PBKS vs RR: రాజస్థాన్ పాంచ్ పటాకా.. మళ్లీ గెలుపు బాట.. థ్రిల్లింగ్ పోరులో పంజాబ్ ఓటమి-rajasthan royals registered fifth victory in ipl 2024 after won over punjab kings shimron hetmyer shines ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pbks Vs Rr: రాజస్థాన్ పాంచ్ పటాకా.. మళ్లీ గెలుపు బాట.. థ్రిల్లింగ్ పోరులో పంజాబ్ ఓటమి

PBKS vs RR: రాజస్థాన్ పాంచ్ పటాకా.. మళ్లీ గెలుపు బాట.. థ్రిల్లింగ్ పోరులో పంజాబ్ ఓటమి

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 13, 2024 11:27 PM IST

PBKS vs RR IPL 2024: రాజస్థాన్ రాయల్స్ మళ్లీ గెలుపు బాటపట్టింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై ఉత్కంఠ విజయం సాధించింది. చివర్లో రాజస్థాన్ బ్యాటర్ షిమ్రన్ హిట్మైమ్ మెరుపులు మెరిపించి జట్టును గెలిపించాడు.

PBKS vs RR: రాజస్థాన్ పాంచ్ పటాకా.. మళ్లీ గెలుపు బాట.. థ్రిల్లింగ్ పోరులో పంజాబ్ ఓటమి
PBKS vs RR: రాజస్థాన్ పాంచ్ పటాకా.. మళ్లీ గెలుపు బాట.. థ్రిల్లింగ్ పోరులో పంజాబ్ ఓటమి (AP)

PBKS vs RR IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ గర్జించింది. నాలుగు విజయాల తర్వాత గత మ్యాచ్ ఓడిన ఆ జట్టు.. ఇప్పుడు మళ్లీ గెలుపు బాట పట్టింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో నేడు (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‍లో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా చివరి ఓవర్ వరకు సాగిన పోరులో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ విజయం సాధించింది. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు తన ఆరు మ్యాచ్‍ల్లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని బలపరుచుకుంది.

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. అషుతోష్ శర్మ (16 బంతుల్లో 31 పరుగులు) చివర్లో మెరిపించగా.. అంతకు ముందు జితేశ్ శర్మ (29), లియామ్ లివింగ్‍స్టోన్ (21) పర్వాలేదనిపించారు. అయితే, మిగిలిన బ్యాటర్లు రాణించలేకపోయారు. స్వల్ప గాయం వల్ల శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‍కు దూరమవటంతో పంజాబ్‍కు సామ్ కరన్ కెప్టెన్సీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కేశవ్ మహారాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, యజువేంద్ర చాహల్, కేశవ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

మెరిపించి.. గెలిపించిన హిట్మైర్

లక్ష్యఛేదనలో ఉత్కంఠ ఎదురైనా ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. చివర్లో షిమ్రన్ హిట్మైర్ (10 బంతుల్లో 27 పరుగులు నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడి ఆ జట్టును గెలిపించాడు. 3 ఓవర్లలో 34 పరుగులు చేయాల్సిన దశ నుంచి ధనాధన్ ఆటతో మెప్పించాడు. చివరి ఓవర్లోనూ 10 పరుగులు అవసరం కాగా.. మూడో బంతికి, ఐదో బంతికి సిక్సర్లు కొట్టేశాడు హిట్మైర్. 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 152 రన్స్ చేసి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది రాజస్థాన్. యశస్వి జైస్వాల్ (39), రియాన్ పరాగ్ (23) మోస్తరుగా ఆడారు. రావ్మన్ పావెల్ (5 బంతుల్లో 11 పరుగులు) కాసేపే ఉన్నా చివర్లో కీలక పరుగులు చేశాడు.

బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై 148 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (39), తనుష్ కొటియన్ (24) ఆరంభంలో దూకుడుగా ఆడలేకపోయారు. క్రమంగా పరుగులు రాబట్టారు. అయితే, 9వ ఓవర్లో కొటియన్ ఔట్ కాగా, 12వ ఓవర్లో యశస్వి జైస్వాల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (18), రియాన్ పరాగ్ (23) కూడా వేగంగా ఆడలేకపోయారు. దీంతో రాజస్థాన్‍పై ఒత్తిడి పెరిగింది. శాంసన్‍ను పంజాబ్ పేసర్ రబాడ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 15.1 ఓవర్లలో రాజస్థాన్ జట్టు 100 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఉత్కంఠ పెరిగింది. చివరి నాలుగు ఓవర్లలో పంజాబ్ 43 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే రావ్మన్ పోవెల్ కాసేపు దీటుగా ఆడి ఔటయ్యాడు. షిమ్రన్ హిట్మైర్ చివరి వరకు నిలిచి.. దూకుడుగా ఆడి రాజస్థాన్‍ను గెలిపించాడు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ, సామ్ కరన్ తలా రెండు, అర్షదీప్, లివింగ్ స్టోరన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.

రాజస్థాన్ టాప్ పదిలం

ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‍ల్లో ఐదు గెలిచి ప్రస్తుతం 10 పాయింట్లతో ఉంది రాజస్థాన్ రాయల్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఆరు మ్యాచ్‍ల్లో నాలుగు ఓడిన పంజాబ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

IPL_Entry_Point