BRS Harish Rao : మూసీలో పేదల కన్నీళ్లు పారిస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్-hyderabad musi residents speaks brs mla harish rao fires on cm revanth reddy hydra demolitions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Harish Rao : మూసీలో పేదల కన్నీళ్లు పారిస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

BRS Harish Rao : మూసీలో పేదల కన్నీళ్లు పారిస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

Bandaru Satyaprasad HT Telugu
Sep 28, 2024 02:21 PM IST

BRS Harish Rao : మూసీలో పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మూసీ నిర్వాసితులతో మాట్లాడిన ఆయన....కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేశారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు.

 మూసీలో పేదల కన్నీళ్లు పారిస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
మూసీలో పేదల కన్నీళ్లు పారిస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

BRS Harish Rao : మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పి, పేద మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్ ప్రతినిధులు‌, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో హరీశ్‌ రావు భేటీ అయ్యారు. బాధితుల కష్టాలు విని హరీశ్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మాట్లాడుతూ...రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతూ 'బుల్డోజర్ రాజ్ నహి చలేగా' అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజ్యం నడిపిస్తోందని మండిపడ్డారు.

ముందు తెలంగాణకు వచ్చి ఈ బుల్డోజర్లు ఆపాలని రాహుల్ గాంధీకి సూచించారు హరీశ్ రావు. ఆ తరువాత 'బుల్డోజర్ రాజ్ నహి చలేగా' అంటూ అక్కడ ప్రచారం చేయలన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి0 గోసలు కాదన్నారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన సోదరుడికి నోటీసులు ఇచ్చి, పేదల ఇంటికి బుల్డోజర్లు పంపుతారా? అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటుందన్నారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ

బీఆర్ఎస్ పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టలేదని హరీశ్ రావు చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేశారన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజన్ ను సీఎం రేవంత్‌ రెడ్డి దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ఆ తర్వాత మూసీపై ముందుకు వెళ్లాలని హరీశ్ రావు డిమాండ్‌ చేశారు.

కూకట్ పల్లికి చెందిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, రేవంత్ రెడ్డి చేసిన హత్య అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి పెళ్లిళ్లు చేసిందని, ఇప్పుడు ఆ ఇండ్లు కూలగొడితే తన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళనతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఇవి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్లే జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో కూడా బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని విమర్శించారు.

హైడ్రా బాధితులందరూ తమ కుటుంబ సభ్యులతో తెలంగాణ భవన్ రావాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు సూచిస్తున్నారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని, బాధితులకు రక్షణ కవచంలా ఉంటామన్నారు.

మా కుటుంబాలను రోడ్డున పడేసి ఏం అభివృద్ధి

"మా నాన్న చిన్న ఉద్యోగి.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినం. ఇప్పుడు ఉన్న ఇల్లు కూల్చేస్తే మా కుటుంబాలు ఏమైపోవాలి".... తెలంగాణ భవన్ లో తమ ఆవేదన చెప్పుకుంటూ హైడ్రా బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. మా కుటుంబాలను రోడ్డున పడేసి ఏం అభివృద్ధి చేస్తారు? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి చర్యలతో ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరంపై ఉన్న నమ్మకం, బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీస్తున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు.

'పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండె ఆగిపోతుంది. కంటిమీద కునుకు ఉండట్లేదని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావట్లేదు. మాకు న్యాయం చేయండి' అంటూ బాధితుల ఆవేదన చెందారు. ఏ అవసరమొచ్చినా తెలంగాణ భవన్ తలుపులు తెరిచే ఉంటాయని, 24 గంటలు బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్‌లోనే అందుబాటులో ఉంటుందన్నారు.

సంబంధిత కథనం