CSK vs PBKS IPL 2024: చెన్నై డెన్‍లో గర్జించిన పంజాబ్ కింగ్స్.. అలవోకగా గెలుపు
CSK vs PBKS IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. చెన్నై హోం గ్రౌండ్ చెపాక్‍లో పంజాబ్ అదరగొట్టింది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
IPL 2024 Chennai Super Kings vs Punjab Kings: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అడ్డాలో పంజాబ్ కింగ్స్ (PBKS) తొడకొట్టింది. ఐపీఎల్ 2024 మ్యాచ్‍లో చెపాక్‍లో చెన్నైను పంజాబ్ అలవోకగా ఓడించింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో సజీవంగా నిలిచింది. చెపాక్ వేదికగా నేడు (మే 1) జరిగిన ఐపీఎల్ మ్యాచ్‍లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో హోం టీమ్ చెన్నైపై విజయం సాధించింది. ఆల్‍రౌండ్ షోతో పంజాబ్ అదుర్స్ అనిపించింది. అలవోకగా గెలిచింది.
గైక్వాడ్ ఒక్కడే..
టాస్ ఓడి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసింది చెన్నై సూపర్ సింగ్స్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 62 పరుగులు; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి సారి అర్ధ శకతంతో అదరగొట్టాడు. ఓ ఎండ్‍లో వరుసగా వికెట్లు పడుతున్నా గైక్వాడ్ ఒంటరి పోరాటం చేసి పరుగులు రాబట్టాడు. 20 ఓవర్లలో చెన్నై 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ అజింక్య రహానే (24 బంతుల్లో 29 పరుగులు) వేగంగా ఆడలేకపోయాడు. తొమ్మిదో ఓవర్లో ఔటయ్యాడు. శివమ్ దూబే (0) గోల్డెన్ డక్ అవగా.. రవీంద్ర జడేజా (2) నిరాశపరిచాడు. దీంతో 70 పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి.
మరోవైపు ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం దీటుగా ఆడాడు. పరుగులు చేస్తూ ముందుకు సాగాడు. 44 బంతుల్లో అర్ధ శకతం తర్వాత మరింత జోరు పెంచాడు. యంగ్ ప్లేయర్ సమీర్ రిజ్వి (21) కూడా నెమ్మదిగా ఆడటంతో పరుగులు ఆశించిన స్థాయిలో రాలేదు. రిజ్వి ఔటాయ్యాక.. 17వ ఓవర్లో పంజాబ్ పేసర్ అర్షదీప్ బౌలింగ్‍లో గైక్వాడ్ బౌల్డ్ అయ్యాడు. మొయిన్ అలీ (15) కాసేపు నిలువగా.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (14) ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టి చివరి ఓవర్లో రనౌట్ అయ్యాడు. మొత్తంగా రుతురాజ్ తప్ప మరే చెన్నై బ్యాటర్ అంతగా రాణించలేకపోయారు.
పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. కగిసో రబాడా, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. బ్రార్, చాహల్, రబాడా పొదుపుగా బౌలింగ్ చేసి.. చెన్నైను నిలువరించారు.
బెయిర్‌స్టో, రూసో మెరుపులు
17.5 ఓవర్లలోనే 3 వికెట్లకు 163 పరుగులు చేసి టార్గెట్‍ను ఆడుతూ పాడుతూ ఛేదించింది పంజాబ్ కింగ్స్. 13 బంతులను మిగిల్చి మరీ ఈజీగా గెలిచింది. మోస్తరు లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో మరోసారి దుమ్మరేపాడు. గత మ్యాచ్‍లో సెంచరీతో చెలరేగిన ఈ ఇంగ్లండ్ స్టార్ నేటి పోరులోనూ దుమ్మురేపాడు. ఓపెనర్ ప్రభ్‍సిమ్రన్ సింగ్ (13) త్వరగానే ఔటయ్యాడు. అయితే, జానీ బెయిర్‌స్టో 30 బంతుల్లో 46 పరుగులు చేసి అదరగొట్టాడు. 7 ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. అతడిని చెన్నై ఆల్ రౌండర్ శివమ్ దూబే ఔట్ చేశాడు. అయితే, పంజాబ్ స్టార్ రాలీ రూసో 23 బంతుల్లోనే 43 పరుగులతో (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. రూసోను 12వ ఓవర్లో పేసర్ ఠాకూర్ బౌల్డ్ చేయటంతో చెన్నై ఆశలు మళ్లీ చిగురించాయి. అయితే, శశాంక్ సింగ్ (25 నాటౌట్), కెప్టెన్ సామ్ కరన్ (26 నాటౌట్) చివరి వరకు నిలిచి పంజాబ్ జట్టును సునాయాయంగా గెలిపించారు.
ఆశలు నిలుపుకున్న పంజాబ్
ఈ మ్యాచ్‍లో చెన్నైపై గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను పంజాబ్ కింగ్స్ నిలుపుకుంది. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచి.. ఆరు ఓడింది పంజాబ్. 8 పాయింట్లను దక్కించుకుంది . ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. లీగ్ దశలో మిగిలిన నాలుగు మ్యాచ్‍లు గెలిస్తే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్‍ల్లో ఐదు గెలిచి.. ఐదు ఓడి 10 పాయింట్లతో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగింది.