TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం… అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. మరో వైపు ఉభయ సభల్లో ఇరుపార్టీల మధ్య వాగ్వాదం నెలకొంది
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఎసీ అజెండాను టేబుల్ చేయనున్నారు.
శాసన మండలిలో గందరగోళం నెలకొంది. మండలి సభ్యులపై సిఎం అనుచిత వ్యాఖ్యలు చేశాంటూ మండలి సభ్యులు నిరసనకు దిగారు. సిఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభను మూడుసార్లు వాయిదా వేశారు. సిఎం క్షమాపణ చెప్పాలంటూ ఆందోళనకు దిగారు. కౌన్సిల్ హాల్ ముందు నల్ల కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బైఠాయించారు. మరోవైపు బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు నిరసన తెలిపే హక్కు లేదని మంత్రి జూపల్లి అన్నారు.
అటు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్కల మధ్య మాటల యుద్ధం నెలకొంది. దళితుల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తీసేసిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిసే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆయన ప్రతిపాదించారు.
దీన్ని మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతానని..బిఆర్‌ఎస్ చేసిన తప్పులన్నీ తనకు తెలుసని వీరేశం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ అంటే ఎందుకు భయపడుతున్నారు?అని విపక్ష నేతలను ప్రశ్నించారు.
''దళిత బంధు పేరుతో ప్రజల్ని మభ్యపెట్టారని అధికారంలో ఉన్నామని గర్వం ఉండకూడదన్నారు. తనను అవమానించిన పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లోకి వచ్చానన్నారు.
బిఆర్‌ఎస్ పాలనలో ప్రగతి భవన్ ప్రజలకు దూరమైందని తమ ప్రభుత్వం వచ్చాక అక్కడి గోడలు బద్ధలుకొట్టామన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పాలమూరు ప్రజలు బిఆర్‌ఎస్‌ను దూరం పెట్టారని, ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలన్నారు.
దళిత, గిరిజన, మైనార్టీ పక్షపాత ప్రభుత్వం ఏర్పడిందని, గత ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందన్నారు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ కావాలంటూ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా, గత పదేళ్లుగా నియంతృత్వ విధానాలతో పరిపాలన కొనసాగిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. మిగతా రెండు గ్యారంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. పదేళ్లుగా జరిగిన అవినీతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అనేక నియోజక వర్గాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. గ్రామాల్లో బోర్లు వేసుకునే పరిస్థితి లేకుండా చేశారని నల్గొండ జిల్లాలో పదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదని సాగునీటి రంగంలో దక్షిణ తెలంగాణపై వివక్ష చూపించారన్నారు.
తెలంగాణ ఉద్యమకారులంటే కూడా బిఆర్‌ఎస్‌కు గౌరవం లేదని గద్దర్‌ను కూడా ఘోరంగా అవమానించారన్నారు. గురుకుల పాఠశాలలకు ఎక్కడా సొంత భవనాలు లేవని వాటిల్లో 10 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఉద్యోగ నియామకాల్లో ఎన్నో అవకతవకలు చేశారని పరీక్షల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి.. ప్రైవేటు వర్సిటీలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారన్నారు. ప్రజల విశ్వాసాలు, ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం ఇది. కొన్ని నెలల్లోనే పడగొడతామంటున్నారని వేముల వీరేశం మండిపడ్డారు.
గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు….
మరోవైపు గవర్నర్‌తో కాంగ్రెస్ పార్టీ ముప్ఫై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.
గవర్నర్ ప్రసంగంలో అర చేతిలో వైకుంఠం చూపించారని మేనిఫెస్టోలోని అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవని, హామీ ఊసే లేదన్నారు. ప్రగతి భవన్ గతంలో కూడా ప్రజా భవనమేనని పల్లా స్పష్టం చేశారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రగతి భవన్‌లో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు.
సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చింది ప్రగతి భవనే అన్నారు. సీఎం రేవంత్ కనీసం వారానికి ఒక్కసారి కూడా ప్రజావాణికి హాజరుకాలేదని పల్లా ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల గురించి కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటుందని, గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మాత్రమే అమలు చేశారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.20 కోట్లు ఖర్చు చేస్తే రూ.60 కోట్లు ప్రచారం చేసుకున్నారని ఎద్దేశా చేశారు.
13 అంశాల్లో కేవలం రెండు మాత్రమే అమలుచేశారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సులిచ్చినా బస్సుల సంఖ్య పెంచలేదన్నారు. బస్సు ట్రిప్పులు పెంచలేదని విమర్శించారు. ప్రమాణ స్వీకారం రోజునే రైతు రుణమాఫీ చేస్తామన్నారని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము అడుగుతున్నామని చెప్పారు.
ఉచిత బస్సు ప్రయాణాలతో ఆరున్నర లక్షల మందికిపైగా ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, రెండు నెలల్లో 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని బిఆర్‌ఎస్ పార్టీ తరపునsa డిమాండ్ చేశారు.