RR vs RCB Highlights: బట్లర్ శతక మెరుపులు.. కోహ్లీ సెంచరీ వృథా.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి.. అజేయంగా రాజస్థాన్-rr vs rcb highlights ipl 2024 jos buttler shines with unbeaten hundred and virat kohli century goes in vain ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rr Vs Rcb Highlights: బట్లర్ శతక మెరుపులు.. కోహ్లీ సెంచరీ వృథా.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి.. అజేయంగా రాజస్థాన్

RR vs RCB Highlights: బట్లర్ శతక మెరుపులు.. కోహ్లీ సెంచరీ వృథా.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి.. అజేయంగా రాజస్థాన్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 06, 2024 11:39 PM IST

RR vs RCB IPL 2024 Highlights: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు హ్యాట్రిక్ పరాజయం ఎదురైంది. విరాట్ కోహ్లీ సెంచరీ వృథా అయింది. రాజస్థాన్ బ్యాటర్ జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగగా.. సంజూ శాంసన్ మెరుపులు మెరిపించాడు.

RR vs RCB Highlights: బట్లర్ శతక మెరుపులు.. కోహ్లీ సెంచరీ వృథా.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి.. అజేయంగా రాజస్థాన్
RR vs RCB Highlights: బట్లర్ శతక మెరుపులు.. కోహ్లీ సెంచరీ వృథా.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి.. అజేయంగా రాజస్థాన్ (IPL)

RR vs RCB Highlights: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. వరుసగా మూడో మ్యాచ్‍లో నిరాశపరిచి హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నాలుగు మ్యాచ్‍ల్లో అన్నీ గెలిచి ఈ సీజన్‍లో అజేయ యాత్రను కొనసాగించింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‍సింగ్ స్టేడియంలో నేడు (ఏప్రిల్ 6) జరిగిన ఐపీఎల్ మ్యాచ్‍లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై అలవోకగా గెలిచింది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ (113 నాటౌట్) అజేయ అద్భుత శతకం వృథా అయింది. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ (100 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిపించడంతో ఆ జట్టు అలవోకగా గెలిచింది.

కోహ్లీ వన్‍మ్యాన్ షో వృథా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (72 బంతుల్లో 113 పరుగులు; 12 పోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి వన్‍మ్యాన్ షో చేశాడు. సెంచరీతో అదరగొట్టాడు. ఐపీఎల్‍లో 8వ శతకం చేశాడు కోహ్లీ. ఐపీఎల్ అత్యధిక సెంచరీల రికార్డును మరింత పెంచుకున్నాడు. టాస్ ఓడి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్‍కు దిగింది ఆర్సీబీ. ఓపెనర్లు కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (33 బంతుల్లో 44 పరుగులు) ఆరంభంలో నిలకడగా ఆడినా.. ఆ తర్వాత దూకుడు పెంచారు. ముఖ్యంగా కోహ్లీ అగ్రెసివ్ స్టైల్‍లో ఆడాడు. దీంతో 11.2 ఓవర్లలోనే ఆర్సీబీ 100 పరుగులు దాటింది. ఆ తర్వాత కాసేపటికి 14వ ఓవర్లో ఫాఫ్ డుప్లెసిస్ ఔటయ్యాడు. దీంతో 125 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది.

విరాట్ కోహ్లీ మాత్రం తన బాదుడు కొనసాగించాడు. మరో ఎండ్‍లో గ్లెన్ మ్యాక్స్ వెల్ (1), సౌరవ్ చౌహాన్ (9) విఫలమైనా.. విరాట్ మాత్రం దూకుడుగా ఆడాడు. ఒంటరి పోరాటం చేశాడు. 67 బంతుల్లో సెంచరీ మార్క్ చేరాడు విరాట్. అయితే, విరాట్ కోహ్లీ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ దూకుడుగా ఆడలేకపోయారు. మొత్తంగా 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 పరుగులు చేసింది బెంగళూరు. రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు, నాండ్రే బర్గర్ ఓ వికెట్ తీశారు.

బట్లర్ సెంచరీ ధమాకా.. సంజూ ధనాధన్

దీటైన లక్ష్యఛేదనను రాజస్థాన్ రాయల్స్ అలవోకగా ఛేదించేసింది. యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) మరోసారి నిరాశపరిచాడు. తొలి ఓవర్ రెండో బంతికే ఆర్సీబీ పేసర్ టోప్లే బౌలింగ్‍లో జైస్వాల్ ఔటయ్యాడు. అయితే, ఆ తర్వాత రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్, కెప్టెన్ సంజూ శాంసన్ మెరుపులు మెరిపించారు. బెంగళూరు బౌలర్లను చితకబాదేస్తూ క్రమంగా టార్గెట్‍ను కరిగించేశారు.

జాస్ బట్లర్ చివరి వరకు నిలిచి 58 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేసి శతకం పూర్తిచేశాడు. 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో దుమ్మురేపాడు. చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. విజయానికి ఒక్క పరుగు అవసరమైన సమయంలో సిక్స్‌తో శకతం పూర్తి చేసుకున్నాడు. తన 100వ ఐపీఎల్ మ్యాచ్‍లో సెంచరీ చేశాడు బట్లర్. శాంసన్ 42 బంతుల్లోనే 69 పరుగులు (8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి అదరగొట్టాడు. శాంసన్ ఔటైనా బట్లర్ ఆఖరి వరకు నిలిచాడు. 19.1 ఓవర్లలోనే 4 వికెట్లకు 189 పరుగులు చేసి రాజస్థాన్ గెలిచింది. బెంగళూరు బౌలర్లలో రీస్ టాప్లీ రెండు, యశ్ దయాల్, సిరాజ్ చెరో వికెట్ తీశారు.

ఆర్సీబీ ఫీల్డింగ్‍లో చాలా తప్పిదాలు చేసింది. బట్లర్, శాంసన్ ఇచ్చిన ఒక్కో క్యాచ్‍ను బెంగళూరు ఫీల్డర్లు వదిలేశారు. ఇది ఆ జట్టును దెబ్బతీసింది. మొత్తంగా.. బౌలింగ్‍, ఫీల్డింగ్‍లో తీవ్రంగా నిరాశపరిచింది ఆర్సీబీ.

గేల్‍ను సమం చేసిన బట్లర్

ఈ మ్యాచ్‍లోనే విరాట్ కోహ్లీ ఐపీఎల్‍లో తన 8వ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‍లో అత్యధిక శతకాలు వీరుడిగా ఉన్నాడు. జోస్ బట్లర్ ఐపీఎల్‍లో ఆరో సెంచరీకి చేరాడు. క్రిస్ గేల్‍ను సమం చేసి అత్యధిక ఐపీఎల్ సెంచరీల లిస్టులో జోస్ బట్లర్ రెండో స్థానానికి చేరాడు.

టాప్‍కు రాజస్థాన్

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లను దక్కించుకుంది రాజస్థాన్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‍కు వెళ్లింది. ఐదు మ్యాచ్‍ల్లో నాలుగు ఓడిన బెంగళూరు 8వ స్థానానికి పడిపోయింది.

Whats_app_banner