KTR Comments: ఏడాదిలోనే కేసీఆర్ రాజకీయాలను శాసించే రోజులొస్తయ్…10-12 సీట్లు వస్తే రాజకీయాలు మారిపోతాయన్న కేటీఆర్-ktr says that kcr will rule politics within a year politics will change if they gets 10 12 seats ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ktr Comments: ఏడాదిలోనే కేసీఆర్ రాజకీయాలను శాసించే రోజులొస్తయ్…10-12 సీట్లు వస్తే రాజకీయాలు మారిపోతాయన్న కేటీఆర్

KTR Comments: ఏడాదిలోనే కేసీఆర్ రాజకీయాలను శాసించే రోజులొస్తయ్…10-12 సీట్లు వస్తే రాజకీయాలు మారిపోతాయన్న కేటీఆర్

HT Telugu Desk HT Telugu
Apr 24, 2024 06:54 AM IST

KTR Comments: నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 1.85 శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయిందని, 420 హామీలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వాటిని అమలు చేయకుండా దేవుళ్ల మీద ఒట్టేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్‌కు మంచి రోజులొస్తాయంటున్న కేటీఆర్
బీఆర్‌ఎస్‌కు మంచి రోజులొస్తాయంటున్న కేటీఆర్

KTR Comments: కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అభయహస్తం చూపెట్టి.. ఎన్నికల తరువాత భస్మాసుర హస్తం చూపిస్తున్నారని KTR మండిపడ్డారు.ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఏడాదిలోనే రాష్ట్ర రాజకీయాలను KCR కేసీఆర్ శాసించే రోజు వస్తుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ BRS వరంగల్ ఎంపీ Warangal MP Candidate అభ్యర్థి డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ కు మద్దతుగా మంగళవారం నిర్వహించిన వరంగల్ తూర్పు, వర్ధన్నపేట విస్తృతస్థాయి సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో ఓటమి చూశామని, అతి తక్కువ ఓట్ల తేడాతోనే 14 సీట్లు కోల్పోయామన్నారు. అందులో 10 గెలిచినా రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు. మార్చి 15 డెడ్ లైన్ పెట్టి ఇష్టమొచ్చినట్ట హామీలు ఇచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 130 రోజుల్లోనే పరిస్థితి మొత్తం మారిపోయిందని విమర్శించారు.

కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం, నాలుగు వేల పింఛన్, కోటి 67 లక్షల మహిళలకు 2500 చొప్పున ఆర్థికసాయం, 2 లక్షల రుణమాఫీ ఇలా ఏ ఒక్క హామీ అయినా అమలైందా అని ప్రశ్నించారు. తప్పు రేవంత్ రెడ్డిది కాదని, ఆయనను నమ్మి ఓటేసిన మనదే తప్పని చెప్పుకొచ్చారు.

కరెంటే లేనప్పుడు హై టెన్షన్ వైర్ ఎందుకు..?

సీఎం రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్ నని చెప్పుకుంటున్నాడని, అసలు కరెంటే లేనప్పుడు హైటెన్షన్ వైర్ ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ హైటెన్షన్ వైర్ లో కరెంటు లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు మందికి పుట్టిన బిడ్డలను తమ బిడ్డలుగా చెప్పుకోవడం అలవాటైందని, వారికి అభ్యర్థులు దొరక్క బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకున్నారన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే.. తామే ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతోందని, దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీరాముడు అందరివాడని, బీజేపీ పార్టీ సభ్యుడు కాదని స్పష్టం చేశారు.

కేసీఆర్ దేవున్ని అడ్డంపెట్టుకుని ఏనాడూ రాజకీయాలు చేయలేదని, కాంగ్రెస్, బీజేపీలు మాత్రం దేవుళ్ల పేరుతోనే రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికలు సామాన్యమైనవి కాదని, వంద రోజులు అబద్దానికి.. పదేళ్ల నిజానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పుకొచ్చారు.

కడియం, అరూరి విశ్వాస ఘాతకులు

కడియం శ్రీహరి, అరూరి రమేశ్ విశ్వాస ఘాతకులని కేటీఆర్ మండిపడ్డారు. 2013లో కడియం బీఆర్ఎస్‌లో చేరిన వెంటనే కేసీఆర్ ఎంపీ, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశాడని, మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేను చేస్తే మోసం చేసి కాంగ్రెస్ లో చేరాడని మండిపడ్డారు.

నమ్మి టికెట్ ఇస్తే గొంతు కోసి పోయాడని విమర్శించారు. వరంగల్ లో విశ్వాస ఘాతకులు.. నికార్సైన ఉద్యమకారుడి మధ్య పోరు జరగుతోందన్నారు. కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేసి పదేళ్లలో మూడు చట్ట సభలకు పంపితే.. కుట్రలకు తెరలేపి పార్టీని చీల్చాడని ఫైర్ అయ్యారు.

దళిత నేతలను పార్టీ నుంచి బయటకు సాగనంపి, వెన్నుపోటు పొడిచాడన్నారు. పార్టీ మారడం తప్పు కాదని, నమ్మించి మోసం చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పేనన్నారు. వరంగల్ లో కాంగ్రెస్ ను మూడో స్థానానికే పరిమితం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటేసేందుకు ఒక్క కారణం కూడా లేదని, మోదీ అన్నింటినీ పిరం చేసి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాడని మండిపడ్డారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టాలని, కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం