pbks vs mi: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ ను మరో విజయానికి చేరువగా తీసుకెళ్లినా గెలిపించలేకపోయాడు అశుతోష్ శర్మ. 193 పరుగుల లక్ష్య ఛేదనలో 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న పంజాబ్ కింగ్స్ ను చివరికి విజయం దిశగా తీసుకెళ్లాడు.
అయితే కీలకమైన సమయంలో అతడు ఔటవడంతో 9 పరుగులతో గెలిచి ముంబై ఊపిరి పీల్చుకుంది. బుమ్రా మరోసారి కట్టుదిట్టమైన బౌలింగ్ తో 3 వికెట్లు తీశాడు. కొట్జియా కూడా 3 వికెట్లతో పంజాబ్ కింగ్స్ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. చివరికి పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది.
కళ్ల ముందు 193 పరుగుల భారీ లక్ష్యం.. ఇలాంటి పరిస్థితుల్లో చేజింగ్ లో 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్. ఈ సమయంలో ముంబై ఇండియన్స్ ఎన్ని పరుగుల తేడాతో గెలుస్తుందో అన్న ఆలోచన తప్ప.. పంజాబ్ కింగ్స్ గెలుపు ఆలోచన కూడా లేదు. కానీ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ మరోసారి మ్యాచ్ ను మలుపు తిప్పారు. అసలు ఆశలు లేని సమయం నుంచి గెలుపు ముంగిటి వరకూ తీసుకెళ్లారు. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41) మధ్యలోనే ఔటైనా.. అశుతోష్ వదల్లేదు. అతడు చాలా కాన్ఫిడెంట్ కనిపించాడు. చివరికి ముంబై
స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ లోనూ సిక్స్ బాదాడు. అతడు కచ్చితంగా పంజాబ్ కింగ్స్ ను గెలిపిస్తాడనుకున్న సమయంలో 18వ ఓవర్ తొలి బంతికి కొట్జియా బౌలింగ్ లో 28 బంతుల్లో 61 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 7 సిక్స్ లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత కూడా బ్రార్, రబాడాలాంటి వాళ్లు పంజాబ్ కింగ్స్ ను గెలిపించడానికి ప్రయత్నించినా.. చివరికి 9 పరుగులతో గెలిచి ముంబై ఊపిరి పీల్చుకుంది.
అంతకుముందు ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతోపాటు తిలక్ వర్మ, రోహిత్ శర్మ మెరుపులతో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది.
సూర్యకుమార్ 53 బంతుల్లో 78 పరుగులు, రోహిత్ శర్మ 25 బంతుల్లో 36, తిలక్ వర్మ 18 బంతుల్లో 34 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ చివరి ఐదు ఓవర్లలో 62 రన్స్ చేసింది. నిజానికి ముంబై 200 పరుగులు దాటేలా కనిపించినా.. చివరి ఓవర్లో హర్షల్ పటేల్ కేవలం 7 పరుగులే ఇచ్చాడు. అంతేకాదు మూడు వికెట్లు కూడా పడ్డాయి.
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది ముంబై ఇండియన్స్. ఆ టీమ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (8) విఫలమయ్యాడు. దీంతో 18 పరుగుల దగ్గరే తొలి వికెట్ కోల్పోయింది. అయితే రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇద్దరూ కలిసి ముంబై ఇన్నింగ్స్ ను మళ్లీ గాడిలో పెట్టారు. 250వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ మంచి టచ్ లో కనిపించాడు.
అతడు 25 బంతుల్లో 3 సిక్స్ లు, 2 ఫోర్లతో 36 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో 81 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ ఔటైనా సూర్య మాత్రం తన హిట్టింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతని ఊపు చూస్తే సెంచరీ చేయడం ఖాయంగా కనిపించింది. అయితే 53 బంతుల్లో 78 రన్స్ చేసిన తర్వాత ఔటయ్యాడు. సూర్య ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి.