Mumbai Indians: క్రికెట్ పక్కన పెట్టి ఎంజాయ్ చేసిన ముంబై ఇండియన్స్ ప్లేయర్స్.. రోహిత్, హార్దిక్ కూడా..
Mumbai Indians: ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ క్రికెట్ పక్కన పెట్టి వెకేషన్ ఎంజాయ్ చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఇతర ప్లేయర్స్ జామ్‌నగర్ వెళ్లారు.
Mumbai Indians: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. వరుసగా మూడు ఓటములతోపాటు కెప్టెన్సీ మార్పుపై జట్టులో విభేదాలు, అభిమానులనుంచి హేళనలాంటివి ఆ జట్టును వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ టీమ్ లోని ప్లేయర్స్ క్రికెట్ పక్కన పెట్టి వెకేషన్ ఎంజాయ్ చేయడం గమనార్హం.
ముంబై ఇండియన్స్ వెకేషన్ మోడ్
ఐపీఎల్ 2024లో నాలుగో మ్యాచ్ కు ముందు కాస్త బ్రేక్ దొరకడంతో ఆ టీమ్ కాసేపు క్రికెట్ ను పక్కన పెట్టింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతోపాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర ప్లేయర్స్ అందరూ గుజరాత్ లోని జామ్‌నగర్ కు వెళ్లారు. మూడు, నాలుగు మ్యాచ్ లకు మధ్య ఆరు రోజుల గ్యాప్ ఉండటంతో ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్లేయర్స్ ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోను ముంబై టీమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. వాటర్ గేమ్స్, మ్యూజిక్ నైట్స్ తో ప్లేయర్స్ అందరూ రిలాక్స్ గా కనిపించారు. హార్దిక్, రోహిత్ హ్యాపీగా చేతులు కలుపుతున్న క్లిప్ తోనే ఈ వీడియోను ప్రారంభించారు. ఆ తర్వాత టీమ్ మొత్తం సరదాగా గడుపుతుండటం ఇందులో చూడొచ్చు.
రోహిత్, హార్దిక్ మధ్య విభేదాలు
కెప్టెన్సీ మార్పు, ముంబై ఇండియన్స్ వరుస ఓటముల నేపథ్యంలో ప్రస్తుత, మాజీ కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఆ ఫ్రాంఛైజీ ఈ వీడియోతోనే సమాధానం చెప్పినట్లు అయింది. ఇందులో మొదట్లోనే ఈ ఇద్దరు ప్లేయర్స్ సరదాగా, నవ్వుతూ చేతులు కలుపుతుండటం గమనార్హం.
ఇది చూసి అయినా వీళ్ల మధ్య విభేదాలన్న పుకార్లకు చెక్ పెడతారన్న ఉద్దేశంతోనే ముంబై ఇండియన్స్ ఈ పని చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాదు ఆ ఓటముల బాధ నుంచి బయటపడి మళ్లీ ఫ్రెష్ గా మొదలుపెట్టడానికి ప్లేయర్స్ కు ఇలాంటి బ్రేక్ చాలా అవసరం. నిజానికి వాళ్లంతా కూడా హ్యాట్రిక్ ఓటముల నుంచి తేరుకున్నట్లుగా ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.
ముంబై టీమ్ ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతోంది. ఇప్పటికే గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ముంబై ఓడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇంత వరకూ విజయాల బోణీ చేయని ఏకైక టీమ్ ఇదే. అయితే ఈ కీలకమైన మ్యాచ్ కు ముందు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టుతో చేరడం వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.
ఈ బ్రేక్ తోపాటు సూర్య కమ్ బ్యాక్ ఆ టీమ్ ను బలంగా మార్చనున్నాయి. పైగా హార్దిక్ పాండ్యా బలంగా పుంజుకుంటాడన్న నమ్మకంతో పలువురు మాజీ క్రికెటర్లు ఉన్నారు. తనను అభిమానులు హేళన చేస్తున్నా, వరుస ఓటములు ఎదురవుతున్నా.. హార్దిక్ కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గలేదని వాళ్లు చెబుతున్నారు. మరి ఢిల్లీతో మ్యాచ్ లో అయినా ఆ టీమ్ గాడిన పడుతుందా? ఈ సీజన్లో తొలి విజయం సాధిస్తుందా అన్నది చూడాలి.