Musi River Survey : మూసీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు.. నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం!
Musi River Survey : హైదరాబాద్‌లోని మూసీనది పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలోని అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ చేశారు. అక్రమంగా నివాసముంటున్నవారికి ఖాళీ చేయాలని చెబుతున్నారు. హిమాయత్‌నగర్ ఎమ్మార్వో నేతృత్వంలో సర్వే జరుగుతోంది.
హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా.. మూసీ రివర్ బెడ్ ఏరియాలో ఉన్న నిర్మాణాలను అధికారులు సర్వే చేసి పరిశీలించారు. పాతబస్తీలోని ఛాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ఏరియాల్లో కూల్చివేసే నిర్మాణాలకు మార్క్ చేశారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.
గొల్కొండ ఏరియాలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లోనూ అధికారులు సర్వే నిర్వహించారు. కూల్చాల్సిన నిర్మాణాలను గుర్తించి.. మార్క్ చేశారు. మొత్తం 25 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. అతి త్వరలోనే మార్క్ చేసిన నిర్మాణాలను కూల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలను ఒప్పించి.. వారికి వేరేచోట డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చి ఖాళీ చేయించాలని అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మూసీ నది వెంబడి రెవెన్యూ శాఖ నిర్వహించిన తాజా సర్వేలో.. నదీ గర్భంలో 2,116 నిర్మాణాలు, బఫర్ జోన్‌లో మరో 7,850 నిర్మాణాలు ఉన్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూసీ రివర్ ఫ్రంట్ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లలో పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేస్తున్నారు. నది ఒడ్డున ఉన్న నివాసాల నుండి ఖాళీ చేసే ప్రజలకు వసతి కల్పించడానికి ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 16,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించిందని ఆఫీసర్లు చెబుతున్నారు.
మొదటి దశలో మూసీ నదీగర్భంలో ఉన్న 1,600 ఆక్రమిత ఇళ్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్కడి నివాసితులను తరలించనున్నారు. బఫర్ జోన్‌లో నివసిస్తున్న వారికి న్యాయమైన పరిహారం, భూసేకరణ, పునరావాసం, పునరావాస చట్టం 2013లో పారదర్శకత హక్కుకు అనుగుణంగా వారి నిర్మాణాలకు పరిహారం అందుతుంది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అధికారులు.. అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లను రివర్ ఫ్రంట్ ప్రాంతానికి బుధవారం తరలించడం ప్రారంభించారు. శనివారం సాయంత్రానికి అంతా సిద్ధం చేసి.. ఆదివారం కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. ఏకకాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల రెవెన్యూ శాఖకు చెందిన బృందాలు.. మూసీ నది వెంబడి నిర్మాణాలను సర్వే చేయడం ప్రారంభించి.. అక్రమ కట్టడాల్లో నివాసముంటున్న ప్రజలను ఇంటింటికీ సర్వే చేసి ఖాళీ చేయించేలా చర్చలు జరిపారు.
రివర్ ఫ్రంట్‌లోని ప్రజలను.. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు తరలించిన తర్వాతే కూల్చివేత ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. బఫర్ జోన్‌లోని ప్రజల పునరావాసం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. స్పష్టమైన హక్కు పత్రాలు ఉన్న వారికి 2013 చట్టం ప్రకారం తగిన పరిహారం చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.