Kaleswaram Visit: బిఆర్‌ఎస్‌ అక్రమాల నిరూపణే లక్ష్యంగా.. నేడు కాళేశ్వరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు-chief minister and ministers will visit kaleswaram today to prove the irregularities of brs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kaleswaram Visit: బిఆర్‌ఎస్‌ అక్రమాల నిరూపణే లక్ష్యంగా.. నేడు కాళేశ్వరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు

Kaleswaram Visit: బిఆర్‌ఎస్‌ అక్రమాల నిరూపణే లక్ష్యంగా.. నేడు కాళేశ్వరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు

HT Telugu Desk HT Telugu
Feb 13, 2024 05:56 AM IST

Kaleswaram Visit: రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. BRS అక్రమాలను బయటపెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో కలిసి కాళేశ్వరంలో పర్యటించనున్నారు.

రాహుల్‌గాంధీతో కలిసి మేడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన రేవంత్‌ రెడ్డి (ఫైల్)
రాహుల్‌గాంధీతో కలిసి మేడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన రేవంత్‌ రెడ్డి (ఫైల్)

Kaleswaram Visit: లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా.. ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మంత్రులు సహా అందరినీ తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన బ్యారేజీలు, పంపు హౌజ్ లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సహా80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, మీడియాతో కలిసి మంగళవారం ఉదయం మేడిగడ్డకు రానున్నారు.

మహదేవ్ పూర్ మండలం అంబట్ పల్లి దగ్గర గోదావరి నదిపై కుంగిన మేడిగడ్డ బ్యారేజీని, ఇదివరకే దెబ్బతిన్న కన్నెపల్లి పంపు హౌజ్ ను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ప్రాజెక్టులో బయటపడిన లోపాలు, ప్రస్తుత పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

ఓ వైపు రాష్ట్రంలోని ప్రజాప్రతి నిధులందరితో కలిసి కాళేశ్వరం సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వగా.. ఇదే రోజు కృష్ణా జలాల అంశంపై బీఆరెస్ నల్గొండ లో సభ నిర్వహించనుంది. దీంతో బీఆరెస్ నేతలు కాళేశ్వరం సందర్శనకు డుమ్మా కొట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రజాప్రతినిధులంతా కాళేశ్వరానికే..

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గొప్ప కట్టడమని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకోవాల్సింది కాంగ్రెస్ వాళ్లేనని, ఆ ప్రాజెక్టులో ఎన్ని బ్యారేజీలున్నాయి.. ఎన్ని పంపుహౌజ్ లున్నాయి.. ఎన్ని కాల్వలున్నాయనే అంశాలను చూసి నేర్చుకోవచ్చనంటూ చెబుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కుంగిందని, దానిని భూతద్దంలో చూపిస్తున్నారని, మొత్తం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందన్నట్టు నింద వేస్తున్నారంటూ కేటీఆర్ చెప్పుకొస్తున్నారు.

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తరువాత అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో కలిసి గతేడాది నవంబర్ మొదటి వారంలో పరిశీలించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన అనంతరం డిసెంబర్ 29న రాష్ట్ర మంత్రుల బృందం కూడా కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసింది.

ఆ తరువాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టి అక్కడి రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజినీర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ పెద్దల అలసత్వం, కాంట్రాక్ట్ సంస్థ నాసిరకం పనులే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినడానికి కారణమని రిపోర్ట్ రూపొందించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దానిపై వాస్తవాలు తెలుసు కునేందుకు ఎమ్మెల్యేలందరినీ ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర లీడర్లను కాళేశ్వరం సందర్శనకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

టూర్ షెడ్యూల్ ఇలా..

సీఎం రేవంత్ రెడ్డి ఇతర లీడర్లతో కలిసి మంగళవారం ఉదయం 10.15 గంటలకు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరనున్నారు.

మధ్యాహ్నం 3.30 గంటల సుమారులో అక్కడికి చేరుకుని, సాయంత్రం 5 గంటల వరకు లీడర్లు, జర్నలిస్టులందరితో కలిసి ప్రాజెక్టును పరిశీలిస్తారు. అనంతరం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి 5 గంటల నుంచి 5.30 గంటల వరకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

ఆ తరువాత సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ కూడా తన నివేదికను పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో వివరిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు మీడియాతో ఇంటరాక్షన్.. ఆ తరువాత ఏడు గంటల సుమారులో తిరిగి అదే ప్రత్యేక బస్సులో అంతా రిటర్న్ కానున్నారు.

రాత్రి 8.30 గంటల ప్రాంతం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడ్ సమీపంలో ఉన్న ఎన్ఎస్ఆర్ హోటల్ లో డిన్నర్ చేసి 9.30 గంటల కు అక్కడి నుంచి హైదరాబాద్ ప్రయాణం కానున్నారు.

ఆఫీసర్లు హై అలర్ట్

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్ర సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఇలా.. ప్రభుత్వం మొత్తం కదిలివస్తుండటంతో ఆఫీసర్లు హై అలర్ట్ అయ్యారు. ఈ మేరకు అక్కడ కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న మేడిగడ్డ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు బలగాలు మోహరించారు.

ప్రత్యేక బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం గ్రే హౌండ్స్ కు చెందిన ఓ కమాండో వేటగాళ్ల ఉచ్చుకు బలి కావడంతో అక్కడి అధికారులంతా అప్రమత్తమయ్యారు. బందోబస్తు చర్యలు ముమ్మరం చేశారు. దీంతో పాటు మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నతాధికారులు సోమవారం ఉదయం నుంచి ఏర్పాట్లపైనే నిమగ్నమయ్యారు.

ఇప్పటికే జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లాలోని ఆఫీసర్లంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీర్లు ప్రతిఒక్కరూ హాజరు కావాల్సిందిగా సూచించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో పాటు భద్రతా పరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయగా.. ప్రాజెక్టు విషయంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే హై టెన్షన్ నెలకొంది.

బీఆర్ఎస్ నేతలు కలిసొచ్చేనా..?

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఓ వైపు కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం సందర్శనకు ప్లాన్ చేయగా.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు నల్గొండ జిల్లాలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కృష్ణా జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించిందని, దానికి నిరసనగా నల్గొండలో నిర్వహిస్తున్న సభకు అందరూ తరలిరావాలని పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతోనే కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ నేతలు హాజరవడం కష్టమేననే సంకేతాలే కనిపిస్తున్నాయి.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతుండగా.. మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు హాజరు అవుతారో లేదో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)