CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - సరిపోని ధోనీ పోరాటం
CSK vs GT: శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 35 పరుగులు తేడాతో విజయాన్ని సాధిచింది. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్న చెన్నైని ఓడించి గుజరాత్ షాకిచ్చింది. .
CSK vs GT: ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేయాలనే భావించిన చెన్నైకి గుజరాత్ ఊహించని షాకిచ్చింది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సాయిసుదర్శన్ సెంచరీలతో కదం తొక్కడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఇరవై ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసింది. ఈ భారీ టార్గెట్‌ను ఛేదించడంలో తడబడిన చెన్నై 196 పరుగులు మాత్రమే చేసింది.

ఆరంభంలో మూడు వికెట్లు....
232 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు బరిలో దిగిన చెన్నై ఆరంభంలోనే మూడు వికెట్లను కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే రచిన్ రవీంద్ర రనౌటయ్యాడు. అంజిక్య రహానే మరోసారి (1 రన్) నిరాశపరిచాడు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌటయ్యాడు. పది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ చెన్నైని డారీ మిచెల్, మొయిన్ అలీ ఆదుకున్నారు. హాఫ్ సెంచరీలతో చెన్నైకి గెలిపించేందుకు ప్రయత్నించారు.
మోహిత్ శర్మ బ్రేక్...
డారీ మిచెల్ భారీ షాట్లలో మెరుపులు మెరిపించాడు. 34 బాల్స్‌లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. మెయిన్ అలీ 36 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 56 రన్స్ చేశారు. చెన్నైని విజయం దిశగా నడిస్తోన్న వీరిద్దరిని పెవిలియన్ పంపి గుజరాత్‌కు బ్రేకిచ్చాడు మోహిత్ శర్మ. ఆ తర్వాత శివమ్ దూబే( 13 బాల్స్‌లో 21 రన్స్)ను కూడా మోహిత్ శర్మ ఔట్ చేయడంతో చెన్నై ఓటమి ఖాయమైంది.
చివరలో ధోనీ 11 బాల్స్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 26 పరుగులతో మెరుపులు మెరిపించిన ఓ పోరాటం సరిపోలేదు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు, రషీద్‌ఖాన్ రెండు వికెట్లతో చెన్నైని కట్టడిచేశారు.
ఇద్దరు సెంచరీలు...
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు సాయిసుదర్శన్, శుభ్‌మన్‌గిల్ భారీ స్కోరును అందించారు. ఇద్దరు సెంచరీలతో చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశారు. సాయి సుదర్శన్ 51 బాల్స్‌లో ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 103 రన్స్ చేశాడు. శుభ్‌మన్ గిల్ 55 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 104 రన్స్ చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు సాధించి రికార్డులు నెలకొల్పారు. వీరిద్దరిని ఔట్ చేసేందుకు చెన్నై బౌలర్లు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. తుషార్ దేశ్‌పాండే (రెండు వికెట్లు) మినహా మిగిలిన వారు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.