన్ రుతురాజ్ కూడా 21 బంతుల్లో 26 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో రహానే, శివమ్ దూబె కలిసి మూడో వికెట్ కు 65 రన్స్ జోడించారు.

Whats_app_banner