T20 World Cup 2024 Schedule: టీ20 ప్రపంచకప్ ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది: మ్యాచ్‍ల తేదీలు ఇవే.. ఇండియా vs పాక్ ఎప్పుడంటే..
T20 World Cup 2024 Schedule: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ పూర్తి షెడ్యూల్‍ను ఐసీసీ వెల్లడించింది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగే ఈ మెగాటోర్నీ మ్యాచ్ తేదీలను నేడు ప్రకటించింది. ఆ వివరాలివే..
T20 World Cup 2024 Schedule: ఈ ఏడాది జరగనున్న క్రికెట్ మెగాటోర్నీ ‘టీ20 ప్రపంచకప్’ షెడ్యూల్‍ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వెల్లడించింది. 20 జట్లు తలపడనున్న ఈ టోర్నీ షెడ్యూల్‍ను నేడు (జనవరి 5) ప్రకటించింది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా 2024 టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ ఈ ఏడాది జూన్ 1వ తేదీన మొదలుకానుంది. ఫైనల్ జూన్ 29న జరగనుంది. ఈ టోర్నీలో 20 జట్లు నాలుగు గ్రూప్‍లుగా బరిలోకి దిగనున్నాయి. గ్రూప్ స్టేజీలో నాలుగు మ్యాచ్‍లను భారత్.. అమెరికాలోనే ఆడనుంది. భారత్, పాకిస్థాన్ మధ్య పోరు జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనుంది. 2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వివరాలివే..
ప్రపంచకప్ 2024 టోర్నీ ముఖ్యమైన తేదీలు
జూన్ 1వ తేదీన డల్లాస్ వేదికగా అమెరికా, కెనడా జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‍లో టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ మొదలుకానుంది.
గ్రూప్ స్టేజ్ మ్యాచ్‍లు - జూన్ 1 నుంచి జూన్ 18 వరకు..
సూపర్ 8 మ్యాచ్‍లు - జూన్ 19 నుంచి జూన్ 24 వరకు..
తొలి సెమీ ఫైనల్ - జూన్ 26 - గయానా
రెండో సెమీఫైనల్ - జూన్ 27 - ట్రినిడాడ్
ఫైనల్ - జూన్ 29 - బార్బొడోస్
టీ20 ప్రపంచకప్ 2024లో 4 గ్రూప్‍లు.. జట్లు ఇలా
టీ20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్‍లో స్టేజీలో 20 జట్లను నాలుగు గ్రూప్‍లను ఐసీసీ విభజించింది. ఒక్కో గ్రూప్‍లో ఐదు జట్లు ఉన్నాయి. గ్రూప్ స్టేజీలో చెరో గ్రూప్‍లో టాప్-2లో నిలిచే 8 టీమ్‍లు సూపర్-8 దశకు చేరతాయి.
గ్రూప్ ఏ: ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా
గ్రూప్ బీ: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
గ్రూప్ సీ: న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండ, పపువా న్యూగినియా
గ్రూప్ డీ: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్
టీ20 ప్రపంచకప్2024 గ్రూప్ స్టేజీలో భారత్ మ్యాచ్‍లు
భారత్ vs ఐర్లాండ్ - జూన్ 5 - న్యూయార్క్
భారత్ vs పాకిస్థాన్ - జూన్ 9 - న్యూయార్క్
భారత్ vs అమెరికా - జూన్ 12 - న్యూయార్క్
భారత్ vs కెనడా - జూన్ 15 - ఫ్లోరిడా
టోర్నీ సాగేదిలా..
గ్రూప్ స్టేజీలో నాలుగు గ్రూప్‍ల్లో టాప్-2లో నిలిచే ఎనిమిది జట్లు సూపర్-8కు చేరతాయి. సూపర్-8 స్టేజీలో గెలిచే నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‍లో గెలిచే రెండు జట్లు ఫైనల్ చేరతాయి. టైటిల్ కోసం జూన్ 29న జరిగే ఫైనల్‍లో ఇరు జట్లు తలపడతాయి.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో మొత్తంగా 55 మ్యాచ్‍లు జరగనున్నాయి. 2022లో టీ20 టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్‍గా బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లిష్ జట్టు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య గ్రూప్ స్టేజీలో జూన్ 8న మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో 20 జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి.