BRS MLAs Protest : సీఎం మాట్లాడుతున్న భాష బాలేదు... అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
Telangana Assembly Sessions 2024: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతన్న అనుచిత భాషను ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Assembly Sessions 2024: అసెంబ్లీ లో సీఎం రేవంత్ మాట్లాడుతున్న అనుచిత భాషను ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీని వాకౌట్ చేసి ఆందోళనకు దిగారు. చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారని… అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయని అన్నారు. రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదని చెప్పారు. సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద తమకు గౌరవం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు.
దిగజారి మాట్లాడుతున్నారు - కడియం శ్రీహరి
"ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదు ..బయట మీడియా తో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా ? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని ఎప్పుడు నిబంధన పెట్టారా…? అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా ? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు.
రికార్డుల నుంచి తొలగించాలి - ఎమ్మెల్యే పల్లా
అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… సీనియర్ ఎమ్మెల్యే దళిత నాయకుడు కడియం శ్రీహరి పై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అనుచిత భాష ను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కడియం సీనియర్ ఎమ్మెల్యే.. ఆయన ఎక్కడా బడ్జెట్ కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదన్నారు. సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నారని… తెలంగాణ భాషను సీఎం అవమానపరుస్తున్నారని అన్నారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం ? అని ప్రశ్నించారు. అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్నారు.
మా గొంతు నొక్కుతుంది - వేముల
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. “నేను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను. అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది. సీఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు.. మేము మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు. సీఎం చెప్పేదొకటి చేసేదొకటి. అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు.. నియంత్రణ ఎలా పెడతారు. ఇలాంటి వాటిని తట్టుకుంటాం.. పోరాడతాం” అని చెప్పారు.