CM Revanth Reddy : కృష్ణా జలాలపై వాడీవేడిగా చర్చ, కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో నీరు పారుదల ప్రాజెక్టులపై తీవ్ర చర్చ జరుగుతోంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమైన చర్చలో పాల్గొనకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారని ఆరోపించారు.
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాలపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణకు కృష్ణా నీళ్లు ప్రాణప్రదాయం అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు కృష్ణాపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. మహానుభావుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారన్నారు. ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదని, జలాల్లో 68 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ఈ తీర్మానానికి అనుకూలమో, వ్యతిరేకమో విపక్ష నేతలు స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదన్నారు.
రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు
కృష్ణా జలాలపై దక్షిణ తెలంగాణ ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కృష్ణా జలాలపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ను కరీంనగర్ నుంచి తరిమికొడితే మహబూబ్‌నగర్ వాసులు ఎంపీగా గెలిపించారన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను హరీశ్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఫైర్ అయ్యారు. కోడంగల్ ప్రజలు తరిమికొడితే రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి వచ్చారంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమన్న సీఎం రేవంత్ రెడ్డి.. అలాంటి చర్చలో పాల్గొనకుండా కేసీఆర్ ఫామ్ హౌస్‌లో దాక్కుకున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ సభ వల్లే కాంగ్రెస్ వెనక్కి తగ్గింది
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతుంది. ఇందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డుకు (KRMD) అప్పగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. ఇందుకు నిరసనగా ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. అదే రోజున మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు రావాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. కేసీఆర్ ను కూడా రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు రావాలని కోరారు.
హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి
నల్గొండలో బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పడంపై వెనక్కి తగ్గిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలుగజేసుకుని... ఏపీ సీఎం జగన్ స్టేట్మెంట్ విన్న తర్వాత కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నల్గొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారన్నారు. కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం