Khammam Congress : ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు నాకే ఉంది - రేణుకా చౌదరి-renuka chowdary key comments on khammam congress mp ticket 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Congress : ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు నాకే ఉంది - రేణుకా చౌదరి

Khammam Congress : ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు నాకే ఉంది - రేణుకా చౌదరి

HT Telugu Desk HT Telugu
Jan 18, 2024 04:17 PM IST

Khammam Congress MP Ticket 2024: ఖమ్మం ఎంపీ టికెట్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. హైకమాండ్ వద్ద ఖమ్మం ఎంపీ టికెట్ అడిగే హక్కు తనకే ఉందన్నారు.

రేణుకా  చౌదరి
రేణుకా చౌదరి

Renuka Chowdary News: ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని, ఆ సీటును అధిష్టానం వద్ద అడిగే హక్కు నాదేనని ఖమ్మం మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే ఆశావహుల సంఖ్య నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో గురువారం ఖమ్మం వచ్చిన ఆమె జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కోరుతుందన్నారు. అయితే ఆమె ఖమ్మం నుంచి పోటీ చేస్తే తొలిత సంతోషించేది తానేనని పేర్కొన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. సోనియా గాంధీ నిర్ణయం వెలువడే వరకు ఎవరు అభ్యర్థి కారని తెలిపారు. అయోధ్యలో రాముడిని భారతీయ జనతా పార్టీ రాజకీయం కోసం వాడుకుంటుందని రేణుక విమర్శించారు. దేవాలయం పూర్తి కాకుండా ప్రతిష్ట చేస్తున్న తీరు చాలా బాధాకరమన్నారు. ప్రధాని మోదీ మూర్ఖంగా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రామాలయ నిర్మాణాన్ని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇది సిగ్గుచేటు అన్నారు. భద్రాచలం రామయ్యను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. భద్రాద్రి రామాలయ సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని, రాబోయే 20 ఏళ్లపాటు సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని ఆమె జోస్యం చెప్పారు. బస్సుల్లో ఇప్పుడు మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువగా ప్రయాణిస్తున్నారని, తాను కూడా భవిష్యత్ లో బస్సుల్లో ప్రయాణిస్తానని రేణుక పేర్కొన్నారు.

నా జోస్యం నిజమైంది..

గతంలో ఖమ్మంలో మంత్రిగా పని చేసిన పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయంగా తుడిచిపెట్టుకుపోతాడని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. నేను చెప్పినట్లుగానే ఖమ్మంలో అజయ్ రాజకీయం ముగిసిందన్నారు. ఖమ్మంలో ఇప్పుడు స్వేచ్ఛపూరిత వాతావరణం కనిపిస్తుందని తెలిపారు. ప్రజలు మనోధైర్యంతో జీవిస్తున్నారన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోను ఇవే ఫలితాలు రానున్నాయని రేణుక పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య మీదే ఈ ప్రభుత్వం ఏర్పడిందని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఖమ్మంలో మాజీ మంత్రి ఎన్ని కేసులు పెట్టినా తట్టుకొని నిలబడ్డందుకు ముస్తఫాను రేణుక ప్రత్యేకంగా అభినందించారు. నియంతృత్వానికి, అక్రమాలకు, నిర్బంధాలకు వ్యతిరేకంగా పని చేసిన నా కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవడం నా భాధ్యత అని పేర్కొన్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

Whats_app_banner