Travis Head: ట్రావిస్ హెడ్ ఊచకోత.. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
Travis Head: సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన తొలి మ్యాచ్ లోనే ట్రావిస్ హెడ్ ఊచకోత కోశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను చితకబాదుతూ.. ఫ్రాంఛైజీ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేశాడు.

Travis Head: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్ చరిత్రలో ఫ్రాంఛైజీ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. అతడు కేవలం 18 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఐపీఎల్లో సన్ రైజర్స్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోరు సాధించింది.
ట్రావిస్ హెడ్ ఊచకోత
గత వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్ లో ఆడే అవకాశం దక్కకపోయినా.. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో బరిలోకి దిగిన అతడు చెలరేగిపోయాడు. కేవలం 18 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్ లతో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో సన్ రైజర్స్ పవర్ ప్లే 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 రన్స్ చేసింది.
సన్ రైజర్స్ తరఫున ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇదే కాగా.. పవర్ ప్లేలో ఆ టీమ్ కు కూడా ఇదే బెస్ట్ స్కోరు కావడం విశేషం. ముంబై ఇండియన్స్ బౌలర్లు హార్దిక్ పాండ్యా, మఫాకా, కోయెట్జీలను టార్గెట్ చేస్తూ హెడ్ వీరబాదుడు బాదాడు. తొలి బంతి నుంచీ అటాకింగ్ ఆడుతూ ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో సన్ రైజర్స్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
హెడ్ దెబ్బకు మఫాకా ఒకే ఓవర్లో 22 పరుగులు ఇచ్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో వరుసగా మూడు ఫోర్లు.. కోయెట్జీ బౌలింగ్ లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు హెడ్. చివరికి కోయెట్జీ బౌలింగ్ లోనే హెడ్ ఔటయ్యాడు. అతడు కేవలం 24 బంతుల్లో 62 రన్స్ చేయడం విశేషం. హెడ్ ఇన్నింగ్స్ లో మొత్తంగా 9 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. ఒక్క బుమ్రా తప్ప మిగిలిన బౌలర్లందరినీ అతడు చితకబాదాడు.
ట్రావిస్ హెడ్ సూపర్ హిట్
గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్, వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా కొంప ముంచాడు ట్రావిస్ హెడ్. ఈ రెండు ఫైనల్స్ లోనూ సెంచరీలతో ఆస్ట్రేలియాను గెలిపించాడు. అలాంటి హెడ్ ను గత వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అతనితోపాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను కూడా ఏకంగా 20.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
అయితే తనను కొనుగోలు చేయడం ఎంత సరైన నిర్ణయమో తొలి మ్యాచ్ లో హెడ్ నిరూపించాడు. సన్ రైజర్స్ అతన్ని ఐపీఎల్ వేలంలో రూ.6.8 కోట్లకు దక్కించుకుంది. తొలి మ్యాచ్ లో అతనికి అవకాశం ఇవ్వకుండా మార్కో యాన్సెన్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. అయితే అతడు విఫలం కావడంతో ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో హెడ్ కు అవకాశం దక్కింది. సన్ రైజర్స్ తరఫున తొలి మ్యాచ్ లోనే చెలరేగడం ఫ్రాంఛైజీకి శుభసూచకమే అని చెప్పాలి.