Medigadda Project Tour : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మేడిగడ్డ మంటలు- కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందన్న రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy congress leaders went medigadda project visit brs criticizes ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medigadda Project Tour : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మేడిగడ్డ మంటలు- కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందన్న రేవంత్ రెడ్డి

Medigadda Project Tour : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మేడిగడ్డ మంటలు- కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందన్న రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Feb 13, 2024 04:04 PM IST

Medigadda Project Tour : సీఎం రేవంత్ రెడ్డి, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస్సుల్లో మేడిగడ్డ సందర్శనకు బయలుదేరారు. అంతకు ముందు అసెంబ్లీలో కాళేశ్వరంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని విమర్శించారు.

మేడిగడ్డ సందర్శనకు బయలుదేరిన సీఎం, ఎమ్మెల్యేలు
మేడిగడ్డ సందర్శనకు బయలుదేరిన సీఎం, ఎమ్మెల్యేలు

Medigadda Project Tour : తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మేడిగడ్డ (Medigadda)మంటలు రాజుకున్నాయి. చలో మేడిగడ్డ అంటూ కాంగ్రెస్, చలో నల్గొండ అంటూ బీఆర్ఎస్(BRS) నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇరు పార్టీల నేతలు బస్సుల్లో అసెంబ్లీ నుంచి బయలుదేరారు. అంతకు ముందు అసెంబ్లీలో కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రూ.38,500 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.1,47,000 కోట్లకు పెంచారని ఆరోపించారు. దీనిపై డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకెంత ఖర్చవుతుందో కూడా పూర్తి సమాచారం లేదన్నారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చుపెట్టి ప్రాజెక్టు కడితే.. మేడిగడ్డ వద్ద ఇసుక కదిలితే పిల్లర్లు కుంగాయని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలి

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని ఇంజినీర్లు చెబుతున్నారన్నారు. పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపేందుకు ప్రజా ప్రతినిధులతో మేడిగడ్డ పర్యటన నిర్వహిస్తున్నామన్నారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించామన్నారు. బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదన్నారు. కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు… వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అన్నీ పార్టీల శాసనసభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయన్నారు. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోందన్నారు.

కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు- హరీశ్ రావు

కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మేడిగట్ట పర్యటనతో బీఆర్ఎస్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ (KCR) చేసిన మేలేంటో కాళేశ్వరం ప్రాజెక్టుతో లబ్ధిపొందిన ప్రజలను అడగాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరాన్ని వాడుకుంటుందన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదని మొత్తం 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల జలాల సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. ఒక్క బ్యారేజీలో రెండు ఫిల్లర్లు కుంగితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ సందర్శనలో వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే దారిలో రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కుడెల్లి వాగు, పొలాలు చూడాలని సూచించారు.

Whats_app_banner

సంబంధిత కథనం