T20 World Cup 2024 Team India: టీ20 ప్రపంచకప్‍కు భారత జట్టు ఎంపిక.. కేఎల్ రాహుల్‍కు దక్కని చోటు
Indian Team for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును వెల్లడించింది. కేఎల్ రాహుల్‍కు చోటు దక్కలేదు. వైస్ కెప్టెన్‍గా హార్దిక్ పాండ్యానే ఉన్నాడు.
Indian Team for T20 World Cup 2024: కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠ వీడింది. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. జూన్ 2 నుంచి జూన్ 29వ తేదీ వరకు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ నేడు (ఏప్రిల్ 30) వెల్లడించింది. స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‍కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ప్రపంచకప్‍లో భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. కొంతకాలంగా ఫామ్‍లో లేకపోయినా వైస్ కెప్టెన్‍గా హార్దిక్ పాండ్యానే సెలెక్టర్లు కొనసాగించారు.
సంజూకు ఛాన్స్.. పంత్ రీఎంట్రీ
ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‍లో దుమ్మురేపుతున్న యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‍కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. అలాగే, స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రపంచకప్ ద్వారా మళ్లీ భారత జట్టులోకి వస్తున్నాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. మళ్లీ సుమారు 18 నెలల తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‍లో పంత్ కూడా దుమ్మురేపుతున్నాడు. ప్రపంచకప్‍లో రిషబ్ పంతే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఉండొచ్చు. అలాగే, ఐపీఎల్‍లో సత్తాచాటుతున్న సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‍కు కూడా టీ20 ప్రపంచకప్ జట్టులో సెలెక్టర్లు ప్లేస్ ఇచ్చారు.
రాహుల్‍కు దక్కని చోటు.. రిజర్వ్‌లో రింకూ, గిల్
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‍కు టీ20 ప్రపంచకప్ భారత జట్టులో చోటు లభించలేదు. సంజూ శాంసన్‍కే సెలెక్టర్లు మొగ్గుచూపారు. మరోవైపు, భారత తరఫున కొంతకాలంగా టీ20ల్లో అదరగొట్టిన రింకూ సింగ్‍కు ప్రపంచకప్ ప్రధాన జట్టులో ప్లేస్ దక్కలేదు. రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్‍నే సెలెక్టర్లు తీసుకున్నారు. దీంతో శుభ్‍మన్ గిల్ కూడా రిజర్వ్ లిస్టుకే పరిమితమయ్యాడు.
రోహిత్‍తో జైస్వాల్ ఓపెనింగ్!
టీ20 ప్రపంచకప్‍లో కెప్టెన్ రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఈ టోర్నీకి తీసుకుంటారా అనే సందేహాలు కూడా వచ్చాయి. అయితే, ప్రస్తుత ఐపీఎల్‍లో అద్భుతంగా ఆడుతూ ఆరెంజ్ క్యాప్‍ను కూడా కోహ్లీ తన వద్దే కొనసాగించుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‍లో 500 పరుగుల మార్క్ కూడా దాటేశారు. ఫుల్ ఫామ్‍లో ఉన్న విరాట్ కోహ్లీని సెలెక్టర్లు ప్రపంచకప్‍కు తీసుకున్నారు. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‍కు రావొచ్చు. సూర్యకుమార్ యాదవ్‍పై కూడా ఈ టోర్నీలో భారీ అంచనాలు ఉండనున్నాయి.
దూబేకు చోటు.. అక్షర్ కూడా..
ప్రస్తుత ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొడుతున్న ఆల్ రౌండర్ శివం దూబే.. టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా ఆల్ రౌండర్లుగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‍గా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‍లో హార్దిక్ పాండ్యా బ్యాట్‍తోనూ, బౌలింగ్‍లోనూ పెద్దగా రాణించడం లేదు. అయితే, అతడిపై సెలెక్టర్లు నమ్మకం ఉంటారు. వైస్ కెప్టెన్‍గా కంటిన్యూ చేశారు.
చాహల్ మళ్లీ.. బౌలర్లు ఇలా..
ఐపీఎల్ 2024 సీజన్‍లో రాణిస్తున్న స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‍కు టీ20 ప్రపంచకప్‍లో చోటు దక్కింది. సుమారు ఏడాది తర్వాత భారత జట్టులోకి మళ్లీ అతడు వచ్చేస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ మరో స్పిన్నర్‌గా ఉన్నాడు. పేసర్లుగా జస్‍ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నారు. రవి బిష్ణోయ్‍కు ఛాన్స్ దక్కలేదు.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‍మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్